3 రోజుల లోక్ అదాలత్ ‘సమాధాన్ సమారోహ్’పై సుప్రీం వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను సర్వోన్నత న్యాయస్థానంలో నిర్వహించిన సమాధాన్ సమారోహ్ ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమంలో మూడ్రోజుల్లోనే ఏకంగా 1,712 కేసులను పరిష్కరించారు. మొత్తం 1,712 కేసులకు తీర్పులివ్వడం లేదా విచారణార్హమైనవి కావని తేలిన పక్షంలో తిరస్కరించడమూ చేశారు. ఆగస్ట్ 21వ తేదీ నుంచి 23వ తేదీదాకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకంలో ఈ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సుప్రీంకోర్టు సోమవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
సత్వరం సెటెల్మెంట్ చేయగల ఆస్కారమున్న కేసులను ఒక జాబితాగా సిద్ధంచేసి కక్షిదారులు, ప్రత్యర్థి పార్టీలను పిలిపించి వేగంగా కేసులను పరిష్కరించారు. ఈ మూడ్రోజుల్లో విచారణ కోసం 3,285 కేసులను సిద్ధంచేయగా కాలావధిలోపు 1,664 కేసులకు తీర్పులు ఇవ్వడం లేదా తిరస్కరించడం చేశారు. మిగతా 48 కేసులన మధ్యవర్తిత్వం మార్గం ద్వారా రాజీ కుదిర్చి కేసులకు ముగింపు పలికారు. దీంతో పరిష్కారభాగ్యం దక్కిన కేసుల సంఖ్య 1,712కు పెరిగింది. ఈ మొత్తం కేసులతో ముడిపడిన రూ.240.94 కోట్ల విలువైన స్థిర,చరాస్థులకు సైతం సుప్రీంకోర్టు పరిష్కారాలు చూపింది.
లోక్‌అదాలత్‌కు సీజేఐ నేతృత్వం వహించారు. ఈయనతోపాటు సీనియర్ జడ్జీలు, ఇతర జడ్జీలు, సీనియర్ న్యాయవాదులు, అడ్వకేట్స్–ఆన్–రికార్డ్, సీనియర్ రిజి్రస్టార్‌లు, ఇతర ఉన్నతాధికారులు ఈ లోక్ అదాలత్‌లో భాగస్వాములయ్యారు. మధ్యవర్తిత్వం, రాజీ, ఏకాభప్రాయం ద్వారా కొన్ని కేసులు పరిష్కారమయ్యాయి. వివాహ సంబంధ, స్థిరచరాస్థి తగాదాలు, యాక్సిడెంట్‌లు, భూ వివాదాలు, నష్టపరిహారాలు, పన్నులు, సేవలు, కారి్మకులకు సంబంధించిన కేసులను ఈ లోక్‌అదాలత్‌లో పరిష్కరించారు. లోక్‌అదాలత్‌లో ఇరు పక్షాల కాలం, డబ్బు, శ్రమ, మానసిక క్షోభ, నిరీక్షణ అన్ని తప్పుతాయని కోర్టు వ్యాఖ్యానించింది.


