ట్రంప్‌, నెతన్యాహు వారసులపై ఇరాన్‌ కన్ను! | Netanyahu Claims Iran Tried To Kill His Son As Threats Against Trump Family Spark Fresh Alarm, Check More Details | Sakshi
Sakshi News home page

ట్రంప్‌, నెతన్యాహు వారసులపై ఇరాన్‌ కన్ను!

Aug 25 2026 7:20 AM | Updated on Aug 25 2026 10:30 AM

Iran Targets Trump And Netanyahus Sons Amid Rising Tensions

ఇరాన్‌-అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మొన్నటిదాకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్‌ ప్రణాళికలు వేస్తోందన్న చర్చ జరిగింది తెలిసిందే. ఇప్పుడు శత్రుదేశాల వారసులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తన కుమారుల్లో ఒకరిని ఇరాన్‌ హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూకి ఇద్దరు కొడుకులు. అయితే వాళ్ల భద్రత కోసం ఆయన భారీగా ఖర్చు పెడుతున్నారంటూ ఈ మధ్యకాలంలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆయన స్పందిస్తూ.. ఇరాన్‌ తన కుమారుల్లో ఒకరిని లక్ష్యంగా చేసుకుని హత్యకు ప్రయత్నించిందని చెప్పారు. కుటుంబానికి భద్రత కల్పించడం విలాసం కాదని.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రయత్నం ఎప్పుడు, ఎలా జరిగిందన్న వివరాలను నెతన్యాహు వెల్లడించలేదు. అలాగే కొడుకులు యాయిర్‌, అవ్నెర్‌లలో ఎవరిని టార్గెట్‌ చేశారన్నది కూడా చెప్పలేదు.  

బారన్‌పై బౌంటీ?
మరోవైపు ఇరాన్‌ ప్రభుత్వ టీవీలో ప్రసారమైన ఓ వీడియో అమెరికాలో కలకలం రేపింది. ‘‘Where to Kill Barron Trump’’ పేరుతో ప్రసారమైన ఈ వీడియోలో డొనాల్డ్‌ ట్రంప్‌ 20 ఏళ్ల కుమారుడు బారన్‌ కదలికలను చూపిస్తూ, అతడి గురించి వివరాలు ప్రస్తావించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అతడిని లక్ష్యంగా చేసుకునేందుకు 10 మిలియన్‌ డాలర్ల (రూ.95 కోట్లకు పైగా) బహుమతిని ప్రకటించినట్లు సమాచారం.

బారన్‌ భద్రతా బలగాల కళ్లుగప్పి ఎలా కదులుతున్నాడన్న అంశాలను కూడా వీడియోలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎక్స్‌బాక్స్‌, ఫిఫా గేమ్స్‌, డిస్కార్డ్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అతడి ఖాతాల వివరాలు తమకు లభించాయని వీడియోలో పేర్కొన్నట్లు సమాచారం.

మెలానియాపైనా గతంలో బెదిరింపులు
ట్రంప్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇరాన్‌ మీడియాకు ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని కూడా ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఓ బెదిరింపు వీడియో ప్రసారం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. అందులో ఆమె ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో కదలికలకు సంబంధించిన వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం.

మరింత ముదిరిన ఉద్రిక్తతలు
ఇరాన్‌పై అమెరికా ‘ఎకనామిక్‌ డీ-డే’ పేరుతో కొత్త ఆంక్షలు ప్రకటించిన సమయంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్‌ వ్యాఖ్యానించగా.. అమెరికా చర్యలను ఇరాన్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌, నెతన్యాహు కుటుంబ సభ్యులపై వెలువడిన బెదిరింపులు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి.

ఇదీ చదవండి: H-1B ఉద్యోగులకు కొత్త రూల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement