ఆర్‌బీఐ పాలసీ వైపు చూపు | RBI MPC policy, oil prices, bond yields may drive market Says market Experts | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీ వైపు చూపు

Oct 5 2026 4:23 AM | Updated on Oct 5 2026 4:23 AM

RBI MPC policy, oil prices, bond yields may drive market Says market Experts

గ్లోబల్‌ బాండ్ల ఈల్డ్స్‌ 

ముడిచమురు ధరలు 

విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి 

క్యూ2 ఫలితాల సీజన్‌ 

ఈ వారం పలు అంశాల ఎఫెక్ట్‌

పలు దేశ, విదేశీ అంశాలు ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు అత్యంత కీలకంగా నిలవనున్నాయి. ప్రధానంగా ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, యూఎస్‌ బాండ్ల ఈల్డ్స్, ముడిచమురు ధరలు దిశను నిర్దేశించే వీలున్నట్లు నిపుణులు తెలియజేశారు. 2026–27 రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాల సీజన్‌ ప్రారంభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల తీరు సైతం సెంటిమెంటును ప్రభావం చేయనున్నట్లు పేర్కొంటున్నారు.  

దేశీ స్టాక్‌ మార్కెట్ల దిశకు ఈ వారం అత్యంత కీలకంగా నిలవనుంది. సుమారు 8 వారాలపాటు నేలచూపులకే పరిమితమవుతున్న మార్కెట్లకు జోష్‌ వస్తుందా లేక మరింత బలహీనపడతాయా అన్నది పలు అంశాల ఆధారంగా నిర్దేశితంకానున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) విధాన సమీక్ష, దేశీ సాఫ్ట్‌వేర్‌ సేవల రంగ దిగ్గజం టీసీఎస్, రిటైల్‌ రంగ దిగ్గజం డీమార్ట్‌ జులై–సెప్టెంబర్‌(క్యూ2) ఫలితాలు ప్రకటించనుండటం ప్రధాన ఇండెక్సులను ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. మరోవైపు యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్షా వివరాలు(మినిట్స్‌) సైతం ఈ వారం వెల్లడికానున్నాయి. 

దిశకు దిక్సూచి...
నేటి నుంచి ప్రారంభంకానున్న ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షా సమావేశాలు బుధవారం(7న) ముగియనున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ ఈసారి వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చని అత్యధిక శాతంమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 0.25 శాతంమేర పెంచే వీలుంది. దీంతో రెపో ప్రస్తుత 5.25 శాతం నుంచి 5.5 శాతానికి బలపడనుంది. తద్వారా 2023 ఫిబ్రవరి తదుపరి మళ్లీ ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంపు దారి పట్టవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు తెలియజేశాయి. 

గత 4 సమీక్షలలో ఆర్‌బీఐ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వచ్చింది. అయితే రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) ఆగస్ట్‌లో 4.82 శాతానికి పెరగడం, ముడిచమురు ధరలతో ద్రవ్యోల్బణం మరింత వేడెక్కనుండటంసహా.. రాజకీయ భౌగోళిక ఆందోళనలు, తదితర అనిశి్చతులు వడ్డీ రేట్ల పెంపునకు దారి చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు వివరించారు. కాగా.. 2023 తదుపరి తొలిసారి ఫండ్స్‌ రేట్లను 0.25 శాతంమేర పెంచిన యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గత పాలసీ సమీక్షా వివరాలు(మినిట్స్‌) 7న విడుదలకానున్నాయి. ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 3.75–4 శాతంగా ఉంది.  

కొత్తగా లిస్టయిన.. 
ఇటీవల ఐపీవోలు ముగించుకున్న పలు కంపెనీలు ఈ ఏడాది క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. రెంట్‌మోజో, స్టీమ్‌హౌస్‌(5న), ఆర్సిల్, కనోహర్, గ్లాస్‌వాల్‌(6న)తోపాటు.. ఐటీ దిగ్గజం టీసీఎస్, జీఎం బ్రూవరీస్‌(8న), ఆనంద్‌రాఠీ, క్యాన్‌ఫిన్‌ హోమ్, పూనావాలా(9న), డీమార్ట్‌ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌(10న) పనితీరు తెలియజేయనున్నాయి. దీంతో ఈ ఏడాది క్యూ2 ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. 

విదేశీ అంశాలు...
యూఎస్, ఇరాన్‌ ఉద్రిక్తలతో మళ్లీ  ముడిచమురు ధరలు మండుతున్నాయి.  బ్రెంట్‌ చమురు ఒక దశలో 109 డాలర్లకు చేరగా.. యూఎస్‌ చమురు 103 డాలర్లను తాకింది. దీంతో 75 శాతం అవసరాలకుగాను దిగుమతి చేసుకునే ఇండియన్‌ బాస్కెట్‌(చమురు) ధరలు ప్రభుత్వానికి భారంగా పరిణమిస్తున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇది దేశీ కరెన్సీని దెబ్బ తీస్తున్నట్లు తెలియజేశారు.   మరోపక్క రష్యా చమురు దిగుమతులపై అమెరికా విధిస్తున్న ఆంక్షలు సైతం దీనికి జత కలుస్తున్నట్లు ఎన్‌రిచ్‌ మనీ సీఈవో పొన్ముడి ఆర్‌. పేర్కొన్నారు. ఒక దశలో డాలరు ఇండెక్స్‌ 103ను అధిగమించగా.. పదేళ్ల ట్రెజరీ ఈల్డ్స్‌ 5.3 శాతాన్ని దాటడం ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు తెలిపారు. ఇక విదేశీ  ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం ఏకంగా  రూ. 28,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడం గమనార్హం!

సాంకేతికంగా చూస్తే..
సాంకేతికంగా ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు కీలకంగా నిలవనుంది. స్వల్పకాలానికి మార్కెట్లు బలహీనంగా కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వెరసి నిఫ్టీకి 22,000, 21,800 పాయింట్ల వద్ద సపోర్ట్‌ లభించవచ్చు. ఈ స్థాయిల నుంచి పుంజుకోగలిగితే 22,500కు చేరుకోవచ్చు. ఆపై 22,700కూ వీలుంది. సెన్సెక్స్‌ 71,200– 71,000 పాయింట్ల మధ్య సపోర్ట్‌ తీసుకునే అవకాశముంది. ఇంతకంటే నీరసిస్తే 70,700 జారవచ్చు. ఒకవేళ మద్దతు స్థాయిలవద్ద బలపడితే.. 73,000 పాయింట్లను తాకే వీలుంది.

గత వారమిలా 
విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు, ముడిచమురు ధరలు, రూపాయి బలహీనతతోపాటు ప్రధానంగా యూఎస్, జపనీస్‌ బాండ్ల ఈల్డ్స్‌ ప్రతికూల ప్రభావం చూపడంతో వరుసగా  8వ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. దీంతో సెన్సెక్స్‌ 1,986 పాయింట్లు(2.7 శాతం) పతనమై 71,910 వద్ద ముగిసింది. నిఫ్టీ 719 పాయింట్లు(3.1 శాతం) కోల్పోయి 22,422 వద్ద స్థిరపడింది. గత నెలలో సెన్సెక్స్‌ 4,477 పాయింట్లు(5.8 శాతం) దిగజారగా.. నిఫ్టీ 1,460 పాయింట్లు(6   
శాతం) పడిపోయింది! 
    
– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement