మరో ఐదేళ్లు మహా జోరు  | Special report by Sakshi Wealth on the Healthcare Economy | Sakshi
Sakshi News home page

మరో ఐదేళ్లు మహా జోరు 

Oct 5 2026 4:10 AM | Updated on Oct 5 2026 4:14 AM

Special report by Sakshi Wealth on the Healthcare Economy

భారీ విస్తరణలో అపోలో టు ఆస్టర్, మణిపాల్‌ టు మ్యాక్స్‌

స్పెషాలిటీతో ముందుకెళుతున్న రెయిన్‌బో, నారాయణ, మెదాంతా

వచ్చే ఐదేళ్లలో మరో 50 శాతం పెరగనున్న ఆసుపత్రి బెడ్స్‌: ఇక్రా

బెడ్లు పెరిగితే వైద్యుల నుంచి మందుల దాకా అన్నిటికీ బూస్ట్‌

మొత్తం హెల్త్‌కేర్‌ ఎకానమీకి ఇంజిన్‌గా మారనున్న విస్తరణ

పెరిగే బెడ్లను లాభసాటిగా మార్చుకున్న ఆసుపత్రులదే భవిత

అధిక వేల్యుయేషన్లున్న సంస్థ మంచిదైనా... ప్రస్తుతానికి దూరం

అలాంటి షేర్లను గమనించడానికి ఇన్వెస్టర్లు చేయాల్సిందిదే

‘హెల్త్‌కేర్‌ ఎకానమీ’పై సాక్షి వెల్త్‌ ప్రత్యేక కథనం

మందుల తయారీ ఫార్మా కంపెనీలది!. వాడేది రోగులు!. కానీ... ఆ రెండింటికీ మధ్య ఉండి మందుల్ని రోగులకిచ్చేది మాత్రం ఆసుపత్రులు. హెల్త్‌కేర్‌ గొలుసులో టాప్‌గేర్‌  వీటిదే. దేశంలో ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ హెల్త్‌కేర్‌పై పెట్టే ఖర్చూ పెరుగుతోంది. అందుకే కొత్త ఆసుపత్రులొస్తున్నాయి. ఉన్న ఆసుపత్రులు పడకలు పెంచుతున్నాయి. కొత్త బ్రాంచీలు తెరుస్తున్నాయి. 

కొన్నయితే ఫైవ్‌స్టార్‌ హోటళ్లను తలదన్నే సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మరి వీటిలో లాభపడేదెవరు? ఎక్కువ పడకలు ఉన్నదెవరికి? వాటిని లాభసాటిగా వినియోగిస్తున్నదెవరు? దేశంలోని టాప్‌ ఆసుపత్రుల్లో ఇన్వెస్టర్లకు లాభాలిచ్చే సత్తా వేటికుంది? వీటినెలా ఎంచుకోవాలి? అసలు హాస్పిటల్‌ స్టాక్స్‌ సురక్షితమైనవేనా? వీటి వివరాలన్నీ ఈ వారం ‘హెల్త్‌కేర్‌ ఎకానమీ’ స్టోరీలో చూద్దాం...

‘‘ప్రైవేటు ఆసుపత్రులు ఎవ్వరినీ వదలటం లేదు. మందుల్ని తమ సొంత ఫార్మసీల్లోనే కొనాలంటూ... వాటిపై 10 రెట్ల ధర వసూలు చేస్తున్నాయి. అసలు మందులపై మార్జిన్లు 16% మించకూడదని ప్రభుత్వం నిబంధనను పెట్టొచ్చు కదా?’’ అంటూ గతవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఆసుపత్రుల షేర్లన్నీ భారీగా పతనమయ్యాయి.  కొన్ని గంటల్లో వేల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరైపోయింది. దీన్నిబట్టే ఈ ఆసుపత్రులు ఆర్జిస్తున్న లాభాలను అర్థం చేసుకోవచ్చు. 

పేషెంట్లకు అందించే వైద్యంపైనే కాకుండా... తమ ఫార్మీసీల్లో విక్రయించే మందులపై ఇవి ఫార్మా కంపెనీలకన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నాయని తెలుసుకోవచ్చు. ఇన్వెస్టర్లు ఈ కోణాన్ని కూడా చూడాలి. ఎందుకంటే ఆదాయ మార్గాలు పెంచుకుంటూ దేశంలోని వ్యవస్థీకృత ఆసుపత్రులు విస్తరణ దశను చేరుకున్నాయి. పడకలు పెంచుతున్నాయి. ఈ పడకల్ని లాభసాటిగా మార్చటమనేది తదుపరి దశ. ఆ దశను విజయవంతంగా దాటగలిగేవే వెల్త్‌ క్రియేటర్లు. 

ఒక ఆసుపత్రిలో ఆక్యుపెన్సీ ఏ స్థాయిలో ఉంది? 
ప్రభుత్వ స్కీముల పరిధిలోనివారేనా... లేక ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు? 
ఫీజులు ప్రీమియం స్థాయిలో ఉన్నాయా... లేక సాధారణంగానా? 
ఎలాంటి వైద్యసేవలందుతున్నాయి? వైద్యుల రేటింగ్‌ ఎలా ఉంది? 
ఇదిగో... ఇలాంటి అంశాలే ఒక ఆసుపత్రి షేరు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రెండు పెద్ద ఆసుపత్రులు ఒకేస్థాయిలో పడకల సంఖ్యను పెంచినా ఒకటి రాణించడానికి, మరోటి రాణించకపోవటానికి కారణాలు ఇవే. రేటింగ్‌ సంస్థ ఇక్రా అంచనాల ప్రకారం... వచ్చే రెండేళ్లలో ఆక్యుపెన్సీతో పాటు సగటు పేషెంట్‌పై వచ్చే రాబడి పెరుగుతుంది. దీంతో ప్రధాన ఆసుపత్రుల ఆదాయం 13–15 శాతం పెరగొచ్చు. వచ్చే ఐదేళ్లూ ఆసుపత్రుల సామర్థ్యంలో కీలకంగా మారొచ్చు. 

ఐదేళ్లలో...అత్యంత భారీ పెరుగుదల 
2026–2030 ఆర్థిక సంవత్సరాల మధ్య 18 ప్రధాన ఆసుపత్రులు ఏకంగా 34వేల పడకలు అదనంగా సమకూరుస్తాయన్నది ఇక్రా అంచనా. 2025 మార్చి సామర్థ్యంతో పోలిస్తే ఇది ఏకంగా 50 శాతం ఎక్కువ. దీనర్థమేంటి? ఆసుపత్రుల ఇన్‌ఫ్రాతో పాటు ఐసీయూ పరికరాలు, మెడికల్‌ డివైజ్‌లు, వైద్య పరీక్షలు, సర్జికల్‌ వస్తువులు, ఫార్మసీ, హెల్త్‌కేర్‌ ఐటీ,  బీమా, వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, డిశ్చార్జి తరవాతి సంరక్షణ ఇవన్నీ కూడా మరో 50 శాతం పెరుగుతాయనేగా?  

ఇన్వెస్టర్లు చూడాల్సిందివే... 
→ ఆక్యుపెన్సీ: వెయ్యి పడకలున్న రెండు ఆసుపత్రుల్లో ఒకటి 75 శాతం... మరొకటి 45 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయనుకోండి. వాటికి పోలికే లేనట్టు లెక్క. 
→ ఆక్యుపైడ్‌ బెడ్‌పై రాబడి: ప్రతి ఆక్యుపైడ్‌ బెడ్‌పై రాబడి (ఏఆర్‌పీఓబీ) ఎంత వస్తుందన్నది ప్రీమియం ధరలు... క్లిష్టమైన వైద్య సేవలు... స్పెషాలిటీ సరీ్వసులు... మెరుగైన ఇన్‌ఫ్రా... బీమా– ప్రైవేటు పేమెంట్ల నిష్పత్తి తదితరాలపై ఆధారపడుతుంది.  
    ఇంకా ఎబిటా మార్జిన్, పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి (ఆర్‌ఓసీఈ), విస్త రణ వేగం, రుణాలు కూడా చూడాల్సి ఉంటుంది.

ప్రధాన లిస్టెడ్‌ ఆసుపత్రులు ఇవే... 
→ అపోలో హాస్పిటల్స్‌ 
→ మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ 
→ మణిపాల్‌ హెల్త్‌ 
→ ఆస్టర్‌ డీఎం క్వాలిటీ కేర్‌ 
→ ఫోరి్టస్‌ హెల్త్‌కేర్‌ 
→ గ్లోబల్‌ హెల్త్‌/మెదాంతా 
→ కిమ్స్‌ 
→ రెయిన్‌బో చి్రల్డన్స్‌ 
→ యథార్త్‌ హాస్పిటల్స్‌ 
→ ఇవికాక జుపిటర్‌ లైఫ్‌లైన్, 
→ కోవై మెడికల్‌ సెంటర్, ఆర్టెమిస్, షల్బీ వంటి చిన్న ఆసుపత్రులూ ఉన్నాయి.

అపోలో హాస్పిటల్స్‌ 
అపోలో కేవలం ఆసుపత్రే కాదు. 8,352 బెడ్లు, సొంత ఫార్మసీ బ్రాండ్‌తో పాటు డయాగ్నస్టిక్స్, డిజిటల్‌ హెల్త్, హెల్త్‌కేర్‌ సేవలందించే సమగ్ర హెల్త్‌కేర్‌ వ్యవస్థ. 2027 తొలి క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ఆదాయం రూ.7,043 కోట్లు. కన్సాలిడేటెడ్‌ ఎబిటా రూ.1,092 కోట్లు. ఇవి 21 శాతం, 28 శాతం పెరిగినట్లు లెక్క. ఆక్యుపెన్సీ రేషియో దాదాపు 70 శాతం. గడిచిన రెండు త్రైమాసికాల్లోనే 5 కొత్త ఆసుపత్రుల్ని ఆరంభించింది. రకరకాల హెల్త్‌కేర్‌ వ్యాపారాలుండటం అనుకూలం.

మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ 
ప్రీమియం హెల్త్‌కేర్‌ నెట్‌వర్క్‌ ఈ సంస్థ సొంతం. ప్రత్యేకించి నార్త్‌ ఇండియాలో జోరుగా విస్తరిస్తోంది. ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఆదాయం 16.7 శాతం పెరిగి రూ.2,366 కోట్లుగా, ఎబిటా 14.2 శాతం పెరిగి 639 కోట్లుగా నమోదైంది. కానీ లాభం 5 శాతమే పెరిగింది. పడకలు పెరిగితే ఆదాయం పెరుగుతుంది కానీ... లాభాలు ఆ స్థాయిలో పెరగవనటానికి మ్యాక్స్‌ ఉదాహరణ. విస్తరణ మొత్తం లాభాల దశలోకి రావటానికి మరికొన్నాళ్లు పట్టొచ్చు.

మణిపాల్‌ హెల్త్‌ 
ఇటీవలి విస్తరణ, కన్సాలిడేషన్‌తో మణిపాల్‌ హెల్త్‌ దేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత ఆసుపత్రుల్లో ఒకటిగా మారింది. మూడేళ్లుగా 29 శాతం కాంపౌండెడ్‌ వార్షిక వృద్ధిని 
సాధిస్తుండటంతో వాల్యుయేషన్‌ ఏకంగా 220 రెట్లు దాటేసింది. భవిష్యత్‌ వృద్ధిని కూడా ఈ విలువ సూచిస్తోంది కనక ఇన్వెస్టర్లు జాగ్రత్త పడటం అవసరం.

ఆస్టర్‌ డీఎం 
క్వాలిటీ కేర్‌తో విలీనం పూర్తయ్యాక ఆస్టర్‌ డీఎం పరిమాణం బాగా పెరిగింది. దీంతో 2026 ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయం రూ.9,273 కోట్లకు, ఆపరేటింగ్‌ ఎబిటా రూ.2,013 కోట్లకు చేరాయి. మొత్తం 10,623 బెడ్లతో అతిపెద్ద ఆసుపత్రిగా నిలవగా వచ్చేనాలుగేళ్లలో ఈ కంపెనీ మరో 2500 పడకల్ని జత చేసే ప్రయత్నాల్లో ఉంది. దీనికోసం రూ.2,700 కోట్లు పెట్టుబడి పెడుతోంది. వీటిని లాభాల్లోకి తేగలుగుతుందా? దానికి ఎన్నాళ్లు పడుతుంది? అనేదే ఇన్వెస్టర్లు చూడాల్సింది.

యథార్థ్‌ హాస్పిటల్స్‌ 
ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతంలోని టైర్‌–2, టైర్‌–3 ప్రాంతాల్లో వే గంగా విస్తరిస్తున్న సంస్థ ఇది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.392 కోట్ల ఆదాయాన్ని రూ.92 కోట్ల ఎబిటాను సాధించింది. 68% ఆక్యుపెన్సీ ఉన్న ఈ సంస్థలో 24.9% వాటా కోసం ఇటీవలే అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ రూ.3,150 కోట్లు వెచ్చించింది. ప్రస్తుతం 2,800 పడకలున్న ఈ సంస్థ త్వరలో దీన్ని 3,250కి చేర్చాలనే ప్రయత్నాల్లో ఉంది. భారీ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు దేశీ ఆసుపత్రుల్లో భారీ వృద్ధిని ఆశిస్తున్నారని, ఇన్వెస్ట్‌మెంట్లకూ సిద్ధంగా ఉన్నారని చెప్పటానికి యథార్థ్‌ హాస్పిటల్స్‌ తాజా డీల్‌ ఒక ఉదాహరణ.

గ్లోబల్‌ హెల్త్‌/మెదాంతా 
పేషెంట్ల సంఖ్యను బట్టి కాకుండా వారికి అందిస్తున్న సేవల ఆధారంగా అంచనా వేయాల్సిన సంస్థ ఇది. ఎందుకంటే కేన్సర్, కార్డియాక్, న్యూరో, అవయవ మారి్పడి, పిల్లల సర్జరీల వంటి సంక్లిష్ట చికిత్సలందిస్తూ టెరిషరీ, క్వాటర్నరీ సేవల ఆసుపత్రిగా ఎదుగుతున్న సంస్థ ఇది. రోగుల సంఖ్య తక్కువైనా వారికందించే సేవల విలువ అధికం కాబట్టి ఆదాయాలూ ఆ స్థాయిలోనే ఉంటున్నాయి. ఈ ఏడాది క్యూ1లో రూ.1,326 కోట్ల ఆదాయాన్ని సాధించిందీ సంస్థ.  

నారాయణ హృదయాలయ 
రోగుల సంఖ్యలో మిగతావాటికన్నా ముందుండే సంస్థ ఇది. భారీ పేషెంట్లు, సమర్థ కార్యకలాపాలు, సమగ్రమైన కార్డియాక్‌ కేర్‌ వ్యవస్థ, అందుబాటు ధరలు... ఇవన్నీ ఈ ఆసుపత్రి ప్రత్యేకతలు. గతేడాది రూ.7,986 కోట్ల ఆదాయాన్ని, రూ.1,717 కోట్ల ఎబిటాను సాధించింది. వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ... ఇదివరకటి ఆదాయాలను, లాభాలను కాపాడుకోగలదా? లేదా? అన్నదే ఇన్వెస్టర్లు చూడాల్సింది.

కిమ్స్‌ 
తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న కిమ్స్‌... గతే డాది రూ.3,921 కోట్ల ఆదాయాన్ని, రూ.828 కోట్ల ఎబిటాను సాధించింది. ఈ ఏడాది క్యూ1లో 36.1% వృద్ధితో రూ. 1,196 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎబి టా వృద్ధి 20.1%గా ఉంది. ఎబిటా మార్జిన్లు పెరుగుతున్నా లాభం గతేడాదితో పోలిస్తే తగ్గి రూ.37 కోట్లుగా నమోదైంది.  విస్తరణ జోరు నేపథ్యంలో తరుగుదల, ఫైనాన్సింగ్‌ ఛార్జీలు తాత్కాలికంగా లాభాలపై ప్రభావం చూపిస్తున్నట్లు గమనించాలి.

రెయిన్‌బో చిల్డ్రన్స్‌  
ఇది సాధారణ ఆసుపత్రికాదు. పసి పిల్లలు, మహిళలు, ఫెర్టిలిటీ, తల్లీబిడ్డ సంరక్షణ వంటి స్పెషాలిటీ సేవలకే పరిమితమైన ఆసుపత్రి. గతేడాది రూ.1,747 కోట్ల ఆదాయంపై రూ.282 కోట్ల ఆదాయాన్ని సాధించిన ఈ సంస్థ తొలి క్వార్టర్లో రూ.470 కోట్ల ఆదాయాన్ని, రూ.135 కోట్ల ఎబిటాను సాధించింది. మిగతా ఆసుపత్రులతో పోలిస్తే ఆక్యుపెన్సీ చాలా తక్కువ. 41 శాతమే. కానీ  స్పెషాలిటీ సేవల కారణంగా తన ఆదాయాలను మాత్రం నిలబెట్టుకుంటోంది. ఆక్యుపెన్సీ పెరిగితే ఈ సంస్థ లాభాలూ భారీగానే ఉండొచ్చు. ఇన్వెస్టర్లు గమనించాల్సిందిదే.

ఫోరి్టస్‌ హెల్త్‌కేర్‌
ఆసుపత్రులొక్కటే కాదు. ఎజిలస్‌ డయాగ్నస్టిక్స్‌ కూడా దీని సొంతం. గతేడాది రూ. 9,128 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయాన్ని సాధించగా దీన్లో ఎజిలస్‌ ఆదాయం రూ.1,527 కోట్లు. ఆక్యుపె న్సీ రేషియో 68%. కాకపోతే రూ.2,334 కోట్ల రుణాలున్నాయి. ఇన్వెస్టర్లు గమనించాల్సిందొకటే. విలీనాలతో ఫోరి్టస్‌ వేగంగా విస్తరిస్తోంది. కాకపోతే దానికి రుణాలు తీసుకుంటోంది. విలీనం చేసుకునే ఆసుపత్రుల ఇంటిగ్రేషన్, రుణాల చెల్లింపు, సమర్థ  నిర్వహణపైనే భవిష్యత్‌ పెరుగుదల ఉంటుంది.

తాజా ఫలితాలు చెప్పేదేంటంటే... 
→ గ్రూప్‌–ఎ: దేశీ ఆసుపత్రులను గనక తాజా ఫలితాలను బట్టి విశ్లేíÙస్తే బలమైన వృద్ధితో పాటు మంచి మార్జిన్లున్న గ్రూప్‌–ఎలో అపోలో, మెదాంతా, ఆస్టర్, రెయిన్‌బో ఆసుపత్రులను చేరొర్చు. ఆరోగ్యకరమైన మార్జిన్లతో పాటు సమర్థమైన నిర్వహణ తీరును కూడా ఈ ఆసుపత్రుల్లో గమనించవచ్చు.  

→ గ్రూప్‌–బి: విస్తరణను మున్ముందు లాభాలుగా ఎలా మార్చగలుగుతాయనే వాచ్‌లిస్ట్‌లో ఉండాల్సిన ఆసుపత్రులివి. మ్యాక్స్, ఫోరి్టస్, కిమ్స్, నారాయణ హృదయాలయ ఈ జాబితాలోకి వస్తాయి.  

→ గ్రూప్‌–సి: ప్రాంతీయ  స్థాయిలో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థలో తాజాగా అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ పెట్టుబడి పెట్టడమనేది కీలక పరిణామం. ప్రాంతీయ మోడల్‌లో మంచి లాభాలున్నాయని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నట్లు ఈ పరిణామం చెబుతోంది.  

చివరిగా చెప్పాల్సిందొకటే. పైన పేర్కొన్న షేర్లలో కొన్ని 55 రెట్ల పీఈ వద్ద ట్రేడవుతూ ఉంటే కొన్ని ఏకంగా 200–220 రెట్ల పీఈ వద్ద ట్రేడవుతున్నాయి. ఎంత మంచి షేరైనా మనం ఏ ధర వద్ద కొంటున్నామనేది ముఖ్యం. 200 పీఈ వద్ద ట్రేడయ్యే సంస్థ... ఎంత మంచి వృద్ధిని నమోదు చేసినా షేరు ధరలో పెరుగుదల పరిమితంగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. కానీ ఒకవేళ ఆదాయాల్లో తేడాలొస్తే పతనం భారీగా ఉంటుంది. ఇలాంటి షేర్లలో రివార్డు కన్నా రిస్కే ఎక్కువ. వీటికి దూరంగా ఉంటేనే మంచిది. అలా కాకుండా నిలకడగా పెరుగుతూ... తక్కువ పీఈ వద్ద ట్రేడయ్యే షేర్లయితే రాబడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. 

→ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఒకేరోజు ప్రధాన ఆసుపత్రుల షేర్లు భారీగా పతనమవటాన్ని ఇన్వెస్టర్లు తేలిగ్గా తీసుకోవాల్సిన పనిలేదు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు గనక ప్రభుత్వం అమల్లోకి తెచ్చి... మందుల మార్జిన్లపై నియంత్రణలు పెడితే అది ఖచ్చితంగా వీటి లాభాలపై ప్రభావం చూపిస్తుంది. ఆ రిస్కును కూడా ఇన్వెస్టర్లు గమనిస్తూనే ఉండాలి.

‘పరీక్ష’లో పాసయ్యేదెవరు?  
డయాగ్నస్టిక్స్‌ అంటే... ఒక సమగ్ర సమాచార వ్యవస్థ. పేషెంట్‌కు ఏం జరుగుతోందో వైద్యులకు చెప్పే ఇన్ఫర్మేసన్‌ సిస్టమ్‌. కొన్నాళ్ల కిందటి వరకూ వైద్య పరీక్షలంటే దగ్గర్లోని ఆసుపత్రికో, లాబోరేటరీకో వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఇపుడవి ఇంటికొచ్చేశాయి. లోకల్‌ లాబోరేటరీల  స్థానంలో ఆర్గనైజ్డ్‌ డయాగ్నస్టిక్‌ చెయిన్లు వచ్చాయి. అవిపుడు ఇంటిగ్రేటెడ్‌ డయాగ్నస్టిక్‌ ప్లాట్‌ఫారాలుగా మారుతున్నాయి. లక్ష కోట్ల ఈ మార్కెట్లో నిలిచేదెవరు? ‘పరీక్ష’ల్లో పాసై గెలిచేదెవరు? వచ్చే వారం ‘హెల్త్‌కేర్‌ ఎకానమీ పార్ట్‌–3’లో....  

రమణమూర్తి మంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement