సైబర్ టెర్రరిజం కేసులో NIA దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు! | NIA Raids Five States in 2025 Gujarat Cyber Terrorism Case | Sakshi
Sakshi News home page

సైబర్ టెర్రరిజం కేసులో NIA దూకుడు.. ఐదు రాష్ట్రాల్లో సోదాలు!

Aug 24 2026 11:01 PM | Updated on Aug 24 2026 11:01 PM

NIA Raids Five States in 2025 Gujarat Cyber Terrorism Case

గుజరాత్ సైబర్ టెర్రరిజం కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం ఐదు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 2025 జూన్ 25న నమోదైన RC-01/2025/NIA/AMD కేసుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి.

మహారాష్ట్రలోని పుణే జిల్లా జున్నార్, గుజరాత్‌లోని ఖేడా జిల్లా నడియాద్, తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండం, బీహార్‌లోని గోపాల్‌గంజ్, ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నిందితులకు సంబంధించిన నివాసాలు, ఇతర ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో.. భారత ప్రభుత్వానికి చెందిన 54 వెబ్‌సైట్లపై అత్యాధునిక డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ (DDoS) దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. దేశ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు భంగం కలిగించడంతో పాటు ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యంగా ఈ దాడులకు ప్రయత్నించినట్లు NIA తెలిపింది.

ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తొలుత ఈ కేసును గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సాంకేతిక విశ్లేషణ ద్వారా అరెస్టయిన నిందితులకు సైబర్ దాడులకు పాల్పడేందుకు శిక్షణ, సాంకేతిక సహకారం, నైపుణ్యాభివృద్ధిలో సహకరించినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను NIA గుర్తించింది.

సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందిన అనంతరం సోమవారం వారి ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాకింగ్ కార్యకలాపాలకు సంబంధించినట్లు భావిస్తున్న పలు డిజిటల్ పరికరాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3 ల్యాప్‌టాప్‌లు, 5 మొబైల్ ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లతో పాటు ఇతర డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను అరెస్టయిన నిందితులతో వారి సంబంధాలపై విచారించారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని NIA వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement