ఇరాన్‌పై అమెరికా ఆంక్షల ఉచ్చు మరింత బిగుస్తోంది. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలు వెంటనే వాటిని తగ్గించుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఇరాన్‌ను ఆర్థికంగా ఒంటరిని చేసి.. చివరకు అమెరికాతో చర్చలు, ఒప్పందానికి దిగేలా ఒత్తిడి చేయడమే వాషింగ్టన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ హెచ్చరికలకు ఇరాన్ ప్రధాన భాగస్వాములైన చైనా, రష్యా ఎంతవరకు తలొగ్గుతాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో ఈ పరిణామం భారత్‌కు మాత్రం కొత్త చిక్కును తెచ్చిపెట్టింది.
ఒకవైపు అమెరికాతో వేగంగా బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం.. మరోవైపు ఇరాన్‌తో భారత్‌కు ఉన్న చారిత్రక, వాణిజ్య, వ్యూహాత్మక బంధం. ఈ రెండింటినీ సమతుల్యం చేయడం ఢిల్లీకి సవాల్‌గా మారింది. ముఖ్యంగా ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే దేశాలపై సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న హెచ్చరిక నేపథ్యంలో.. భారత్ ఎంతవరకు అమెరికా ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుంటుందన్నదే ఆసక్తికరంగా మారింది. అయితే ఇది భారత్‌కు పూర్తిగా కొత్త పరిస్థితి కాదు.
రష్యా విషయంలో వెనక్కి తగ్గని ఢిల్లీ
ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ మాస్కోతో సంబంధాలను పూర్తిగా తెంచుకోలేదు. ముఖ్యంగా దేశీయ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి భారీగా క్రూడ్ కొనుగోళ్లను కొనసాగించింది. 2026 జూన్‌లో రష్యా చమురు భారత్ మొత్తం క్రూడ్ దిగుమతుల్లో సగానికి పైగా వాటా సాధించినట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. అంటే అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని భారత్ కొనసాగించింది. అయితే ఇరాన్ విషయంలో సమీకరణాలు కొంత భిన్నంగా ఉన్నాయి.
ఇప్పటికే భారీగా తగ్గిన వాణిజ్యం
భారత్–ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం గతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. 2018–19లో దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యం.. 2025–26లో సుమారు 1.6 బిలియన్ డాలర్లకు పడిపోయింది. భారత్ ప్రధానంగా ఇరాన్‌కు బియ్యం, టీ, ఔషధాలు తదితర వస్తువులను ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం, యూఏఈ వంటి మార్గాల ద్వారా చెల్లింపులు, రీ-ఎగుమతులపై ఆంక్షల ప్రభావం పెరగడం భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతి, టీ, ఫార్మా రంగాలపై ప్రభావం పడొచ్చు. అయితే ఇరాన్‌తో వాణిజ్యం ఇప్పటికే పరిమిత స్థాయికి చేరినందున.. భారత్ మొత్తంగా ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ కంటే, కొన్ని రంగాల్లోని ఎగుమతిదారులపై ప్రభావమే ఎక్కువగా ఉండొచ్చు.
చమురు కంటే పెద్ద ముప్పు.. హర్ముజ్
భారత్‌కు ఇరాన్ విషయంలో అసలు ఆందోళన కేవలం ఆ దేశం నుంచి ఎంత చమురు కొనుగోలు చేస్తున్నామన్నది కాదు.. హర్ముజ్ జలసంధి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఉద్రిక్తత పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా ఎగిసే అవకాశం ఉంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌లో దీనివల్ల దిగుమతి బిల్లు పెరగడంతో పాటు రూపాయి, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరగొచ్చు.
అయితే తాజా అమెరికా ఆంక్షల ప్రకటన తర్వాత వెంటనే చమురు ధరలు పెరగలేదు. ఆంక్షలు ఇరాన్‌పై ఒత్తిడిని పెంచి, చివరకు దౌత్యపరమైన పరిష్కారానికి దారితీయవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లలో కనిపించాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర 2.35 శాతం తగ్గి 92.17 డాలర్ల వద్ద ముగిసింది.
ఇదీ చదవండి: జింగ్‌పిన్ రాక.. భారత్‌తో బంధం బలపడేనా?
చాబహార్‌ను వదులుకోవడం అంత సులభమా?
ఇరాన్‌తో భారత్ సంబంధాల్లో చాబహార్ పోర్టు మరో కీలక అంశం. పాకిస్థాన్‌ను దాటకుండా అఫ్గానిస్థాన్, మధ్య ఆసియాకు చేరుకునే మార్గంగా ఇది భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో చాబహార్‌లో భారత కార్యకలాపాలు కొనసాగించడం సవాల్‌గా మారుతున్నప్పటికీ.. ఇరాన్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకుంటే ఈ కీలక కనెక్టివిటీ మార్గంపై భారత్ తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇరాన్ భారత్‌కు కేవలం వాణిజ్య భాగస్వామి మాత్రమే కాదు.. పశ్చిమాసియాలో వ్యూహాత్మక భాగస్వామి కూడా.
మరి మోదీ సర్కార్ ఏం చేస్తుంది?
ప్రస్తుతానికి భారత్‌పై అమెరికా నేరుగా ఆంక్షలు విధించలేదు. తాజా చర్యల్లో భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న నిర్ణయం కూడా కనిపించలేదు. దీంతో ఢిల్లీకి ఇంకా కొంత దౌత్యపరమైన వెసులుబాటు ఉంది. అమెరికాతో సంబంధాలను దెబ్బతీయకుండా.. అదే సమయంలో ఇరాన్‌తో అవసరమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం భారత్ ముందున్న వాస్తవిక మార్గంగా కనిపిస్తోంది. రష్యా విషయంలో అనుసరించినట్టుగా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆంక్షల పరిధిలోకి వెళ్లకుండా సంబంధాలను పరిమిత స్థాయిలో కొనసాగించే ప్రయత్నం చేయొచ్చు.
కటీఫ్ కాదు.. కత్తిమీద సాము!
కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో “ఇరాన్‌కు భారత్ కటీఫ్ చెబుతుంది” అనుకోవడం తొందరపాటు అంచనా. అదే సమయంలో అమెరికా హెచ్చరికలను పూర్తిగా విస్మరించి ఇరాన్‌తో యథావిధిగా ఆర్థిక సంబంధాలు కొనసాగించడం కూడా ఢిల్లీకి అంత సులభం కాదు. వాణిజ్యం ఇప్పటికే గణనీయంగా తగ్గిపోయింది. చమురు విషయంలో భారత్‌కు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయి. కానీ చాబహార్, మధ్య ఆసియా కనెక్టివిటీ, పశ్చిమాసియాలో వ్యూహాత్మక ప్రయోజనాలు, హర్ముజ్ భద్రత వంటి అంశాలను ఒక్కసారిగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ముందున్న మార్గం ‘ఇరాన్‌కు కటీఫ్’ కంటే.. ‘అమెరికా ఆంక్షలకు చిక్కకుండా ఇరాన్‌తో అవసరమైన సంబంధాలను కొనసాగించడం’ అయ్యే అవకాశమే ఎక్కువ.
రష్యా విషయంలో అమెరికా ఒత్తిడిని తట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడుకున్న భారత్.. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తుందా? లేక అమెరికాతో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యం ఇస్తుందా? ఈ సమతుల్యమే మోదీ సర్కార్‌కు అసలు పరీక్ష.
:::వెబ్‌డెస్క్ ప్రత్యేకం


