కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడంపై బ్యాంకింగ్ రంగానికి మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రం త్వరలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం తెలిపారు. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో, ప్రతిపాదిత కమిటీ పరిశీలించతగిన అంశాల గురించి సమాలోచనలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు వివరించారు.
ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు అత్యంత కనిష్ట స్థాయికి దిగివచ్చాయని, సంస్కరణలను చేపట్టేందుకు ఇదే సరైన తరుణం కాగలదని ఆమె చెప్పారు. ఆర్థిక స్థిరత్వం, సమ్మిళితత్వం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూ భారతదేశపు తదుపరి దశ వృద్ధికి ఊతమిచ్చేలా బ్యాంకింగ్ రంగాన్ని సమగ్రంగా సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్లు ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.


