ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్‌కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. మోహన్‌లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ షూటింగ్‌కు అనుమతి ఇవ్వడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేరళ దేవస్వం మంత్రి కే. మురళీధరన్ ఈ కీలక ప్రకటన చేశారు. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగించేందుకు అనుమతించబోమని ఆయన తెలిపారు.
శబరిమలలో సినిమా షూటింగ్‌కు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ విధానం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయ్యప్ప స్వామికి సంబంధించిన సినిమాలు, మతపరమైన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు. సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్‌కు మాత్రం అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆలయాలను సినిమా షూటింగ్ కోసం వినియోగించేందుకు అనుమతించడం సరికాదని అన్నారు.
శబరిమలలో షూటింగ్‌కు సంబంధించిన నిబంధనలను తాను పూర్తిగా పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. ఆలయ పవిత్రత, భక్తుల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు.
మోహన్‌లాల్ మూవీతో వివాదం
ఈ వివాదానికి కారణం మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అతిమనోహరం సినిమా. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శబరిమలలోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. పంపా నుంచి సన్నిధానం వరకు కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే సినిమాకు సంబంధించి పలు షరతులు విధించినట్లు సమాచారం. శబరిమల లేదా హిందూ మత విశ్వాసాలను ప్రతికూలంగా చూపించకూడదని, షూటింగ్‌కు అవసరమైన ఇతర శాఖల అనుమతులు కూడా తీసుకోవాలని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అనుమతుల్లో కీలకమైన అటవీ శాఖ అనుమతి విషయంలో సమస్య ఏర్పడింది. షూటింగ్‌కు అటవీ శాఖ అనుమతి నిరాకరించడంతో అక్కడ చిత్రీకరణకు బ్రేక్ పడింది. దీంతో అసలు దేవస్వం బోర్డు సాధారణ సినిమాకు అనుమతి ఎలా ఇచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి.
ప్రభుత్వ విధానంపై ప్రశ్నలు
దేవస్వం బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత.. అటవీ శాఖ దాన్ని తిరస్కరించడంతో వివాదం మరింత ముదిరింది. శబరిమల వంటి అత్యంత సున్నితమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో సినిమా షూటింగ్‌కు వివిధ ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేకుండా అనుమతులు ఇవ్వడంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సాధారణ కమర్షియల్ సినిమాలకు షూటింగ్ అనుమతులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరో చోటులో షూటింగ్
తరుణ్ మూర్తి దర్శకత్వం వహిస్తున్న అతిమనోహరంలో మోహన్‌లాల్, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాలు అలెక్స్, మనోజ్ కే. జయన్, జగదీష్, ఇర్షాద్, సుధీష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం పూర్తయింది. కొచ్చితో పాటు పలు చోట్ల కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మిగిలిన షూటింగ్‌ను కొచ్చి, శబరిమలతో పాటు హైదరాబాద్, ముంబైలో నిర్వహించాలని చిత్ర బృందం భావించింది. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే శబరిమలలో షూటింగ్‌కు అనుమతి నిరాకరణతో చిత్ర బృందం ప్రత్యామ్నాయ లొకేషన్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంతకు ముందు..
గతంలోనూ శబరిమల, పంబా పరిసరాల్లో పలు సినిమాల షూటింగ్ జరిగింది. తమిళ చిత్రం ‘నంబినార్ కేడువతిల్లై’ (1986)లోని ఓ పాటను శబరిమలలోని 18 మెట్ల వద్ద చిత్రీకరించారు. మలయాళంలో ‘స్వామి అయ్యప్పన్’ (1975), ‘మాలికప్పురం’ (2022) వంటి చిత్రాల్లో శబరిమల ప్రాంతాల్లో షూట్ చేశారు. కన్నడ చిత్రం ‘సీజర్’ (2018)లోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనే క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించారు.
ఆలయ పవిత్రతే కీలకం
శబరిమల కేవలం ఒక పర్యాటక ప్రదేశం లేదా సాధారణ షూటింగ్ లొకేషన్ కాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు అయ్యప్ప దర్శనం కోసం తరలివచ్చే నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ వల్ల భక్తుల రాకపోకలు, భద్రత, ఆధ్యాత్మిక వాతావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మోహన్‌లాల్ సినిమా షూటింగ్ అనుమతి వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో శబరిమలలో కమర్షియల్ సినిమాల షూటింగ్‌కు దాదాపు తలుపులు మూసేసినట్లయింది. ఇకపై అయ్యప్ప, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ప్రత్యేక అనుమతుల అవకాశముంటుందని కేరళ దేవస్వం మంత్రి స్పష్టం చేశారు.


