ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి
ఆయన సేవలను కొనియాడిన సీజే జస్టిస్ లీసా గిల్
ఘనంగా సత్కరించిన హైకోర్టు న్యాయవాదుల సంఘం
సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావుకు హైకోర్టు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ నెల 29న జస్టిస్ గోపాలకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. బుధవారం నుంచి హైకోర్టుకు వరుస సెలవులు రావడంతో మంగళవారమే ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్ గోపాలకృష్ణారావుకు వీడ్కోలు పలికేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు జస్టిస్ గోపాలకృష్ణారావు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. వృత్తి పట్ల ఎంతో నిబద్ధతను చూపేవారని, అదే రీతిలో కేసులను పరిష్కరించారని తెలిపారు. హైకోర్టు కమిటీలో సభ్యుడిగా విశిష్ట సేవలు అందించారన్నారు. ఆయన విశ్రాంత జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆమె ఆకాక్షించారు.
మంచి తీర్పులిచ్చారు..
అనంతరం అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడారు. జస్టిస్ గోపాలకృష్ణారావు ఎంతో ఓపికతో కేసులను విచారించి మంచి తీర్పులు ఇచ్చారని చెప్పారు.
ప్రమాణానికి కట్టుబడే విధులు..
జస్టిస్ గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. న్యాయవాదిగా, న్యాయాధికారిగా, న్యాయమూర్తిగా తన వృత్తి జీవితం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. తన జీవితం అంతా న్యాయస్థానాల్లోనే గడిచిందని, ఇందుకు తాను ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి కట్టుబడే విధులు నిర్వర్తించానన్నారు. తన న్యాయ ప్రస్థానంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ గోపాలకృష్ణారావు కుటుంబ సభ్యులు, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) తేనేపల్లి నిరంజన్, న్యాయవాదులు, రిజిస్ట్రార్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జస్టిస్ గోపాలకృష్ణారావు దంపతులకు ఘన సన్మానం
అనంతరం జస్టిస్ గోపాలకృష్ణారావు, ఆయన సతీమణి సౌజన్యను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. శాలువాలు కప్పి, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో సీజే జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తులు, సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


