ఇక ప్రైవేటు మిసైల్స్‌! | The beginning of a historic change in the countrys defense sector | Sakshi
Sakshi News home page

ఇక ప్రైవేటు మిసైల్స్‌!

Aug 21 2026 4:37 AM | Updated on Aug 21 2026 4:41 AM

The beginning of a historic change in the countrys defense sector

దరఖాస్తులను ఆహ్వానించిన డీఆర్‌డీఓ 

అర్హతగల సంస్థలకు పరిజ్ఞానం బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణ రంగంలో చరిత్రాత్మక మార్పునకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక క్షిపణులు, అత్యాధునిక గైడెడ్‌ బాంబుల అభివృద్ధి, పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు దేశీయ ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ అనుబంధ పరిశోధనా కేంద్రమైన రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌ (ఆర్‌సీఐ) ఈ మేరకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని విడుదల చేసింది. దేశంలో వ్యూహాత్మక క్షిపణుల తయారీని ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) చేపడుతోంది. 

ఇకపై వాటి తయారీని ప్రైవేటుకూ అప్పగించనున్నారు. ఈ ప్రాజెక్టులను అభివృద్ధి, ఉత్పత్తి భాగస్వామ్యం (డీసీపీపీ) నమూనా కింద చేపట్టనున్నారు. ఈ విధానంలో క్షిపణుల రూపకల్పన, సాంకేతిక పరిజ్ఞానాన్ని డీఆర్‌డీఓ అందిస్తుంది. ఎంపికైన ప్రైవేటు కంపెనీలు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలతో కలిసి నమూనాల తయారీ, వ్యవస్థల అనుసంధానం, క్షేత్రస్థాయి పరీక్షల్లో భాగం పంచుకుంటాయి. ప్రతి ప్రాజెక్టుకు కనీసం రెండు ప్రైవేటు సంస్థలను ఎంపిక చేసి ఆయుధ సరఫరాలో అడ్డంకులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయనున్నారు.

హైదరాబాద్‌ కంపెనీలకూ కొత్త అవకాశాలు.. 
ఇప్పటివరకు దేశీయంగా క్షిపణుల తయారీని ప్రధానంగా ప్రభుత్వ రంగానికి చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) మాత్రమే చూసుకునేది. తాజా నిర్ణయంతో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్, మహీంద్రా డిఫెన్స్, సోలార్‌ డిఫెన్స్, కల్యాణి గ్రూప్‌తోపాటు హైదరాబాద్‌ కంపెనీలైన ఎంటీఏఆర్, ఐకామ్, వీఈఎమ్‌ టెక్నాలజీస్, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్, జెన్‌ టెక్నాలజీస్, లోకేష్‌ మెషీన్స్‌ వంటి ప్రముఖ ప్రైవేటు రక్షణ ఉత్పాదక సంస్థలకు కొత్త అవకాశాలు లభించినట్లయింది.  

కఠినంగా అర్హత ప్రమాణాలు.. 
దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టులు కావడంతో దరఖాస్తు చేసుకునే కంపెనీలకు కఠిన ఆర్థిక, సాంకేతిక నిబంధనలను విధించారు. దరఖాస్తు చేసే ప్రైవేటు సంస్థకు కనీసం రూ. 100 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉండాలని, నికర విలువ రూ. 34 కోట్లకుపైగా ఉండటంతోపాటు క్రెడిట్‌ రేటింగ్‌ తగిన స్థాయిలో ఉండాలని నిర్దేశించారు. రక్షణరంగ ఉత్పాదక లైసెన్స్‌తోపాటు పేలుడు పదార్థాల నిల్వ, నిర్వహణకు సంబంధించి పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ (పెసో) నుంచి లైసెన్స్‌ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఏకకాలంలో 50–100 యూనిట్ల వరకు క్షిపణులను తయారు చేయగల మౌలిక వసతులు కలిగి ఉండాలని షరతు విధించారు.

ఇకపై ప్రైవేటు సంస్థలు తయారు చేయనున్నవి ఇవే.. 
అగ్ని శ్రేణి: సుదూర లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్‌ క్షిపణుల భవిష్యత్తు నమూనాలు. 
జలాంతర్గామి ఆధారిత ఆయుధాలు: సముద్ర
గర్భం నుంచి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలు. 
అణు సామర్థ్య రకాలు: వ్యూహాత్మక అణు నిరోధకఆయుధ సంపత్తి. 
అతివేగ క్షిపణులు: శత్రువులకు చిక్కని హైపర్‌సోనిక్‌ ఆయుధ సాంకేతికత. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement