అధికార ద‌ర్పం.. 'వారికి' మాత్ర‌మే సాధ్యం! | Why Gurmeet Ram Rahim Singh, Nishant Kumar Convoys Viral Explainer | Sakshi
Sakshi News home page

వాహ‌నాల డాబు.. ఇదేంటి బాబు!

Aug 25 2026 8:14 PM | Updated on Aug 25 2026 8:17 PM

Why Gurmeet Ram Rahim Singh, Nishant Kumar Convoys Viral Explainer

‘రాజు వెడలె రవితేజము లలరగ’ అని పూర్వాకాలంలో రాజులు త‌మ ప‌రివారంతో బ‌య‌లుదేరిన తీరును వ‌ర్ణించారు క‌వులు. వ‌ర్త‌మానంలోనూ ఇలాంటి దృశ్యాలు అప్పుడ‌ప్పుడు మ‌న‌కు సాక్షాత్క‌రిస్తుంటాయి. అయితే ఇప్పుడు రాజులు లేరు క‌దా, ఇంత ఆర్భాటంగా బ‌య‌ట తిరిగేదెవ‌ర‌నే అనుమానం క‌ల‌గ‌డం స‌హ‌జం. రాజులు, రాజ్యాలు లేక‌పోయినా పాల‌కులు ఉన్నారుగా! పాల‌కుల‌కు అధికార ద‌ర్పం ఉంటుంది, ప‌ద‌ర్శిస్తారు స‌రే. కానీ వారి కుటుంబ స‌భ్యులు, అనుచ‌రులు కూడా అధికార ద‌ర్పం ప్ర‌ద‌ర్శించ‌డ‌మే ఇప్పుడు వైచిత్రి. న్యాయ‌స్థానాల్లో దోషులుగా తేలిన వారూ ఎటువంటి సంకోచం లేకుండా అధికార ద‌ర్పంతో వెలిగిపోతున్నారు. మ‌చ్చుకు రెండింటి గురించి మాట్లాడుకుందాం.

బిహార్ మాజీ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. అధికారం ఎక్క‌డుంటే ఆయ‌న అక్క‌డ ఉంటార‌న్న వాద‌న ఉండ‌నే ఉంది. ఇటీవ‌ల ఆయ‌న ఉదారంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌విని వ‌దులుకున్నారు. ఫ‌లితంగా నితీశ్‌కు రాజ్య‌స‌భ ఎంపీ, ఆయ‌న కుమారుడు నిశాంత్‌కు బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి ప‌ద‌వి ద‌క్కాయి. నిశాంత్‌ను బిహార్ భ‌విష్య‌త్తు ముఖ్య‌మంత్రిగా జేడీయూ పార్టీ నాయ‌కులు స్తుతిస్తున్నారు. మరి కాబోయే సీఎం జ‌నం మ‌ధ్య‌కు వ‌స్తున్నారంటే ఎంత హ‌డావుడి ఉండాలి!

మంత్రి డాబు
50పైగా వాహ‌నాల కాన్వాయ్‌తో నిశాంత్ వెళుతున్న వీడియో ఒక‌టి తాజాగా ఎక్స్‌లో షేర్ అయింది. నిశాంత్ వాహ‌న‌శ్రేణి వీధుల్లో దూసుకుపోతుండ‌గా.. సామాన్య జ‌నమంతా నిల‌బ‌డి చూస్తున్న‌ట్టుగా వీడియో ఉంది. వీణా జైన్ అనే యూజ‌ర్ ఈ వీడియో షేర్ చేశారు. 'బిహార్‌కు 9 ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన నితీశ్ కుమార్ పుత్ర‌ర‌త్నం 50కి పైగా వాహనాల కాన్వాయ్‌లో ప్రయాణించారు. వారికి ఓటు వేస్తూ, దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న ప్రజలు ఆయన కాన్వాయ్‌కు దారి ఇస్తూ అమితాశ్చ‌ర్యంతో చూస్తున్నారు' అని వ్యాఖ్యానాన్ని జోడించారు. ఇక వీడియో చూసిన నెటిజ‌నులు విమ‌ర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. భారతదేశానికి 'రాజులు వద్దు' అనే ఉద్యమం ఇప్పుడు నిజంగా అవసరం అంటూ పెట్టిన కామెంట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

బాబా.. ద‌ర్జా
ఇక సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎటువంటి ప‌ద‌వి లేక‌పోయినా ఆయ‌న కూడా.. ‘రాజు వెడలె రవితేజము లలరగ’ త‌ర‌హాలోనే ఆర్భాటాలు ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తాజాగా మ‌రోసారి పెరోల్‌పై హ‌రియాణాలోని సునారియా జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయన ల‌గ్జ‌రీ కార్ల కాన్వాయ్‌లో సిర్సాకు చేరుకున్నారు.

చ‌ద‌వండి: చక్కెర కొనాలంటే.. కిడ్నీ అమ్ముకోవాల్సిందే!

లైంగిక వేధింపుల కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. 17వ సారి పెరోల్‌పై బ‌య‌ట‌కు రావ‌డం.. బ‌హుశా మ‌న‌దేశంలో మాత్ర‌మే సాధ్య‌మేమో! 2017 నుంచి కారాగార శిక్ష అనుభ‌విస్తున్న ఆయ‌న 435 రోజులు జైలు బ‌య‌టే ఉండ‌డం మ‌రో విచిత్రం. ఇక, ఈయ‌న‌గారి ద‌ర్జాపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌నులు కారాలు మిరియాలు నూరుతున్నారు. గుర్మీత్‌కు హరియాణా ప్ర‌భుత్వం రాఖీ కానుక ఇచ్చింద‌ని జోకులు వేస్తున్నారు. 'పెట్టి పుట్టాడు' అంటూ నిష్టూర‌మాడుతున్నారు. 'ప్ర‌జాస్వామ్యంలో అంద‌రూ స‌మాన‌మే.. కొంత మంది మాత్రం ఎక్కువ స‌మాన‌మ‌'నే నానుడిని గుర్తుచేసుకుంటున్నారు.

 

ఇదీ చ‌ద‌వండి: నేనే నిర‌స‌న‌కు దిగుతా.. బాబా రామ్‌దేవ్ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement