మేయర్ వివాదం.. రెండుగా చీలిన జనసేన | Machilipatnam Janasena: Rift Widens Over Mayor Candidacy as Rival Faction Protests | Sakshi
Sakshi News home page

మేయర్ వివాదం.. రెండుగా చీలిన జనసేన

Aug 25 2026 3:06 PM | Updated on Aug 25 2026 3:25 PM

Machilipatnam Janasena: Rift Widens Over Mayor Candidacy as Rival Faction Protests

సాక్షి,మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం (బందరు) జనసేన పార్టీలో మేయర్ అభ్యర్థిత్వం తీవ్ర చిచ్చు రేపింది. రాబోయే ఎన్నికల్లో మేయర్ పదవి దక్కించుకునే వ్యూహాలపై పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణకు వ్యతిరేకంగా కొట్టే వెంకట్రావ్ వర్గీయులు తీవ్ర నిరసనకు దిగారు. పార్టీలో తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, కొట్టే వెంకట్రావ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కాలినడకన నిరసన ప్రదర్శన చేపట్టారు.

బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి క్యాంప్ ఆఫీస్‌ను వారు ముట్టడించారు. ఇటీవల కొట్టే వెంకట్రావ్‌పై జనసేన పట్టణ అధ్యక్షుడు గడ్డం రాజు దాడికి పాల్పడటం ఈ వివాదాన్ని మరింత రాజేసింది. ఈ దాడి ఘటనపై కొట్టే వెంకట్రావ్ వర్గీయులు ఎంపీ బాలశౌరికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడ ఉన్న ఎంపీ బాలశౌరి నిరసనకారులకు ఎటువంటి సమాధానం చెప్పకుండా, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోవడం పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది.

ఈ సందర్భంగా కొట్టే వెంకట్రావ్ వర్గీయులు గడ్డం రాజుపై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన్ను వెంటనే పట్టణ అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని గట్టిగా పట్టుబట్టారు. గడ్డం రాజుపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోకపోతే, తాము తదుపరి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని, పార్టీలో తమ దారి తాము చూసుకుంటామని కొట్టే వెంకట్రావ్ వర్గం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మేయర్ సీటు చుట్టూ తిరుగుతున్న ఈ అంతర్గత విభేదాలు బందరు జనసేనలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్నది ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement