వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు
ఏపీలో ప్రతిపక్షం గొంతు నొక్కేలా ప్రభుత్వ చర్యలున్నాయన్న వైఎస్సార్‌సీపీ
వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆందోళన
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో వైఎస్సార్‌సీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులను ఇష్టానుసారంగా తొలగిస్తున్న వ్యవహారంపై ముందుగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోందంటూ వైఎస్సార్‌సీపీ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఖాతాలైన ‘జగనన్న కనెక్ట్స్’ (ఫేస్‌బుక్, ఇన్‌స్టా్రగామ్, యూట్యూబ్, ఎక్స్) నుంచి పోస్టులను పూర్తిగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ వేసిన రిట్ పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగుతో కూడిన ధర్మాసనం మంగళవారం నిర్ణయం తీసుకుంది.
అసలేం జరిగింది?: కర్నూలులో మద్యం బెల్టు షాపుల కారణంగా చోటుచేసుకున్న విషాదంపై 2025 అక్టోబర్ 26న వైఎస్సార్‌సీపీ తన అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా వేదికగా పలు పోస్టులు పెట్టింది. ఆ పోస్టులు ఏపీ సీఎంని అవమానించే ఉద్దేశంతో, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కూడా పార్టీ అదే అంశంపై పోస్టులు కొనసాగించగా పోలీసు స్టేషన్లలో వరుసగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. జనవరి 27న కర్నూలు రూరల్ సీఐ ట్విట్టర్‌కు నోటీసు ఇస్తూ వైఎస్సార్‌సీపీ చేసిన పోస్టుల యూఆర్‌ఎల్స్‌ను తొలగించాలని ఆదేశించారు.
సేఫ్ హార్బర్ రద్దు హెచ్చరికలు
రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉద్దేశపూర్వకంగా సెన్సార్‌షిప్ విధిస్తోందంటూ పార్టీ మరోసారి ట్వీట్ చేయగా.. ఐటీ చట్టం–2000లోని సెక్షన్ 79(3)(బి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్) రూల్స్ 2021లోని 3(1)(డి), (జి), (ఎఫ్) నిబంధనల కింద సీఐ మరో నోటీసు జారీ చేశారు. 36 గంటల్లోగా ఆ ఖాతాలను, సంబంధిత ట్విట్టర్ పోస్టులను తొలగించకుంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పొందే ‘సేఫ్ హార్బర్’ రక్షణను ఉపసంహరిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ రాజ్యాంగంలోని ఆర్టికల్–32 కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) మహపూజ్ ఏ నజ్కీ ద్వారా ఈ పిటిషన్ దాఖలైంది.
నిబంధనల ఉల్లంఘనే..
శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఆ తీర్పు ప్రకారం ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద కేంద్ర ప్రభుత్వ నిర్ణీత అధికారి లేదా సమర్థవంతమైన న్యాయస్థానం ఆదేశాల మేరకు మాత్రమే సోషల్ మీడియాలోని కంటెంట్‌ను బ్లాక్ చేయాలి లేదా తొలగించాలి. కానీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద గానీ, ఏ న్యాయస్థానం నుంచి గానీ తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని పార్టీ స్పష్టం చేసింది.
దీనికి పూర్తి విరుద్ధంగా వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐస్థాయి అధికారులు తమ పరిధిని దాటి ఐటీ చట్టం సెక్షన్ 79(3)(బి)ని ప్రయోగిస్తూ 36 గంటల్లోగా పోస్టులు, ఖాతాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం నిబంధనల ఉల్లంఘనేనని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తాము నేరుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘనలపై ముందుగా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పిస్తూ రిట్ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచి్చంది.


