ట్రంప్, మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్‌పై అమెరికా రాయబారి సెర్గీ గోర్ వివరణ
ట్రంప్ ఆ విషయం మర్చిపోయి ఎనీ క్వశ్చన్స్ అన్నారు.
దీంతో 45 నిమిషాల ప్రశ్నోత్తరాలు నడిచాయి
నిబంధనలు పాటించమని మాత్రమే చెప్పామన్న భారత్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో నిర్వహించిన విలేకరుల సమవేశంలో ప్రశ్నలేవీ రాకుండా చూసుకోవాలని భారత్ తమని ప్రత్యేకంగా కోరిందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గీ గోర్ వ్యాఖ్యానించారు. మొదట ట్రంప్ ఇందుకు అంగీకరించినప్పటికీ, ఆ తరువాత మరచిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ‘‘ఏమైనా ప్రశ్నలున్నాయా’’అని విలేకరులను అడిగారని, దీంతో 45 నిమిషాలపాటు ప్రశ్నోత్తరాలు కొనసాగాయని ఆయన చెప్పారు.
ఫ్రాన్స్‌లో ఈ ఏడాది జీ–7 సమావేశాల సందర్భంగా మోదీ, ట్రంప్‌లు జూన్ 17వ తేదీ సమావేశమైనప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన ఒక వార్తా పత్రిక నిర్వహించని సదస్సులో రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. సున్నితమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ... ఢిల్లీకి వచ్చిన ప్రత్యేక అతిథుల విషయంలో అనుసరించే నిబంధనలను పాటించాల్సిందిగా మాత్రమే తాము అమెరికన్ ప్రతినిధులకు చెప్పామని తెలిపాయి.
నేతల సమవేశాల సందర్భంగా ఇలాంటి చర్చలు సహజమని తెలిపారు. ‘‘మేము స్టేజీ వెనుక ఉన్నాం. ఒక దశలో నేను, అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే ఉండగా.. ఇండియన్స్ ఏ అంశాలను లేవనెత్తాలనుకుంటున్నారు అని అడిగారు. ఆ తరువాత ఆయా అంశాలపై మేము మాట్లాడాము’’అని గోర్ ఆ నాటి ఘటనను గుర్తు చేసుకుంటూ చెప్పారు.
ఇందుకు సమాధానంగా తాను ప్రశ్నలేవీ వద్దని భారత్ కోరుకుంటోందని నేరుగానే ట్రంప్‌కు చెప్పానని, ఆయన కూడా సరే అన్నాడని సెర్గీ గోర్ వివరించారు. ఆ తరువాత సుమారు యాభై వీడియో కెమెరాలు, విలేకరుల ముందు సమావేశం ప్రారంభమైందని, ట్రంప్, మోదీలు పక్కపక్కన కూర్చుని ప్రారంభ వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ట్రంప్ తన వ్యాఖ్యలు పూర్తవగానే కెమెరాలవైపు తిరిగి ‘‘ఎనీ క్వశ్చన్స్?’’అని అడిగారని ఇది కాస్తా పూర్తిస్థాయి సంభాషణకు దారితీసిందని తెలిపారు.


