ఏవియేషన్ రంగంలో డిజిటల్ అనుసంధానతను తదుపరి స్థాయికి తీసుకెళ్తూ జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘లుఫ్తాన్సా గ్రూప్’ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్ భాగస్వామ్యంతో విమానాల్లో అత్యంత వేగవంతమైన, ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను లుఫ్తాన్సా అధికారికంగా ప్రారంభించింది.
ఆగస్టు 19న ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి రోమ్‌కు వెళ్లిన LH234 (ఎయిర్‌బస్ A320neo) వాణిజ్య విమానంలో లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సీఈఓ జెన్స్ రిట్టర్ స్వయంగా ఈ వై-ఫై సేవను ప్రారంభించారు. భూమికి 10,000 మీటర్ల ఎత్తులో విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఈ సేవలను యాక్టివేట్ చేశారు. ఈ సాంకేతికత ద్వారా ఇంట్లో లేదా ఆఫీసులో లభించే ఇంటర్నెట్ కంటే వేగవంతమైన బ్యాండ్‌విడ్త్ ప్రయాణికులకు అందుతుందని సంస్థ తెలిపింది.
2029 నాటికి 850 విమానాల్లో..
లుఫ్తాన్సా గ్రూప్‌లోని లుఫ్తాన్సా, స్విస్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్‌తో పాటు ఇతర అనుబంధ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 850 విమానాల్లో ఈ స్టార్‌లింక్ ఇంటర్నెట్ పరికరాలను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2029 నాటికి గ్రూప్‌లోని అన్ని విమానాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా ఈ రకమైన సాంకేతికతను భారీ స్థాయిలో అందిస్తున్న తొలి యూరోపియన్ ఎయిర్‌లైన్ గ్రూప్‌గా లుఫ్తాన్సా నిలవనుంది.
ప్రయాణికులకు ఉచితం.. కానీ నిబంధనలు..
లుఫ్తాన్సా 'మైల్స్ అండ్ మోర్' సభ్యులకు, 'ట్రావెల్ ఐడీ' యూజర్లకు ఈ వై-ఫై సేవ ఉచితంగా లభిస్తుంది. ప్రయాణికులు హెడ్‌ఫోన్లు లేకుండా ఆడియో/వీడియోలను ప్లే చేయడం, విమానంలో నుంచి వాయిస్ లేదా వీడియో కాల్స్ చేయడం, లైవ్ స్ట్రీమింగ్ చేయడంపై నిషేధం విధించారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేంతవరకు సముద్రాలు, ఎడారులపై ప్రయాణించేటప్పుడు కూడా అంతరాయం లేని ఇంటర్నెట్ అందించడమే తమ ప్రాధాన్యమని లుఫ్తాన్సా ప్రకటించింది.
ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..


