5 రాష్ట్రాల ఎన్నికల ముందు బీజేపీకి డబుల్‌ ఛాలెంజ్‌ | Reservation issue heats up ahead of elections BJP | Sakshi
Sakshi News home page

5 రాష్ట్రాల ఎన్నికల ముందు బీజేపీకి డబుల్‌ ఛాలెంజ్‌

Aug 25 2026 6:51 PM | Updated on Aug 25 2026 7:22 PM

Reservation issue heats up ahead of elections BJP

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల వేళ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఓబీసీ జనగణన, రిజర్వేషన్ల పరిధి పెంపునకు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి విపక్షాలు మద్దతు ఇస్తుండగా, అగ్రవర్ణాల వర్గాలు రిజర్వేషన్లలో మార్పులు చేయాలని, అవసరమైతే వాటిని రద్దు చేసి ఆర్థిక ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో బీజేపీకి అటు అగ్రవర్ణాలను, ఇటు దళితులు, ఓబీసీలను ఒకేసారి సంతృప్తిపరచడం కష్టంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశం బీజేపీకి నష్టం కలిగించిన నేపథ్యంలో ఇప్పుడు అదే అంశం మరోసారి పార్టీకి రాజకీయంగా ఇరుకునపెట్టే పరిస్థితిగా మారింది. 

కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సహా విపక్షాలు కులగణనలో ఓబీసీ కాలమ్‌ చేర్చాలని, రిజర్వేషన్ల పరిధిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అగ్రవర్ణ వర్గాలకు చెందిన యువత, సామాజిక సంస్థలు రిజర్వేషన్‌ వ్యవస్థలో మార్పులు చేయాలని, అవసరమైతే దాన్ని తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ప్రారంభమైన ‘రిజర్వేషన్‌ సంస్కరణ సత్యాగ్రహం’ లక్నోకు కూడా విస్తరించింది.

బ్రజేశ్‌ పాఠక్‌ను కలిసిన ఆందోళనకారులు 
ఈ ఉద్యమంలో పాల్గొంటున్న హర్ష్‌ దూబే తదితరులు ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్‌ను కలిశారు. వారి డిమాండ్లను కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారు కుల ఆధారిత రిజర్వేషన్లను తొలగించి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌ నిబంధన తీసుకురావాలని, ప్రస్తుత రిజర్వేషన్‌ విధానాన్ని సమీక్షించాలని కోరుతున్నాయి. యూజీసీ తీసుకొచ్చిన దళిత, ఓబీసీ విద్యార్థులపై వివక్షను నిరోధించే నిబంధనలను కూడా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

బ్రజేశ్‌ పాఠక్‌ ఆందోళనకారులతో మాట్లాడటంతో కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, చంద్రశేఖర్‌ ఆజాద్‌ నేతృత్వంలోని ఆజాద్‌ సమాజ్‌ పార్టీ బీజేపీపై విమర్శలు ప్రారంభించాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ రిజర్వేషన్‌ సంస్కరణ పేరుతో రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాత్రం రిజర్వేషన్‌ వ్యవస్థలో ఎలాంటి మార్పునూ అంగీకరించబోమని హెచ్చరించారు. దీంతో రిజర్వేషన్ల అంశం బీజేపీకి ఒకవైపు అగ్రవర్ణ ఓటర్ల అసంతృప్తి, మరోవైపు దళిత-ఓబీసీ ఓట్లపై ప్రభావం అనే ద్వంద్వ సవాలుగా మారింది.

బీజేపీకి ఇది కొత్త సవాలు కాదు 
రిజర్వేషన్ల అంశం బీజేపీకి కొత్త సవాలు కాదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ రాజ్యాంగం, రిజర్వేషన్ల అంశాలను ప్రధానంగా ప్రస్తావించడంతో విపక్షాలు బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందనే ప్రచారం చేశాయి. బీజేపీ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో పార్టీ 29 లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. 

మహారాష్ట్ర, హరియాణా, బిహార్‌లోనూ ఎన్డీయేకు నష్టం జరిగింది. ఎన్నికల అనంతరం బీజేపీ సమీక్షలో రాజ్యాంగం-రిజర్వేషన్‌ అంశంపై విపక్షాలు నిర్మించిన ప్రచారం దళిత, ఓబీసీ ఓట్లపై ప్రభావం చూపిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతకుముందు 2015 బిహార్‌ ఎన్నికల సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ రిజర్వేషన్లను సమీక్షించాలన్న వ్యాఖ్య కూడా బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది.

ఇప్పుడు బీజేపీ ముందున్న అసలు సమస్య అగ్రవర్ణ, ఓబీసీలు, దళితులను ఒకే రాజకీయ కూటమిలో కొనసాగించడం. గత దశాబ్దంలో బీజేపీ అగ్రవర్ణాలతో పాటు నాన్‌-యాదవ్‌ ఓబీసీలు, నాన్‌-జాటవ్‌ దళితులను తనవైపు తిప్పుకుని విస్తృత సామాజిక ఆధారం నిర్మించుకుంది. అయితే రిజర్వేషన్లపై అగ‍్రవర్ణ వర్గాల డిమాండ్లకు అనుకూలంగా అడుగు వేస్తే దళిత, ఓబీసీ ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి మార్పు చేయకపోతే సంప్రదాయ సవర్ణ ఓటు బ్యాంకులో అసంతృప్తి పెరగవచ్చు. అందుకే ఎన్నికల ముందు రిజర్వేషన్ల అంశం బీజేపీకి 2024 తరహాలో మరోసారి ‘డబుల్‌ ఛాలెంజ్‌’గా మారే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement