జెన్‌-జీ స్టైల్లో బ్యాంకింగ్ | Free Vouchers, Campus Banking And More, Nirmala Sitharaman’s Big Push To Attract Youth, Check More Details Inside | Sakshi
Sakshi News home page

జెన్‌-జీ స్టైల్లో బ్యాంకింగ్

Aug 19 2026 8:42 AM | Updated on Aug 19 2026 9:54 AM

Free Vouchers Campus Banking Nirmala Sitharaman Big Push For Youth

బ్యాంకింగ్‌ సేవలను యువతకు చేరువ చేయడంపై ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) మరింతగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. వారి అంచనాలకు అనుగుణంగా బ్యాంకింగ్‌ మరింత సరళతరంగా, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లు నిరంతరాయం అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. యువత బ్రాంచీలకి వచ్చే వరకు వేచి చూడటం కాకుండా, బ్యాంకులే నేరుగా వారి వద్దకు వెళ్లాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 16 ఏళ్లు పైబడిన వారికి చేరువయ్యేలా అక్టోబర్‌ 2 నుంచి నెలరోజుల పాటు ‘బ్యాంకింగ్‌ ఫర్‌ యూత్‌’ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు.

అకౌంట్లు తెరవడం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు వివిధ అంశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని పీఎస్‌బీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ఇందుకోసం కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఇతరత్రా క్యాంపస్‌లు మొదలైనవి అనువైన ప్రదేశాలుగా ఉంటాయని మంత్రి చెప్పారు. యువతను ఆకర్షించేందుకు 12 పీఎస్‌బీల్లోని ప్రతి బ్యాంకు సొంత వ్యూహాలను రూపొందించుకోవాలని చెప్పారు. వారు కేవలం అకౌంటు తెరవడానికే పరిమితం కాకుండా కెరియర్‌ ఆసాంతం, ఆ తర్వాత కూడా దీర్ఘకాలికంగా తమ బ్యాంకుతో అనుబంధాన్ని పెంపొందించుకునేలా చూసుకోవాలని అన్నారు.

‘మొదటి అకౌంటు తెరవడం, మొదటిసారిగా జీతం తీసుకోవడం, ఉన్నత విద్య అవసరాలు, వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం లేదా తొలిసారిగా పెట్టుబడి పెట్టడం.. ఇలా ఏ విషయమైనా కావచ్చు యువ భారతీయులు ముందుగా ప్రభుత్వ రంగ బ్యాంకునే ఎంచుకునే విధంగా ఉండాలి. పీఎస్‌బీలు వారి జీవితాల్లో భాగంగా మారాలి’ అని ఆమె పేర్కొన్నారు.  

ఉచిత కంటెంట్‌.. యువ కియోస్క్‌లు..

యువతను బ్యాంకింగ్‌ పరిధిలోకి తెచ్చే దిశగా పేరొందిన విద్యా సంస్థల భాగస్వామ్యంతో బ్యాంకులు ఉచితంగా ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ కంటెంట్‌ అందించవచ్చని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే, ఫిట్‌నెస్‌ సెంటర్లు, యోగా సెంటర్ల కోసం కూపన్లు, వోచర్లలాంటి లైఫ్‌స్టయిల్‌ ఆధారిత ప్రయోజనాలు ఇవ్వడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో యువతకు సహాయం చేసేలా బ్యాంకుల శాఖల్లో ఒక ఉద్యోగిని కేటాయించి యువ బ్యాంకింగ్‌ మిత్ర యువ కియోస్క్‌ల్లాంటివి ఏర్పాటు చేయొచ్చని చెప్పారు. 

వివిధ రుణ సాధనాలు, ప్రభుత్వ స్కీములు, క్రెడిట్‌ స్కోర్ల ప్రాధాన్యత గురించి తెలియజేయాలని మంత్రి తెలిపారు. యువతలో బ్యాంకింగ్‌పై అవగాహన పెంచేందుకు ఐబీఏ ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తమ అవసరాలకు అనుగుణమైన బ్యాంకింగ్‌ సేవలు, ఆర్థిక అవకాశాల గురించి యువతకు అర్థమయ్యే విధంగా ఇది ఉండాలని మంత్రి చెప్పారు.

ఇది చదవండి: ఒరిజినల్‌ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement