యువతను చేరుకోవడమే వ్యూహమా? | RSS Visakhapatnam Meeting Gen-z Youth Social Media New Strategy | Sakshi
Sakshi News home page

యువతను చేరుకోవడమే వ్యూహమా?

Aug 25 2026 7:42 AM | Updated on Aug 25 2026 7:42 AM

RSS Visakhapatnam Meeting Gen-z Youth Social Media New Strategy

విశాఖపట్నం సమీపంలోని గుడిలోవలో ఆగస్టు 19 నుంచి 21 వరకు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) మూడు రోజుల అఖిల భారత సమన్వయ సమావేశాన్ని సాధారణ వార్షిక సంస్థాగత సమావేశంగా మాత్రమే చూడటం సరిపోదు. ఈ సమా వేశంలో యువత, వ్యవస్థలోని లోపాలు, జంతర్‌ మంతర్‌ నిరస నలు, కుటుంబ వ్యవస్థ, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు చర్చకు రావడం ఆర్‌ఎస్‌ఎస్‌ భవిష్యత్‌ సామాజిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.

విద్యా వ్యవస్థలో లోపాలు, ప్రవేశ పరీక్షల అవకతవకలు, పేపర్‌ లీకులు, యువత భవిష్యత్తుపై ఆందోళన వంటి అంశాలతో ప్రారంభమైన జెన్‌–జీ ఉద్యమం దేశవ్యాప్తంగా పెద్దచర్చకు దారితీసింది. 49 రోజుల ఆందోళన అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం, ప్రభుత్వం కొన్ని హామీలు ఇవ్వడంతో ఉద్యమం ముగిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ ఎన్నికల రాజకీయాల్లో యువత శక్తిని ఏ రాజకీయ సంస్థ కూడా నిర్లక్ష్యం చేయలేదు.

జంతర్‌ మంతర్‌ నిరసనలపై విలేఖరులు ప్రశ్నించినప్పుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ దానిని కేవలం అవినీతి సమస్యగా చూడలేదు; వ్యవస్థ లోని లోపాలు, యువతలో భవిష్యత్తుపై ఏర్పడుతున్న ఆందోళన; ప్రభుత్వాలు, సమాజం కలిసి వ్యవస్థను సరిచేయాల్సిన అవసరం ఉందని సంఘ్‌ నాయకత్వం పేర్కొంది. విద్య, ఉద్యోగం, పోటీ పరీక్షలు, పరిపాలనా పారదర్శకత, అవినీతి, ధరలు, సామాజిక అవకాశాలు వంటి అనుభవాలు క్రమంగా యువతలో ప్రభు త్వంపై నమ్మకాన్ని నిర్మిస్తాయి లేదా దెబ్బతీస్తాయి. జంతర్‌ మంతర్‌ ఉద్యమం ఈ అసంతృప్తికి ఒక డిజిటల్‌ ముఖాన్ని చూపించింది.

సోషల్‌ మీడియానే యుద్ధభూమి
జంతర్‌ మంతర్‌ ఉద్యమం... నేటి రాజకీయ శక్తి కేవలం సభలు, ర్యాలీలు, పోస్టర్లు, సంప్రదాయ మీడియా ద్వారా నిర్ణయించబడదు, సామాజిక మాధ్యమాల్లో కథనాన్ని ఎవరు నిర్మిస్తారన్నది కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని స్పష్టం చేసింది. జనరేషన్‌ జెడ్‌ రాజకీయ చైతన్యం చాలా వరకు డిజిటల్‌ ప్రపంచంలో పెరుగుతోంది. వ్యంగ్యం, మీమ్స్, చిన్న వీడియోలు, ప్రత్యక్ష ప్రసా రాలు, వ్యక్తిగత కథనాలు– ఇవి యువతను సంప్రదాయ రాజకీయ ప్రసంగాల కంటే వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ యువతతో ‘నిరంతర సంబంధం’ గురించి మాట్లా డటం, సాంకేతికతపై ప్రత్యేకంగా చర్చించడం యాదృచ్ఛికం కాదు.

ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయదు. అయినప్పటికీ బీజేపీతో దాని సైద్ధాంతిక, సంస్థాగత సంబంధాల కారణంగా సంఘ్‌ సమాజంలో చేపట్టే కార్యాచరణకు ఎన్నికల రాజకీయాలపై పరోక్ష ప్రభావం ఉండటం సహజం. అందుకే విశాఖ సమావేశాన్ని బీజేపీ భవిష్యత్‌ ఎన్నికల వ్యూహానికి కూడా ఒక సూచికగా చూడవచ్చు.

ఇకపై సంఘ్‌ ముందున్న అసలు పరీక్ష యువతకు హిందు త్వాన్ని వివరించడం కాదు; యువత ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలకు హిందుత్వ–సనాతన ధర్మ భావజాలం ఏ సమాధానం ఇస్తుందో చూపించడం. ఉపాధి, విద్య, అవినీతి, సాంకేతిక మార్పు, పర్యావరణం, సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు ఈ అంశాలపై ఆచరణాత్మక పరిష్కారాలను చూపగలిగితే సంఘ్‌ తన సామాజిక ప్రభావాన్ని మరింత విస్తరించగలదు. అలా చేయలేక పోతే, కేవలం సిద్ధాంతపరమైన ప్రచారం కొత్తతరాన్ని ఆకర్షించక పోవచ్చు. విశాఖ సమన్వయ సమావేశం అందుకే ఒక సాధారణ వార్షిక సమావేశం కాదు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ తన శతాబ్ది అనంతర దశలో ‘సమాజాన్ని ఎలా చేరుకోవాలి?’ అనే ప్రశ్నకు వెతుకుతున్న సమాధానానికి ఒక ముఖ్యమైన అధ్యాయం.
– సీహెచ్‌.వి.ప్రభాకర్‌ రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement