ప్రపంచవ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలకు చెందిన లక్షలాది మంది ఉద్యోగుల డేటా చోరీకి గురైనట్లు ఓ థ్రెట్ యాక్టర్ చేసిన ఆరోపణలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. ‘హ్యాట్‌మాన్’ అనే సైబర్ నేరస్తుడు మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగిస్తున్న పలు కంపెనీల వ్యవస్థల్లోకి చొరబడి సుమారు 36.4 లక్షల రికార్డులను దొంగిలించినట్లు ప్రకటించాడు. ఈ డేటాను ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ నివేదికలు వెల్లడించాయి. అయితే, ఈ డేటా లీక్‌పై సంబంధిత సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా డేటా లీక్‌కు గురైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలు సంస్థల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వాటిలో మెక్‌డొనాల్డ్స్, గ్యాప్ ఇన్‌క్., వొడాఫోన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇంటర్‌కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్, కైండ్రిల్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు చెందిన ఉద్యోగుల డేటా తన వద్ద ఉందని సైబర్ నేరస్తుడు పేర్కొన్నాడు.
జూలై 31 నుంచి వరుసగా పలు డేటాబేస్‌లను విక్రయానికి ఉంచినట్లు సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తించారు. మొత్తం తొమ్మిది లిస్టింగ్స్‌లో 36 లక్షలకు పైగా రికార్డులు ఉన్నాయని అతను పేర్కొన్నాడు.
ఈ ఆరోపణల్లో అత్యంత పెద్ద డేటాబేస్ మెక్‌డొనాల్డ్స్‌కు సంబంధించినదిగా చెబుతున్నారు. సుమారు 17 లక్షలకు పైగా ఉద్యోగుల రికార్డులు తన వద్ద ఉన్నాయని హ్యాట్‌మాన్ పేర్కొన్నాడు. ఇందులో ఉద్యోగుల పేర్లు, ఎంప్లాయీ ఐడీలు, ఈమెయిల్ అడ్రస్‌లు, ఉద్యోగ హోదాలు, ఫోన్ నంబర్లు, పోస్టల్ అడ్రస్‌లు, సర్వీస్ అకౌంట్లు, ఇతర అంతర్గత టెనెంట్ వివరాలు ఉన్నాయని అతను చెప్పినట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ వార్తా సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్ నివేదించింది.


