దేశంలోని బ్యాంకు ఉద్యోగులు, అధికారుల సంఘాల ఉమ్మడి వేదికైన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) వారానికి 5 రోజుల పనిదినాల అమలు డిమాండ్‌తో మరోసారి సమ్మెకు సిద్ధమైంది. 12వ ద్వైపాక్షిక ఒప్పందం (12th Bipartite Settlement), 9వ జాయింట్ నోటిఫై 2024పై మార్చి 8నే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), యూనియన్లు సంతకాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఇంకా లభించకపోవడమే ఈ ఆందోళనకు ప్రధాన కారణం.
ఈ ఒప్పందం ప్రకారం శని, ఆదివారాలు సెలవు దినాలుగా ప్రకటిస్తూ దానికి పరిహారంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 40 నిమిషాల అదనపు పనివేళలను పెంచేందుకు యూనియన్లు అంగీకరించాయి. అయితే ప్రభుత్వ ఆలస్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ యూఎఫ్‌బీయూ మూడు దశల ఆందోళన కార్యక్రమాలను ప్రకటించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 11న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె, సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల సమ్మె, అప్పటికీ డిమాండ్లు నెరవేరకపోతే అక్టోబర్ 26 నుంచి అనిశ్చిత కాల సమ్మె చేపడతామని స్పష్టం చేసింది.
వారానికి 5 రోజుల బ్యాంకింగ్‌తో పాటు ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) తీసుకొచ్చిన విచక్షణాయుతమైన పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, దానికి సమానమైన పీఎల్‌ఐని వర్తింపజేయాలని యూనియన్లు కోరుతున్నాయి. అలాగే పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, పెన్షన్ అప్‌డేషన్, డీఏ ఫార్ములాను ఏకీకృతం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
నేటి డిజిటల్ యుగంలో నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినందున బ్యాంకింగ్ రంగంలో 5 రోజుల పనిదినాల అమలు వల్ల కస్టమర్ సేవలకు ఎటువంటి విఘాతం కలగదని బ్యాంకింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పైగా, ఉద్యోగులలో వర్క్-లైఫ్ సమతుల్యత పెరిగి వారి మానసిక ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించి ఈ సుదీర్ఘ డిమాండ్‌పై నిర్ణయం తీసుకోకుంటే పండుగల సీజన్‌లో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?


