నాన్చకండి.. తక్షణం చర్యలు చేపట్టండి
చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైకోర్టు హితవుతో సమ్మె విరమిస్తున్నట్టు జూడాల ప్రకటన
సాక్షి, అమరావతి: జూనియర్ డాక్టర్ల(జూడాల) న్యాయమైన డిమాండ్లను రెండువారాల్లో పరిష్కరించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో నాన్చవద్దని, తక్షణం చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో సామాజిక కార్యకర్త, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన గూడూరి వెంకట రత్న కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది యరగొర్ల ఠాగూర్ యాదవ్, జూనియర్ డాక్టర్ల తరఫున న్యాయవాది భూమా మహర్షిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.
మీ బాధను అర్థం చేసుకోగలం.. వైద్య వృత్తి పవిత్రమైనది
వాదనలు విన్న ధర్మాసనం.. జూనియర్ డాక్టర్లనుద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ‘మీ బాధను మేం అర్థం చేసుకోగలం. మీ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న కారణంతో మీరు సమ్మెకు దిగి ఉండొచ్చు. కానీ వైద్యులు సమ్మె పేరుతో విధులకు దూరంగా ఉండటం సరికాదు. మీరు చేస్తున్న సమ్మె వల్ల వైద్య సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా నిరసన తెలిపేందుకు ఇతర మార్గాలను, పద్ధతులను చూడండి.’ అని వ్యాఖ్యానించింది. వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని హితవు పలికింది. ఈ వ్యాజ్యంపై భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణ చేపడుతామని, అప్పుడు సమ్మె విరమణపై జూనియర్ డాక్టర్లు తమ నిర్ణయం చెప్పాలని సూచించింది.
జూడాల సమ్మె తాత్కాలిక విరమణ
భోజన విరామం అనంతరం విచారణ ప్రారంభమైన వెంటనే గౌరవ న్యాయస్థానం సూచన మేరకు సమ్మె విరమించాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయం తీసుకున్నట్టు జూనియర్ డాక్టర్ల తరఫున న్యాయవాది భూమా మహర్షి రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే జూడాల డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రెండువారాల్లోగా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, దీనికోసం తక్షణం చర్యలు చేపట్టాలని, నాన్చడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జూడాల సమ్మె విరమణ నిర్ణయంపైనా హైకోర్టు హర్షం వ్యక్తం చేసింది. ‘యువ వైద్యులారా మీరు కనిపిస్తే రోగి సగం జబ్బు నయమవుతుంది. మీ నిర్ణయంతో మేం సంతోషంగా ఉన్నాం.. పవిత్రమైన వైద్య వృత్తి గౌరవాన్ని పెంచేలా నిర్ణయం తీసుకున్నారు.’ అని ఉన్నత న్యాయస్థానం అభినందించింది. కాగా, తాము సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నామని డిమాండ్ల సాధనకోసం ప్రత్యామ్నాయ మార్గాల్లో నిరసన కొనసాగిస్తామని జూడాలు ప్రకటించారు.


