మాస్కో: అమెరికా, రష్యా మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్‌పై దాడితో పాటు ప్రస్తుతం ఇరాన్‌కు సైతం అమెరికా సహకరిస్తోందని ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏమాత్రం మెరుగ్గా లేవు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైమానిక దళానికి చెందిన ఓ రవాణా విమానం మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయంలో ల్యాండ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఈ విమానం రాక గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ తెలపడం గమనార్హం.
అమెరికాకు చెందిన విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్ 24 వివరాల ప్రకారం, ఈ విమానం మంగళవారం సుమారు 0700 GMT సమయంలో లాట్వియా రాజధాని రిగా నుంచి మాస్కోకు చేరుకుంది. అయితే ఈ పరిణామంపై క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్‌ను మీడియా ప్రశ్నించగా, ఈ వారం అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో ఎలాంటి సమావేశాలు జరగాల్సిన ప్రణాళిక లేదని ఆయన చెప్పారు. విమానం రాకకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.
ఫ్లైట్‌రాడార్24 డేటా ప్రకారం, ఈ విమానం ఆదివారం సాయంత్రం అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సుమారు 5 గంటలకు ముందు ఈ విమానం మేరీల్యాండ్‌లోని అమెరికా వైమానిక దళానికి చెందిన జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ డీసీ సమీపంలోని క్యాంప్ స్ప్రింగ్స్ ఎయిర్‌బేస్ నుంచి రిగాకు చేరుకుంది. అనంతరం రిగా నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా అధ్యక్షుడు, ఉన్నతస్థాయి అధికారులు అధికారిక విమాన ప్రయాణాల కోసం ఉపయోగించే ప్రధాన సైనిక స్థావరాల్లో జాయింట్ బేస్ ఆండ్రూస్ ఒకటి.
యూరప్ నుంచి రష్యాకు నేరుగా వచ్చిన అమెరికా ఉన్న విమానం ఇదే మొదటిది కాదు. చివరిసారిగా జనవరిలో ఇలాంటి విమానం రష్యాకు వచ్చింది. అప్పట్లో ఉక్రెయిన్‌పై శాంతి చర్చల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవెన్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోకు వెళ్లి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.
విమానం రాకపై ఊహాగానాలు
ఈ విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్. భారీ మొత్తంలో సైనిక సామగ్రి, సిబ్బందిని సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ఈ విమానాలను ఉపయోగిస్తారు. ఇలాంటి విమానం అకస్మాత్తుగా మాస్కోలో ల్యాండ్ కావడంతో దాని రాక వెనుక కారణంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది దౌత్యపరమైన వ్యవహారానికి సంబంధించినదై ఉండొచ్చని, లేదా ఖైదీల మార్పిడి కోసం విమానం వచ్చి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.
కాగా ఇటీవలే మాజీ అమెరికా మెరైన్ రాబర్ట్ గిల్మన్‌ను ఆగస్టు 2026లో రష్యా విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఈ ఏడాది ప్రారంభంలోనూ అమెరికా, రష్యా మధ్య ఖైదీల మార్పిడి జరిగింది.అయితే, మాస్కోలో అమెరికా సైనిక రవాణా విమానం ల్యాండ్ కావడానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడి కాలేదు.


