ప్రత్యేక ఆకర్షణగా హుస్సేన్‌సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్ పోటీలు
ఆరు నగరాలు. 27 క్రీడాంశాలు. 7,500 మందికి పైగా క్రీడాకారులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 డిసెంబర్ 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ నగరాల్లో మొత్తం 27 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా మార్చడంతోపాటు యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఆధునిక క్రీడా మైదానాలు, మెరుగైన శిక్షణ సదుపాయాలు, డిజిటల్ ఫిట్‌నెస్ కార్యక్రమాలతో క్రీడారంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (వైఐపీఈఎస్యూ) వంటి సంస్థలకు ప్రాధాన్యం ఇస్తోంది.
ముఖ్య అతిథిగా ప్రధాని హాజరయ్యే అవకాశం
డిసెంబర్‌లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు రోయింగ్‌ను ఆతిథ్య క్రీడగా ఎంపిక చేశారు. సెయిలింగ్‌ను ప్రదర్శన క్రీడగా నిర్వహించనున్నారు. హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్వహిస్తారు. మిగిలిన పోటీలు హైదరాబాద్‌లో జరిగేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
గచ్చిబౌలి స్టేడియం, ఎల్‌బీ స్టేడియం, సరూర్‌నగర్, జేఎన్‌టీయూహెచ్, సికింద్రాబాద్‌లోని ఇండోర్ స్టేడియాలు, యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాలను పోటీలకు వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాబోయే రెండు నెలలు ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. హుస్సేన్‌సాగర్ వాటర్ స్పోర్ట్స్ కేంద్రంలో రోయింగ్, కయాకింగ్, కానోయింగ్ పోటీలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఐదు కమిటీల ఏర్పాటు
రాష్ట్రంలో ఘనంగా క్రీడలు నిర్వహించేందుకు ఐదు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆర్గనైజింగ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా, కేంద్రమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కో–చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు, అతిథుల వసతి, భోజనం, రవాణా ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తోపాటు మూడు జిల్లాల్లోని 10 క్రీడా వేదికల్లో 12 అభివృద్ధి, ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. క్రీడాకారుల గదులు, ప్రేక్షకుల సౌకర్యాలు, మరుగుదొడ్లు, స్విమ్మింగ్ పూల్స్, సైక్లింగ్ ట్రాక్‌లు, షూటింగ్ రేంజ్‌లను మెరుగుపరచనున్నారు.
గచ్చిబౌలిలో ప్రారంభం..
డిసెంబర్ 11న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంబోత్సవం నిర్వహించే అవకాశముంది. డిసెంబర్ 22న ఎల్‌బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ముగింపు కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
యువ క్రీడాకారులకు పెద్ద వేదిక
దేశవ్యాప్తంగా యువ క్రీడా ప్రతిభను వెలికితీయడం, గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించడం ఖేలో ఇండియా క్రీడల ప్రధాన ఉద్దేశం. రాష్ట్రాల మధ్య జరిగే ఈ పోటీల్లో క్రీడాకారులు సాధించే పతకాలు ఆయా రాష్ట్రాల ఖాతాలో చేరతాయి. అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన రాష్ట్రం విజేతగా నిలుస్తుంది. 2024, 2025 క్రీడల్లో మహారాష్ట్ర విజేతగా నిలిచింది.
ప్రధాన క్రీడాంశాలు..
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బా క్సింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, జూడో, ఖో–ఖో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్.
సాంప్రదాయ క్రీడలు: గట్కా, మల్లఖంబ్, కలరిపయట్టు, థాంగ్–టా, యోగాసన.
తెలంగాణ ఆతిథ్య క్రీడ: రోయింగ్
ఎడిషన్ క్రీడ: సాఫ్ట్‌బాల్
ప్రదర్శన క్రీడ: సెయిలింగ్.


