ఇథనాల్ పెంపుతో ఆహారం–ఇంధనం మధ్య పోటీ
మిశ్రమాన్ని ఈ20 వద్దే పరిమితం చేయాలి
సీఈఏ వి.అనంత నాగేశ్వరన్, డీఈఏ ఆకాష్ పూజారి వ్యాఖ్యలు
పాత వాహనాలను వినియోగించే కోట్లాది మంది ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఇథనాల్ (ఈ10) కలిగిన పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారి సూచించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన ఈ20 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. ముడిచమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దేశీయ వ్యవసాయానికి మద్దతు ఇవ్వడం, ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా గతేడాది ఈ20ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1 నుంచి బంకుల్లో విక్రయించే పెట్రోల్‌కు ఇదే ప్రామాణికంగా మారింది.
వెల్లువెత్తిన ఫిర్యాదులు
ఈ20 పెట్రోల్ వాడకం వల్ల బీఎస్–6కు ముందు మోడల్ వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు ఆటో విడిభాగాలు దెబ్బతినడం వంటి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆరోపణలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చుతూ వస్తోంది. పలు రకాల ఇంధనాలను ఏకకాలంలో సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి నిర్వహించడం సాధ్యం కాదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ ఫిర్యాదులను పూర్తిగా తోసిపుచ్చడం సరికాదని అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో రాసిన అభిప్రాయ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ అభిప్రాయాలు తమ వ్యక్తిగతమైనవని స్పష్టం చేశారు.
మైలేజీపై 6–7 శాతం ప్రభావం
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి తక్కువగా ఉండటంతో ఈ20 వాడకం వల్ల లీటరుకు వాహనం ప్రయాణించే దూరం కొంత తగ్గుతుందని నాగేశ్వరన్, పూజారి అంగీకరించారు. అయితే దీని ప్రభావం 6–7 శాతం మేరకే ఉంటుందని అంచనా వేశారు. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ అరుగుదల పెరుగుతుందనడానికి భారత్, అమెరికాలో నిర్వహించిన పరీక్షల్లో ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
ఈ20 వద్దే పరిమితం చేయాలి
ఇథనాల్ విధానం వల్ల చెరకు రైతులకు బకాయిల చెల్లింపులు వేగవంతం కావడం, గ్రామీణ ఆదాయా లు పెరగడం వంటి సానుకూల ఫలితాలు ల భించాయని నాగేశ్వరన్, పూజారి పేర్కొన్నారు. అ యితే ఇథనాల్ మిశ్రమాన్ని మరింత పెంచే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆహార భద్రత, ఇంధన అవసరాల మధ్య సమతుల్యతపై సమగ్రంగా అంచనా వేసే వరకు ఇథనాల్ బ్లెండింగ్‌ను ఈ20 వద్దే పరిమితం చేయాలని అభిప్రాయపడ్డారు. ఇథనాల్ కొనుగోలు ధరలు, నీటి వినియోగ నిబంధనలు, ఈ10 పెట్రోల్ లభ్య త వంటి విధానాలను అవసరానికి అనుగుణంగా మార్చుకునే అంశాలపై ముందుగా దృష్టి పెట్టా లని సూచించారు. ‘‘ఇది కేవలం ఇంజిన్ల సమస్య కాదు. మనం ఏ పంటలను సాగు చేయాలి.. భవిష్యత్తులో ఏ నిర్ణయాలను వెనక్కి తీసుకోలేం అనేదే అసలు ప్రశ్న’’ అని వారు పేర్కొన్నారు.
ఆహార భద్రతకు ముప్పు
ఇథనాల్ మిశ్రమాన్ని ఈ20కి మించి పెంచితే ఆహార పంటలు, ఇంధన అవసరాల మధ్య పోటీ పెరిగే ప్రమాదం ఉందని సీఈఏ అనంత నాగేశ్వరన్, ఆకాష్ పూజారి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ తయారీకి ఉపయోగించే ముడిసరుకులో మొక్కజొన్న వాటా సుమారు 50 శాతం కాగా, ఇతర ధాన్యాలతో కలిపి ఇది 67 శాతానికి చేరిందని తెలిపారు. మొక్కజొన్న సాగు పెరగడం వల్ల సోయాబీన్, వేరుశనగ, ఆవాలు వంటి నూనెగింజల సాగు భూమితో పోటీ పెరిగి, వంటనూనెల దిగుమతులపై ఆధారపడటం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఇథనాల్ ఉత్పత్తిలో వర్షపు నీటితో పాటు నదులు, కాలువలు, భూగర్భ జలాల నుంచి వినియోగించే ‘బ్లూ వాటర్’ పరిమాణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
పాత ద్విచక్ర ఇవాహనాలకు ఇథనాల్ సెగ
దేశంలో బీఎస్–4కు ముందు తయారైన, కార్బొరేటర్లతో నడిచే పాత ద్విచక్ర వాహనాలు సుమారు 8 కోట్ల వరకు ఉన్నాయని నాగేశ్వరన్, పూజారి తెలిపారు. ఈ వాహనాల్లోని కారŠుబ్యరేటర్లు ఈ20 పెట్రోల్‌లో ఉండే అదనపు ఆక్సిజన్‌కు అనుగుణంగా ఇంధన సరఫరాను సర్దుబాటు చేయలేవని పేర్కొన్నారు. దీంతో ఇంజిన్ అధిక వేడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ఇథనాల్‌ను తట్టుకునేలా రూపొందించని పాత రబ్బర్ సీల్స్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో పాత వాహనాల్లో అవసరమైన మార్పులు పూర్తయ్యే వరకు ఈ20తో పాటు ఈ10 పెట్రోల్‌ను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇథనాల్‌కు అనుకూలమైన విడిభాగాలను అమర్చేందుకు పెద్దగా ఖర్చు కాకపోయినా, దేశవ్యాప్తంగా కోట్లాది వాహనాల్లో ఈ మార్పులు పూర్తి చేయడానికి ఏళ్లు పట్టవచ్చని పేర్కొన్నారు.
ఇది చదవండి: ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?


