ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రగతి 53వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు, వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా.. రోడ్లు, రైల్వేలు, విద్యుత్ రంగాలకు చెందిన ఆరు భారీ ప్రాజెక్టులపై చర్చ జరిగింది. తొమ్మిది రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ రూ.30 వేల కోట్లకు పైగానే ఉంది.
ఆలస్యం అయితే నష్టం ప్రజలకే
ప్రాజెక్టులు ఆలస్యం కావడం వల్ల కేవలం ఖర్చు పెరగడం మాత్రమే కాదని ప్రధాని మోదీ అన్నారు. పనులు ఆలస్యం అయితే వాటి ద్వారా ప్రజలకు, వ్యాపారాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు అందాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని చెప్పారు. అందుకే ప్రతి ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఒక్కో రోడ్డు, ఒక్కో రైల్వే లైన్ లేదా ఒక్కో ప్యాకేజీ పనిని విడివిడిగా చూడకుండా.. మొత్తం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది?, ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?, అనే కోణంలో పనులను పర్యవేక్షించాలని ప్రధాని స్పష్టం చేశారు.
కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం
పెద్ద ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కేంద్ర శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని మోదీ అన్నారు. ఒక చిన్న సమస్య కూడా మొత్తం ప్రాజెక్టును ఆలస్యం చేసే పరిస్థితి రావచ్చు. కాబట్టి దాన్ని ముందుగానే గుర్తించి పరిష్కరించాలని సూచించారు. ప్రాజెక్టుల అమలులో ప్రతి స్థాయిలో అధికారులు బాధ్యత తీసుకోవాలని, సమస్యలు వచ్చిన తర్వాత స్పందించడం కాకుండా ముందుగానే వాటిని గుర్తించి పరిష్కరించే విధంగా పనిచేయాలని ప్రధాని సూచించారు.
ఒకే కారిడార్‌లో అన్ని..
భవిష్యత్‌లో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు కామన్ యుటిలిటీ కారిడార్ల ఏర్పాటుపై కూడా ఆలోచించాలని ప్రధాని సూచించారు. సాధ్యమైన చోట రోడ్లు, రవాణా ప్రాజెక్టులతో పాటు విద్యుత్, ఇతర యుటిలిటీ సదుపాయాలను సమగ్రంగా ప్లాన్ చేస్తే భవిష్యత్‌లో మళ్లీ మళ్లీ రోడ్లను తవ్వాల్సిన అవసరం తగ్గుతుందని చెప్పారు. అయితే.. ఇలాంటి ప్రణాళికలను చేపట్టే ముందు సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమా లేదా అన్నది పరిశీలించాలని స్పష్టం చేశారు.
వేగంతో పాటు.. నాణ్యత కూడా
ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పనుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు ప్రతి దశలో నాణ్యతను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులు వేగంగా పూర్తవ్వడం ఎంత ముఖ్యమో.. అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటం కూడా అంతే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయంలో ఏఐ
సమావేశంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగమైన అగ్రిస్టాక్ మీద కూడా ప్రధాని సమీక్షించారు. వ్యవసాయానికి సంబంధించిన డేటాను కేవలం సేకరించడానికే పరిమితం కాకుండా.. దాన్ని రైతులకు ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు.
Rs. 30,000 crore worth of projects across 9 states covering railways, roads and power sectors…this is what we reviewed during today’s PRAGATI session.
Focus areas remain - better connectivity, higher growth, better public services and lesser delays.
Here are the details……— Narendra Modi (@narendramodi) August 25, 2026
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి వ్యవసాయ రంగంలో మెరుగైన నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను అభివృద్ధి చేయాలని అన్నారు. విత్తనాలు, ఎరువుల ప్రణాళిక నుంచి పంటల ప్రాసెసింగ్ వరకు మొత్తం వ్యవసాయ రంగంలో డేటాను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో రైతులకు అవసరమైన సహాయం సరైన సమయంలో, సరైన వ్యక్తికి అందించడంతో పాటు వ్యవసాయ రంగంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
డిజిటల్ అరెస్టులపై అవగాహన
సైబర్ మోసాలు, ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలపై కూడా ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరమని అన్నారు.
వృద్ధులు, యువత, సైబర్ మోసాలకు సులభంగా టార్గెట్ అయ్యే వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మోసగాళ్లు ఎలా మాట్లాడతారు, ఎలాంటి పద్ధతులు ఉపయోగిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి అనే విషయాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. అదే సమయంలో సైబర్ నేరాలను ఎదుర్కొనే సిబ్బందికి కూడా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలని ప్రధాని సూచించారు. కొత్తగా వస్తున్న మోసాలను వేగంగా గుర్తించి, వెంటనే చర్యలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు.


