తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో తన ఆధ్యాత్మిక యాత్రకు అంతరాయం కలిగిందని పేర్కొంటూ ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. చట్టపరమైన ఆంక్ష ఏదీ లేని పరిస్థితిలో ఏ భక్తుడినీ ఆలయంలోకి ప్రవేశించకుండా ఏకపక్షంగా అడ్డుకోకూడదని ఆమె వాదించారు.
భక్తురాలు సత్యశ్రీ షర్మిలా రెహమతాలీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు పి.గోపీనాథ్, ఎస్.మను సభ్యులుగా ఉన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు, పతనంతిట్ట జిల్లా కలెక్టర్ నుంచి సమాధానాలు కోరింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చట్టబద్ధమైన నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారికంగా ప్రకటించిన నియమాలు ఏవీ లేవని ఆమె వాదించారు. పోలీసు లేదా ఆలయ అధికారులు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ప్రవేశంపై అనధికారిక ఆంక్షలు విధించినట్లు కూడా ఎక్కడా లేదని పేర్కొన్నారు.
రెహమతాలీ తన అభ్యంతరాలను తెలియజేస్తూ ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డుకు, ప్రధాన కార్యదర్శికి కూడా వినతులు సమర్పించారు. మహిళల ఆలయ ప్రవేశం అంశం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్నందున ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని దేవస్వం బోర్డు వాదించింది.
ఏం జరిగింది?
పిటిషన్ ప్రకారం.. ఆగస్టు 20న పంబ గణపతి ఆలయం సమీపంలో పోలీసుల తనిఖీ సమయంలో పిటిషనర్‌ను అడ్డుకున్నారు. శబరిమల ఆలయానికి వెళ్లేందుకు ఆమెను అనుమతించబోమని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను శబరిమలకు అనుమతించవద్దని దేవస్వం బోర్డు పోలీసులకు ఆదేశించినట్లు పంబ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆమెకు తెలిపారు. 2026 జనవరి, ఏప్రిల్ నెలల్లో తాను ఇప్పటికే రెండుసార్లు శబరిమల ఆలయ యాత్ర పూర్తి చేసినట్లు ఆమె కోర్టుకు తెలిపారు.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల ప్రవేశంపై నిషేధాన్ని పేర్కొనే లిఖితపూర్వక ఉత్తర్వు లేదా సర్క్యులర్‌ను చూపించాలని రెహమతాలీ పోలీసు అధికారులను కోరారు. అయితే అలాంటి పత్రాలను వ్యక్తిగతంగా ఆమెకు చూపించలేమని పోలీసులు చెప్పినట్లు ఆమె ఆరోపించారు. ఆగస్టు 26న తిరువోణం సందర్భంగా ఆలయాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఆలయ ఆచారాల ప్రకారం తాను కొనసాగిస్తున్న ఆచారబద్ధమైన ఉపవాసాన్ని పూర్తి చేస్తున్నానని ఆమె తెలిపారు. చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని కూడా కోరారు.
ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టం-2019ను ఉల్లంఘిస్తూ అధికారులు తనపై వివక్ష చూపినట్లు తేలితే, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కూడా పిటిషన్‌లో కోరారు.
ఇదీ చదవండి: 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు


