ఇస్రో గొంతు పిసికేస్తున్నారు: కాంగ్రెస్‌  | Modi government space sector reforms could reduce ISRO role | Sakshi
Sakshi News home page

ఇస్రో గొంతు పిసికేస్తున్నారు: కాంగ్రెస్‌ 

Aug 25 2026 6:31 AM | Updated on Aug 25 2026 6:39 AM

Modi government space sector reforms could reduce ISRO role

న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గొంతు నొక్కేస్తోందని, బలహీనపరుస్తోందని విపక్ష కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఆరోపించింది. అంతరిక్ష ప్రయోగాలను ప్రైవేట్‌ పరం చేసేందుకు ఈ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళుతోందని విమర్శించింది. కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం అధ్యక్షుడు జైరామ్‌ రమేశ్‌ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు చేస్తూ.. దేశీ అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో పాత్రపై ఇటీవలి కాలంలో వెలువడ్డ పలు కథనాలు ఆందోళన రేకెత్తించేవిగా ఉన్నాయన్నారు.

 ‘‘ఇస్రో సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ ఆందోళనలన్నీ సరైనవే. విక్రమ్‌ సారాభాయ్, సతీశ్‌ ధవన్, బ్రహ్మ ప్రకాశ్, యూఆర్‌ రావు, ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ వంటి మహాహుల దార్శనిక నేతృత్వంలో ఆరుదశాబ్దాలుగా దీన్ని ఒక క్రమపద్ధతిలో నిర్మించారు.’’అని ఆయన వెల్లడించారు. 1969లో విక్రమ్‌ సారాభాయ్‌ నేతృత్వంలో స్థాపితమైన ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో ఎంత కీలకమో తెలియంది కాదు. అణుశక్తి విషయంలో చేసినట్టుగానే మోదీ ప్రభుత్వం అంతరిక్ష ప్రయోగాల విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ ప్రైవేటీకరణ మంత్రం జపిస్తోందని ఆరోపించారు. 

‘‘ఇందుకు స్ఫూర్తి ప్రధానమంత్రి, ఆయన కార్యాలయం (పీఎంఓ) నుంచే వస్తోంది. రాకెట్ల అభివృద్ది, తయారీలలో ఇస్రో ప్రమేయం తగ్గిపోనుంది. ఉపగ్రహ వ్యవస్థలకు సంబంధించిన ఆస్తులను ఉన్నవి ఉన్నట్టుగా ప్రైవేట్‌ వారికి అప్పనంగా కట్టబెట్టేస్తారు’’అని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న రెండో ఉపగ్రహ ప్రయోగ కేంద్రాన్ని కూడా కేంద్రం దాదాపు రూ.వెయ్యికోట్లు పెట్టుబడి పెడతామంటున్న ప్రైవేట్‌ కంపెనీ ఒకదానికి కట్టబెడుతోందని విమర్శించారు. మారిపోతున్న పరిస్థితులను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం భవిష్యత్తును కూడా ఎవరైనా ఇట్టే ఊహించవచ్చునని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement