కిరాణా నుంచి విదేశీ ప్రయాణాల దాకా...
మెట్రోలకు దీటుగా చిన్న నగరాల్లో వినియోగం
ఫారెక్స్ డిమాండ్‌లో 53 శాతానికి చేరిన వాటా
విదేశీ విద్య, ఫారిన్ టూర్లకు పెరుగుతున్న ఆసక్తి
ఆదాయాల జోరుతో మారుతున్న లైఫ్‌స్టయిల్
ఇప్పటిదాకా భారీ వినియోగంతో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తున్న మెట్రోలతో చిన్న నగరాలు కూడా తగ్గేదేలే అంటూ పోటీ పడుతున్నాయి. పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న జీవనశైలితో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల ప్రజలు ఖర్చు విషయంలో కొత్త అడుగులు వేస్తున్నారు. కిరాణా సరుకుల నుంచి ప్రీమియం ఉత్పత్తుల వరకు.. ఇళ్ల కొనుగోలు నుంచి పెట్టుబడుల వరకు.. ఆన్‌లైన్ షాపింగ్ నుంచి ఫారిన్ టూర్లు, విదేశీ విద్య దాకా.. చిన్న పట్టణాల్లో వినియోగం తీరు వేగంగా మారుతోంది. ఈ మార్పు డాలర్లకు డిమాండ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. థామస్ కుక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం విదేశీ కరెన్సీ (ఫారెక్స్) డిమాండ్‌లో టైర్–2, టైర్–3 నగరాల వాటా మెట్రోలను మించి 53 శాతానికి దూసుకెళ్లడం విశేషం! – సాక్షి, బిజినెస్ డెస్క్
దశాబ్దం క్రితం విదేశీ టూర్లు, విదేశీ విద్యకు మెట్రోలు, పెద్ద నగరాల నుంచే డిమాండ్ భారీగా ఉండేది. ఒకప్పుడు సెకండరీ మార్కెట్లుగా పరిగణించిన చిన్న నగరాల ప్రజలు కూడా ఇప్పుడు విదేశీ ప్రయాణాలకు లగేజీ సర్దేస్తున్నారు. దేశంలో భారీగా పెరుగుతున్న మిడిల్ క్లాస్ గత కొన్నేళ్లుగా ఫారిన్ టూర్లపై ఖర్చుకు వెనకాడటం లేదనడానికి వారి డాలర్ డిమాండే నిదర్శనం. థామస్ కుక్ ఇండియా ఫారెక్స్ నివేదిక–2026 ప్రకారం.. దేశంలోని మొత్తం ఫారెక్స్ డిమాండ్‌లో టైర్–2 నగరాల వాటా 41 శాతం కాగా, టైర్–3 నగరాల వాటా 12 శాతంగా నమోదైంది.
అంటే మొత్తం 53 శాతం. ఇక మెట్రోలు, ఇతర టైర్–1 నగరాల వాటా 47 శాతానికి పరిమితమైంది. విదేశీ కరెన్సీ కొనుగోళ్లకు అత్యధికంగా విదేశీ విహారయాత్రలే దన్నుగా నిలుస్తున్నాయి. వీటి వాటా 57 శాతం. కార్పొరేట్ ప్రయాణాలకు 27 శాతం, విదేశీ విద్య కోసం 16% చొప్పున ఫారెక్స్ డిమాండ్ నమోదైంది. ఇక వయస్సు పరంగా చూస్తే 25–40 ఏళ్ల ట్రావెలర్స్ నుంచి 37% ఫారెక్స్ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయి.
41–60 ఏళ్ల వారి వాటా 36 శాతంగా ఉంది. మిలీనియల్స్, జెన్–ఎక్స్ వాటా మొత్తం ఫారెక్స్ డిమాండ్‌లో మూడొంతులు ఉన్నట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇక మొత్తం ఫారెక్స్ కొనుగోళ్లలో అమెరికా డాలర్ల వాటా 49% కాగా.. యూరో, పౌండ్‌ల వాటా 23 శాతంగా ఉంది. మిగిలిన వాటా ఆసియా కరెన్సీలు (11%), పశి్చమాసియా (9%) కరెన్సీలది. మరోపక్క, కరెన్సీ కొనుగోళ్లలో డిజిటల్ జోరు పెరుగుతోంది. థామస్ కుక్ ఇండియా తమ డిజిటల్ ఫారెక్స్ చానెల్స్ ద్వారా కరెన్సీ కొనుగోళ్లు ఏడాదిలో 25% ఎగబాకిందని తెలిపింది. అయితే, ఇప్పటికీ 75 శాతం ఫారెక్స్ లావాదేవీలు బ్రాంచ్‌ల ద్వారానే జరుగుతుండటం గమనార్హం.
ఖరీదైన జీవనశైలికి మొగ్గు
చిన్న పట్టణాల ప్రజలు కేవలం రోజువారీ అవసరాలపైనే కాకుండా ప్రీమియం ఉత్పత్తులు, ట్రావెల్, జీవనశైలికి సంబంధించిన సేవలపై భారీగా ఖర్చు చేస్తున్నారు. ఆదాయాలు పెరుగుతుండటంలో కొంగొత్త అనుభవాలు, అనుభూతుల కోసం ఎంత ఖర్చయినా సై అంటున్నారు. ముఖ్యంగా దుస్తులు, లైఫ్‌స్టయిల్ ప్రోడక్టులు, విహార యాత్రల కోసం అధికంగా వెచ్చిస్తుండటం విశేషం. ఇదిలాఉంటే, ఇళ్ల అమ్మకాల్లో కొత్తగా లగ్జరీ ట్రెండ్ కనిపిస్తోంది.
2025లో టైర్–2 నగరాల్లో ఇళ్ల అమ్మకాల సంఖ్య 10% తగ్గినా.. మొత్తం లావాదేవీల విలువ మాత్రం రూ.1.48 లక్షల కోట్ల వద్ద నిలకడగా ఉంది. తక్కువ ఇళ్లు కొన్నా.. ఖరీదైన ఇళ్ల వైపు కొనుగోలుదారులు మొగ్గుచూపినట్లు వెల్లడైంది. అంటే ప్రీమియమైజేషన్ అనేది మెట్రోలను దాటి చిన్న నగరాలకు విస్తరిస్తోందన్నమాట. సెబీ అర్బన్ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుదల, వినియోగదారుల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని నిపుణులు చెబు తున్నారు.
రిటైల్.. రయ్
రిటైల్ వినియోగంలో చిన్న నగరాలు, పట్టణాలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. వృద్ధిలో మెట్రో నగరాలను గతేడాదే దాటేశాయి. ముఖ్యంగా 5,000 కంటే తక్కువ జనాభా ఉన్న సెమీ రూరల్, టైర్ 3–5 మార్కెట్లలో డిమాండ్ ఓ రేంజ్‌లో ఉంది. దీంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీల నుంచి వాహన సంస్థల దాకా చిన్న పట్టణాలపై మరింత ఫోకస్ చేస్తున్నాయి. భవిష్యత్తు వృద్ధి అవకాశాల కోసం విస్తరణ బాట పడుతున్నాయి. మరోపక్క, చిన్న నగరాల్లో సేవలందిస్తున్న ప్రాంతీయ రిటైల్ కంపెనీలు సైతం ఇప్పుడు నిధుల సమీకరణ కోసం పబ్లిక్ ఆఫర్ల (ఐపీఓ) బాట పడుతుండటం విశేషం!
పెట్టుబడుల్లోనూ నయా ట్రెండ్...
చిన్న నగరాలు, పట్టణాలు వినియోగంలోనే కాదు పెట్టుబడుల్లోనూ సత్తా చాటుతున్నారు. పొదుపు, మదుపులోనూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బంగారం, స్థిరాస్థి కొనుగోళ్లకే పరిమితం కాకుండా సంపద సృష్టి కోసం ప్రత్యామ్నాయ ఆర్థిక సాధనాల వైపు మళ్లుతున్నారు. టైర్–2, 3 నగరాల నుంచి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు భారీగా పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. చిన్న పట్టణాల నుంచి కొత్త డీమ్యాట్ ఖాతాలు విపరీతంగా నమోదవుతుండటం వారిలో ఆర్థిక అవగాహన, అదనపు ఆదాయాల పెరుగుదలను సూచిస్తోందనేది మార్కెట్ వర్గాల మాట!


