కరువు కోరల్లో సీమ రైతు | Crop cultivation in Kadapa badly affected by drought | Sakshi
Sakshi News home page

కరువు కోరల్లో సీమ రైతు

Aug 26 2026 5:12 AM | Updated on Aug 26 2026 5:12 AM

Crop cultivation in Kadapa badly affected by drought

చిత్తూరు రూరల్‌ మండలంలో ఎండిపోయిన వేరుశనగ పంట

చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం అన్నదాతకు శాపం

జూన్‌ నుంచి  తీవ్ర లోటు వర్షపాతం.. ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం 

శ్రీశైలంలో నీరున్నా.. కేసీ, తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువలకు నీరు కరువు 

అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, మార్కాపురం జిల్లాల్లో ఎండిన పంటలు

అనంత జిల్లాలో ఎండిన కంది, వేరుశనగ, చీనీ తోటలు 

నంద్యాల జిల్లాలో అరకొరగా వరి సాగు.. అదీ ఎండుతోంది

కర్నూలు జిల్లాలో ఎండిన పత్తి, కంది, సన్‌ఫ్లవర్, ఉల్లిగడ్డలు 

మార్కాపురంలో ఈసారి జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశనగ, ఆముదం సాగులేదు 

కడపలో దారుణంగా పడిపోయిన పంటల సాగు

గ్రాసం లేక ఎద్దులు, పాడిపశువులు, గొర్రెలు, మేకలను అమ్ముకుంటున్న రైతులు 

బతుకు భారమై తెలంగాణ, కర్ణాటకకు వలసబాట 

కరువు హెచ్చరికలు ముందే ఉన్నా.. సర్కారు ముందస్తు చర్యలు ఎక్కడ?.. నిన్న చినుకు కోసం రైతులఎదురుచూపు.. నేడు బతుకు కోసం వలసబాట 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: తీవ్ర వర్షాభావం.. దానికి తోడు చంద్రబాబు ప్రభుత్వ దారుణ నిర్లక్ష్యం.. రాయలసీమను మరోమారు కరువు కోరల్లోకి నెట్టాయి.  రైతాంగానికి భరోసాగా కరువు సహాయక చర్యలు అనేకం చేపట్టాల్సి ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో రైతు కుటుంబాలు గుడ్లనీరు కుక్కుకుని బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి. జూన్‌ నుంచి ఆగస్టు ముగింపు దశకు చేరుకున్నా సీమ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అరకొరగా పడిన వానలకు సాగు చేసిన పత్తి, వేరుశనగ, కంది, ఉల్లి, మొక్కజొన్న వంటి పంటలు తేమ అందక ఎండిపోతున్నాయి. 

కాలువల కింద వరి సాగుకూ నీటి కొరత వెంటాడుతోంది. దాంతో పొలాలు బీళ్లుగా మారుతుండగా.. పశువులకు గ్రాసం కరువై.. రైతు కుటుంబాలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నాయి.  రైతులు ఎద్దులతోపాటు పాడి పశువులను, గొర్రెలను, మేకలను తెగనమ్ముకుంటున్నారు. శ్రీశైలం జలాశయంలో నీరు ఉన్నప్పటికీ కేసీ కాలువ, తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువలు, హంద్రీ కాలువల పరిధిలో సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం జిల్లాల రైతులు కనీసం కొంతమేరైనా నీరివ్వాలని కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. పంటలమీద ఆశవదులుకొని అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. సెపె్టంబర్‌ మొదటివారం నుంచి వలసలు మరింతగా పెరగనున్నాయి.  

పశువులు తెగనమ్మి వలసబాట..
కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన పల్లె ఈరప్ప కుటుంబం ఇది. నాలుగు ఎకరాల పొలంలో పత్తి సాగుచేసింది. ఎకరాకు రూ. 25 వేల చొప్పున రూ.లక్ష పెట్టుబడి పెట్టారు. మూడు నెలల పైరు.. వర్షాలు లేక నిలువునా ఎండిపోయింది. ఈరప్పకు నలుగురు ఆడబిడ్డలు. కరువుతో గ్రాసం దొరకదన్న భయంతో 1.20 లక్షలకు కొన్న రెండు ఎద్దులను కూడా ఇటీవల నష్టానికి అమ్మేశాడు. బతుకుదెరువుకోసం తెలంగాణాకు వలస వెళ్లేందుకు ఆ కుటుంబం సిద్ధమైంది. 

కరువు ప్రభావం–5 దశలు 
1) చినుకు లేదు.. 
2) పంటల సాగు తగ్గింది 
3) సాగు చేసిన పంటలు ఎండిపోయాయి 
4) పశుగ్రాసం కొరత, పశువుల అమ్మకాలు 
5) వ్యవసాయం దెబ్బతిని కుటుంబాలతో రైతుల వలసలు 

మొదట పొలాలు ఎండాయి.. తర్వాత పశువులు అమ్ముకున్నారు.. ఇప్పుడు కుటుంబాలతో సహా రైతులు వలసబాట పడుతున్నారు.!

బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్తున్నా 
మాకు 4 ఎకరాల పొలం ఉంది. పత్తి పంట సాగు చేశా. ఎకరాకు రూ. 25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష ఖర్చు అయ్యింది. పంట ఎండిపోయింది. అప్పులు తీరేపరిస్థితి కనిపించడంలేదు. నా ముగ్గురు సోదరులు నెల క్రితం బెంగళూరుకు వలస వెళ్లారు. రెండు రోజుల క్రితం పత్తి పంట పొలాన్ని గొర్రెలకు మేతగా వదిలేశాను. నేను కూడా కుటుంబంతో బెంగళూరుకు వెలస వెళ్లాలని నిర్ణయించుకున్నా.  – గాది లింగప్ప, రైతు, నిట్రవట్టి గ్రామం, హాలహర్వి మండలం 

కేసీకి నీళ్లివ్వక పొలం బీడుపడింది.. 
కేసీ కాలువకు శ్రీశైలం నుంచి కృష్ణ నీళ్లు విడుదల చేస్తేనే మా  8 ఎకరాల్లో వరిపంట సాగవుతుంది. ఈ ఏడాది ఇప్పటికీ నీళ్లు విడుదల చేయలేదు. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పొలం మొత్తం బీడుపడింది. వరి పండకపోతే తిండిగింజలు, పశువుల మేత దొరికే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఆదుకోవాలి. పశు గ్రాసమన్నా సరఫరా చేయాలి.  – శీలం భాస్కర్‌రెడ్డి, విశ్వనాథపురం, చాపాడుమండలం. వైఎస్సార్‌ కడప జిల్లా. 


పంటలన్నీ దెబ్బతిన్నాయి...
కర్నూలు
4,34,996 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణానికి 3,44,171 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. ఆదోని, ఆలూరు, మంత్రాలయం ప్రాంతాల్లో పత్తి, వేరుశనగ, కంది, సన్‌ఫ్లవర్, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. 14 వేల హెక్టార్ల సాధారణ వరి సాగుకు 2 వేల హెక్టార్లలోపే సాగు జరిగింది. పంటలు ఎండిపోవడంతో ఈ ప్రాంత రైతులు వలసలకు సిద్ధమయ్యారు. కొందరు ఎద్దులను, ఇతర పశువులను అమ్ముకొని వలసపోగా మిగిలినవారు బెంగుళూరు, తెలంగాణా ప్రాంతాలకు వలసకు సిద్ధమయ్యారు.  

అనంతపురం 
3,43,394 హెక్టార్ల సాధారణ సాగుకు 1,87,598 హెక్టార్లలోనే పంటలు వేశారు. 1.48 లక్షల హెక్టార్ల వేరుశనగ కేవలం 44 వేల హెక్టార్లలో సాగైంది. 22,868 హెక్టార్ల సాధారణ వరి సాగుకు 4,168 హెక్టార్లలోనే బోరుబావులకింద సాగు జరిగింది. వర్షాభావంతో చీనీ తోటలు ఎండిపోతున్నాయి. పత్తి, మొక్కజొన్న, సజ్జ ఆముదం పంటలదీ ఇదే పరిస్థితి.  కంది 90వేల హెక్టార్లలో సాగవుతోందని చెబుతున్నా వర్షాలు లేక పంట నిలువునా ఎండిపోతోంది. 

నంద్యాల
2,20,230 హెక్టార్ల సాధారణ సాగుకు 1,33,039 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 70,201 హెక్టార్లలో సాగవ్వాల్సిన వరి కేవలం 16 వేల హెక్టార్లలో సాగైంది. మొక్కజొన్న, కంది, మినుము, పత్తి పంటలూ వర్షాభావంతో దెబ్బతిన్నాయి. 

చిత్తూరు
44,267 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 10,026 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. 21,903 హెక్టార్ల వేరుశనగకు 2,615 హెక్టార్లు, 9,068 హెక్టార్ల వరికి 1,833 హెక్టార్లు, 1,495 హెక్టార్ల కందికి కేవలం 110 హెక్టార్లలో సాగు జరిగింది.

మార్కాపురం
కరువు తీవ్రతను సాగు గణాంకాలే చెబుతున్నాయి. 27,203 హెక్టార్ల సాధారణ కంది సాగు కేవలం 192 హెక్టార్లలో, 19,711 హెక్టార్ల పత్తి 3,953 హెక్టార్లలో. 6,202 హెక్టార్ల వరి కేవలం 33 హెక్టార్లలో. 3,104 హెక్టార్ల మొక్కజొన్న 331 హెక్టార్లలో మాత్రమే సాగవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశనగ, ఆముదం తదితర పంటలు సాగుకు నోచుకోలేదు. 

కడప
76,469 హెక్టార్ల సాధారణ సాగుకు కేవలం 24,092 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. అంటే సాగు మూడోవంతు కన్నా దిగువకు పడిపోయింది. కేసీ కెనాల్‌ ఆయకట్టుతోపాటు తెలుగుగంగ, మైలవరం, చిత్రావతి, గండికోట తదితర ప్రాజెక్టుల పరిధిలో 33,078 హెక్టార్లలో వరి సాగుకావాల్సి ఉండగా కేవలం 9,327 హెక్టార్లలో మాత్రమే సాగైంది.  22,469 హెక్టార్ల పత్తికి 7,742 హెక్టార్లు, 5,992 హెక్టార్ల కందికి కేవలం 352 హెక్టార్లలో సాగు జరిగింది. 1495 హెక్టార్లలో సాగుకావాల్సిన మొక్కజొన్న 1213 హెక్టార్లలో మాత్రమే సాగైంది. 3745 హెక్టార్లలో సాగు కావాల్సిన మినుము 1488 హెక్టార్లలో సాగైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement