‘ఎల్‌నినో’తో పొంచి ఉన్న పెను ముప్పు
పసిఫిక్ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలుగా నమోదు
1877 రికార్డు బద్దలుకొడుతూ గరిష్ట ఉష్ణోగ్రతలు
వాతావరణ సమతుల్యత భారీగా గతితప్పే ప్రమాదం
భారత్‌లో కమ్ముకోనున్న కరువు మేఘాలు
ఆశలన్నీ మాడెన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ) పైనే
ఎంజేఎం కదలికల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్న వాతావరణ శాఖ
సాక్షి, విశాఖపట్నం : మహాసముద్రం ఉడుకుతోంది.. వాతావరణం గతితప్పుతోంది.. ప్రపంచాన్ని శాసించే పసిఫిక్ మహాసముద్రంలో నిప్పులు రగులుతున్నాయి.. ఎన్నడూ లేనివిధంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3.6 డిగ్రీలు అదనంగా నమోదవుతూ సరికొత్త విపత్తుకు ప్రమాదపు బాటలు వేస్తున్నాయి. 1877లో అత్యధికంగా నమోదైన 2.75 డిగ్రీల రికార్డును సైతం తుడిచిపెట్టేస్తున్న ఈ తీవ్ర ఎల్‌నినో పరిణామాలు.. దేశ వ్యవసాయ రంగానికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రుతుపవనాలు ముఖం చాటేసి, భయానక కరువు పరిస్థితులు దాపురిస్తాయన్న ఆందోళనలు ప్రస్ఫుటిస్తున్నాయి. ఈ విపత్తు నుంచి గట్టెక్కాలంటే.. ఇప్పుడు ఎంజేఓ పవనాల కరుణ మినహా మరో మార్గం లేదంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం మునుపెన్నడూ లేని స్థాయిలో విశ్వరూపం దాల్చనుందని వాతావరణ శాఖగణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్‌ఎస్‌టీ) అసాధారణంగా పెరగడాన్ని ఎల్‌నినో అంటారు. తాజా అంచనాల ప్రకారం.. ఈ ఏడాదికి ఉష్ణోగ్రతల తీవ్రత సాధారణ స్థాయి కంటే ఏకంగా 3.6 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర ఎక్కువగా నమోదు కానుంది. గత 150 ఏళ్ల ఎల్‌నినో చరిత్రలో ఇది అత్యంత ప్రమాదకరమైన రికార్డుగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు ఇంత భారీ స్థాయిలో పెరగడం వాతావరణ నిపుణులను, శాస్త్రవేత్తలను సైతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విశ్లేషించిన నమూనాల్లో ఏకంగా 80 శాతం పైగా వెదర్ మోడల్స్ ఈ భారీ ఉష్ణోగ్రత పెరుగుదలను ధ్రువీకరిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.
1877 కరాళ నృత్యం కంటే మహా తీవ్రం.!
వాతావరణ చరిత్రను పరిశీలిస్తే, 1877–78 కాలంలో వచ్చిన ఎల్‌నినోను ప్రపంచంలోనే అత్యంత వినాశనకరమైన వాటిలో ఒకటిగా పరిగణిస్తారు. అప్పట్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయితే, ఆనాటి ఉష్ణోగ్రతల కంటే ప్రస్తుత అంచనా 0.8 డిగ్రీల మేర ఎక్కువగా ఉండటం భయాందోళనల్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా అత్యంత తీవ్రమైన ఎల్‌నినోగా నమోదైన 2.75 డిగ్రీల మార్క్‌ను కూడా ప్రస్తుతం దాటేస్తున్నాయి. సముద్ర జలాల్లో చోటుచేసుకుంటున్న ఈ అసాధారణ పెరుగుదల ప్రపంచ వాతావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కడం వల్ల వాతావరణంలోని గాలి ప్రవాహాల్లో ఊహించని మార్పులు వచ్చి, ప్రపంచవ్యాప్తంగా వర్షపాత నమోదుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
పసిఫిక్ మహాసముద్ర సాధారణ ఉష్ణోగ్రతలు 27-28 డిగ్రీలు
2026–27 అంచనా 31.6డిగ్రీలు
2002లో ఎల్‌నినో సమయంలో భారత్‌లో వర్షపాతం సాధారణం కంటే 19 శాతం తక్కువ
2009లో ఎల్‌నినో సమయంలో సాధారణం కంటే 22 శాతం తక్కువ
2026–27లో అంచనా సాధారణం కంటే 25 శాతం తక్కువ
1877 నాటి అత్యధిక రికార్డు 30.75డిగ్రీలు
ఈసారి ఎల్‌నినోతో ఉష్ణోగ్రత పెరుగుదల 3.6డిగ్రీలు
2015–16లో ఎల్‌నినో సమయంలో సాధారణం కంటే 14 శాతం తక్కువ
అన్నదాతకు అశనిపాతం.!
ఈ అసాధారణ ఎల్‌నినో తీవ్రత.. భారత్‌పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలున్నాయి. భారతదేశ వ్యవసాయ రంగం, ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఎల్‌నినో ఏర్పడిన ప్రతిసారీ దేశంలో రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొని, కరువు కాటకాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే ముప్పు పొంచి ఉంది. పంటలు ఎండిపోవడం, భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడం, తీవ్రమైన తాగునీటి కొరత రావడం వంటివి దేశమంతటా విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆశలన్నీ ఎంజేవో పవనాలపైనే.!
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశానికి ఏకైక ఆశాకిరణం మాడెన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ) మాత్రమే. వాతావరణంలో భూమధ్యరేఖ వెంబడి పడమర నుంచి తూర్పు వైపుగా కదిలే మేఘాలు, వర్షపాతం, వేగవంతమైన గాలుల సమూహాన్ని ఎంజేవో అంటారు. ఈ ఎంజేవో గనక హిందూ మహాసముద్రం మీదుగా సరైన సమయంలో, అనుకూలంగా పయనిస్తే, అది మన రుతుపవనాలను బలోపేతం చేసి మెరుగైన వర్షాలను తీసుకువస్తుంది. తద్వారా ఎల్‌నినో వల్ల ఏర్పడే ప్రమాదకరమైన వర్షాభావ పరిస్థితులను ఎంజేవో చాలా వరకు అడ్డుకుని ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ ఎంజేవో అంచనాలకు తగినట్లుగా సానుకూలంగా మారకపోయినా, లేదా దాని అనుకూల ప్రభావం మన దేశంపై పడకపోతే.. ఎల్‌నినో సృష్టించే విధ్వంసం వర్ణనాతీతంగా ఉంటుందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.


