న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ స్వావలంబనను మరింత బలోపేతం చేసే కీలక నిర్ణయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీసుకున్నారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసిన అన్ని సంప్రదాయ క్షిపణి వ్యవస్థల సాంకేతికతను దేశీయ రక్షణ పరిశ్రమకు బదిలీ చేసేందుకు ఆయన ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటివరకు ప్రధానంగా ప్రభుత్వ సంస్థల పరిధిలో ఉన్న ఈ సాంకేతికతను అర్హత కలిగిన భారతీయ ప్రైవేట్ కంపెనీలు కూడా ఉపయోగించుకుని క్షిపణులను దేశంలోనే తయారు చేసే అవకాశం లభిస్తుంది. దీంతో భవిష్యత్తులో ఎలాంటి యుద్ధమైనా సరే భారత్ వద్ద మిసైళ్ల కొరతే ఉండదు.
ఈ సాంకేతిక బదిలీ ద్వారా డీఆర్‌డీవో ‘‘అభివృద్ధి’’ దశ నుంచి పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి దిశగా మరింతగా దృష్టి పెట్టనుంది. దేశీయ పరిశ్రమ సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంతో క్షిపణుల తయారీకి అవసరమైన మొత్తం సరఫరా వ్యవస్థ భారత్‌లోనే బలోపేతం కానుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఇతర సాంకేతిక భాగస్వాములు కూడా ఈ సరఫరా వ్యవస్థలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కొత్త వ్యాపార అవకాశాలతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ నిర్ణయంలో ప్రధాన లక్ష్యం విదేశీ ఆయుధాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం. దేశీయ కంపెనీలు డీఆర్‌డీవో రూపొందించిన అధునాతన క్షిపణి వ్యవస్థలను దేశంలోనే ఉత్పత్తి చేయగలిగితే దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. దీనివల్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడంతో పాటు అత్యవసర పరిస్థితులు, యుద్ధ సమయాల్లో ఆయుధాల సరఫరాను దేశీయంగా కొనసాగించే సామర్థ్యం పెరుగుతుంది. రక్షణ ఉత్పత్తిలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరగడం వల్ల పోటీ, ఆవిష్కరణలు కూడా వేగం పుంజుకునే అవకాశం ఉంది.
అయితే సాంకేతికత బదిలీ అయిన వెంటనే ఏ కంపెనీ అయినా క్షిపణుల తయారీ ప్రారంభించలేదు. సంబంధిత సంస్థలు నిర్దేశించిన అర్హతలు, ధ్రువపత్రాలు, నాణ్యతా ప్రమాణాలు, నియంత్రణ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఉత్పత్తికి అనుమతి లభిస్తుంది. ఇప్పటికే డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థలను దేశీయ పరిశ్రమ ద్వారా పెద్ద స్థాయిలో తయారు చేయించడమే ఈ నిర్ణయం లక్ష్యంగా ఉంది.
మొత్తంగా చూస్తే, రాజ్‌నాథ్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం ‘ఆత్మనిర్భర్ భారత్’ రక్షణ ఉత్పత్తి కార్యక్రమానికి మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగాన్ని క్షిపణి తయారీలోకి మరింతగా తీసుకురావడం ద్వారా దేశ రక్షణ పారిశ్రామిక వ్యవస్థ విస్తరించనుంది. భవిష్యత్తులో భారతీయ కంపెనీలు దేశ అవసరాలను తీర్చడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పోటీ పడే స్థాయికి ఎదగడానికి ఇది అవకాశాన్ని కల్పించవచ్చు.
ఇదీ చదవండి: భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు ఫ్రాన్స్ భారీ ప్రణాళిక


