యువత ఆర్థిక స్వేచ్ఛకు.. ఎన్‌పీఎస్‌ | NPS for Young Indians Early Investments Financial Freedom | Sakshi
Sakshi News home page

యువత ఆర్థిక స్వేచ్ఛకు.. ఎన్‌పీఎస్‌

Oct 5 2026 3:53 AM | Updated on Oct 5 2026 4:03 AM

NPS for Young Indians Early Investments Financial Freedom

చాలా మంది యువ భారతీయులకు, నేషనల్‌ పెన్షన్‌ సిస్టం (ఎన్‌పీఎస్‌) అంటే అదేదో పాతతరపు పెన్షను, ట్యాక్స్‌ సేవింగ్, రిటైర్మెంటు మొదలైన అవసరాల కోసం మాత్రమే పనికొచ్చే సాధనమనే అపోహ ఉంది. ఇది అర్థం చేసుకోతగినదే అయినప్పటికీ ప్రస్తుతం ఈ ధోరణి మారుతోంది. రిటైర్మెంట్‌ దగ్గర్లో ఉండగా అప్పటికప్పుడు పరుగులు పెట్టకుండా, ముందు నుంచే ఆర్థిక స్వాతంత్య్ర ప్రణాళికలను ప్రారంభించేందుకు సరళతరమైన, పారదర్శకమైన, డిజిటల్‌ ప్లాట్‌ఫాంగా ఎన్‌పీఎస్‌ నిలుస్తోంది.

యువ భారతీయులు ఇన్వెస్ట్‌ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ప్రశ్న కాదు. చాలా మంది చేస్తూనే ఉన్నారు. వాళ్లకు డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు సౌకర్యవంతంగా అనిపిస్తున్నాయి. వారికి మార్కెట్‌ ఆధారిత ప్రోడక్టుల గురించి అవగాహన ఉంటోంది. తమ డబ్బు విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించే ధోరణి కూడా వారిలో ఉంది. అయితే, దశాబ్దాల దూరంలో ఉండే లక్ష్యాల సాధన కోసం వాళ్లు నిలకడగా ఎంతో కొంతైనా పక్కన పెడుతున్నారా లేదా అనేది అసలైన ప్రశ్న.

సాధారణంగా మన దగ్గర రిటైర్మెంట్‌ గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో పాటు దాని కోసం కేటాయించడం, కొనసాగించడంపరమైన సవాళ్లు కూడా ఉంటున్నాయి. ఎప్పుడో భవిష్యత్తుకు సంబంధించినది కాబట్టి ఆదాయం పెరిగినప్పుడో, జీవితంలో ప్రధాన లక్ష్యాలు సాధించుకోవడం పూర్తయినప్పుడో లేదా పన్నుల సీజన్‌ దగ్గరపడుతున్నప్పుడో ఆలోచించవచ్చనే అభిప్రాయం ఉంటోంది. కానీ, ఆర్థిక స్వాతంత్య్రం అనేది ఎప్పుడో తీసుకునే ఒక్క పెద్ద నిర్ణయంపై కాకుండా కాలక్రమేణా చిన్న చిన్న మొత్తాలను పోగేయడం ద్వారానే సాధ్యపడుతుంది.  

పారదర్శకంగా ఎన్‌పీఎస్‌ 
యువ ఇన్వెస్టర్లు.. పెన్షన్లను అంతగా పరిగణనలోకి తీసుకోకపోవడానికి సదరు సాధనాలు చాలా సంక్లిష్టంగా అనిపించడం కూడా ఓ కారణం. పెన్షన్‌ ఫండ్‌లు, పెట్టుబడి సాధనాలు, పనితీరుకు సంబంధించి అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్ల గురించి ఆకళింపు చేసుకోవడం కష్టమైన వ్యవహారంగా అనిపిస్తుంది. అవసరాన్ని తెలుసుకుని చకచకా పని చేసే యాప్‌లు, ఎప్పటికప్పుడు లభించే సమాచారం, తమ చేతిలోనే మరిన్ని నియంత్రణాధికారాలకు అలవాటుపడిన ఈ తరం వాళ్లు, రిటైర్మెంట్‌ ప్రణాళికలను వాయిదా వేస్తుండటం వెనుక, ఈ సాధనాలు సంక్లిష్టంగా ఉండటం కూడా ఒకానొక కారణంగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏకి చెందిన ఎన్‌పీఎస్‌ ప్రైడ్‌–దిశ అనేది ఈ సాధనాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చే దిశగా ఒక కీలక ముందడుగులాంటిది.

రోజువారీ ఎన్‌ఏవీ డేటా, ఎక్స్‌ఐఆర్‌ఆర్‌ మెథడాలజీని ఉపయోగించి పెన్షన్‌ ఫండ్ల చారిత్రక పనితీరును పోల్చి చూసుకునేందుకు ఈ సాధనం ఉపయోగపడుతుంది. పాయింట్‌ టు పాయింట్‌ రాబడులకే పరిమితం కాకుండా తరచుగా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలియజెబుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్రమం తప్పకుండా పెట్టిన పెట్టుబడులు వివిధ పెన్షన్‌ ఫండ్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాలు ఏ విధమైన రాబడులు అందించాయనేది మరింత వాస్తవికంగా ఇది చూపుతుంది. ఇన్వెస్టర్లు సదరు ఫండ్‌ని ఎంచుకునేటప్పుడు రిస్కు సామర్థ్యాలు, పెట్టుబడుల కాలవ్యవధి, వ్యక్తిగత లక్ష్యాలతో పాటు చారిత్రక పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కవచంగా..
యువ ఇన్వెస్టర్లకు సంబంధించి ఆర్థిక స్వాతంత్య్రం అంటే నిధిని పోగు చేసుకోవడం మాత్రమే కాదు. అవాంతరాలు ఎదురైనా ప్రస్థానాన్ని కొనసాగించడం కీలకం. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఎదురయ్యే అనూహ్య ఖర్చు ఇలాంటి ప్రణాళికలకు పొంచి ఉండే రిస్కుల్లో ఒకటిగా ఉంటుంది. అత్యవసర వైద్యం లేదా ఆరోగ్య సంరక్షణ కోసం జేబులో నుంచి పెట్టుకోవాల్సి రావడంలాంటి పరిస్థితులు, ముఖ్యంగా యువ కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాల్లో పొదుపు అలవాట్లను దెబ్బతీయొచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రవేశపెట్టిన ఎన్‌పీఎస్‌ స్వాస్థ్యలాంటి ఆవిష్కరణలు .. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడులను నిరాటంకంగా కొనసాగించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.

క్రమం తప్పకుండా పెట్టుబడులతో ఫలితాలు.. 
అకౌంట్‌ తెరవడానికే పరిమితం కాకుండా, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెడితేనే ఫలితాలు వస్తాయి. కనుక ట్యాక్స్‌ ప్లానింగ్‌ వేళ మాత్రమే గుర్తు తెచ్చుకోవడం కాకుండా ప్రతి నెలా ఖర్చులు, ఎమర్జెన్సీ అవసరాలకు పొదుపు, ఇతరత్రా బీమా, మదుపులో ఇది కూడా ఒక భాగంగా మారాలి. తక్కువ మొత్తాలతో ప్రారంభించినా సరే క్రమశిక్షణతో కొనసాగిస్తే, కాంపౌండింగ్‌ మహిమ వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. యువ ఇన్వెస్టర్లకు ఎన్‌పీఎస్‌ను మరింత చేరువ చేయాలంటే, ఇది మరింత సులభతరంగా అందుబాటులో ఉండేలా చూడాలి.

ఈ ఖాతా తెరవాలంటే బోలెడన్ని పత్రాలు కావాలి, రోజువారీ ఆర్థిక అలవాట్లకు భిన్నమైన వ్యవహారం అనే అభిప్రాయం కలగకూడదు. స్పష్టంగా పోల్చి చూసుకునేందుకు వీలుగా, సరళంగా ఉండి, చాయిస్‌లు మరింత సుస్పష్టంగా కనిపిస్తే యువత పూర్తి సమాచారంతో, మరింత ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పడుతుంది. యువ ఇన్వెస్టర్లు ఇప్పటికే యాప్‌లు, యూపీఐ, రికరింగ్‌ మ్యాన్‌డేట్‌ల ద్వారా డబ్బు వ్యవహారాలను సొంతంగానే చక్కబెట్టుకుంటున్నారు. కాబట్టి ఆన్‌బోర్డింగ్‌ సరళతరంగా ఉండి, యూపీఐ ఆటోపే, సుపరిచితమైన మాధ్యమాల ద్వారా డిజిటల్‌గా పెట్టుబడులు పెట్టే వెసులుబాటుతో ఎన్‌పీఎస్‌ మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగాలి.

తొలినాళ్ల నుంచే ఫోకస్‌..
యువ ఇన్వెస్టర్లు, రిటైర్మెంట్‌కి దగ్గరయ్యే వరకు వేచి చూస్తూ ఉండొద్దు. ఆదాయార్జన మొదలైనప్పటి నుంచే ఎన్‌పీఎస్‌ను తమ ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా చేసుకోవచ్చు.  ఎందుకంటే ముందు నుంచే నిలకడగా తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలతోనే ఆర్థిక స్వాతంత్య్రం సాధించవచ్చు. ఎమర్జెన్సీ పొదుపు, బీమా, సంపద సృష్టికి దోహదపడే ఇతరత్రా పెట్టుబడులతో పాటు విస్తృత పోర్ట్‌ఫోలియోలో దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్య్రానికి తోడ్పడే సాధనంగా ఇది నిలవగలదు. మార్కెట్లలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, జీవితంలో వివిధ దశల్లో క్రమశిక్షణతో, భవిష్యత్తుపై దృష్టి పెడుతూ ఇన్వెస్టింగ్‌ని కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది. ప్రస్తుత ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం 15 ఏళ్ల పెట్టుబడి కాలవ్యవధితో లభిస్తున్న ఈ సాధనాన్ని ఎప్పుడో 60 ఏళ్ల తర్వాతే ఉపయోగపడేదిగా చూడనక్కర్లేదు. అంతకన్నా ముందుగానే నిర్దిష్ట కాలవ్యవధిలో ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించుకునేందుకు ఉపయోగపడే సాధనంగా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement