రూట్‌ మార్చిన నెతన్యాహు.. మమ్దానీ టార్గెట్‌గా కొత్త ప్లాన్‌! | Netanyahu Targets Mamdani With Bold Political Campaign, Warns Of Wider Middle East Conflict, Check More Details Inside | Sakshi
Sakshi News home page

రూట్‌ మార్చిన నెతన్యాహు.. మమ్దానీ టార్గెట్‌గా కొత్త ప్లాన్‌!

Aug 19 2026 8:46 AM | Updated on Aug 19 2026 9:56 AM

Election Stunt Mamdani And Hezbollah leaders on Netanyahu billboard

న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్ మమ్దానీని టార్గెట్‌ చేస్తూ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కొత్త రాజకీయ అస్త్రాన్ని బయటకు తీశారు. ఏకంగా ఇరాన్‌ సుప్రీం లీడర్‌, హెజ్‌బొల్లా చీఫ్‌, టర్కీ అధ్యక్షుడితో మమ్దానీని ఒకే బిల్‌బోర్డుపై(ప్రచార పోస్టర్‌లో)  చూపిస్తూ సంచలన ప్రచారానికి తెరలేపారు. ‘నెతన్యాహును ఓడించాలనుకునే వాళ్లను గెలవనివ్వొద్దు’ అంటూ లికుడ్‌ పార్టీ చేసిన ఈ ప్రచారం ఇప్పుడు ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, రాబోయే ఎన్నికల నేపథ్యంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఇజ్రాయెల్‌కు ముప్పుగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రచారం సాగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, న్యూయార్క్‌ సిటీ మేయర్‌ మమ్దానీ గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నెతన్యాహుపై కూడా ఆయన బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల నెతన్యాహును యుద్ధ నేరస్థుడు అంటూ అభివర్ణించిన మమ్దానీ.. ఆయనను హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తిగా వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి నెతన్యాహు న్యూయార్క్‌కు వస్తే.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను అమెరికా అధికారులు అమలు చేయాలని కూడా మమ్దానీ డిమాండ్ చేశారు.

మమ్దానీ వ్యాఖ్యలపై ప్రధాని నెతన్యాహు కూడా తీవ్రంగా స్పందించారు. న్యూయార్క్‌లో వివిధ మతాల ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. మమ్దానీ వంటి ప్రగతిశీల నేతల ప్రభావంతో అమెరికా డెమోక్రాట్లలో ఇజ్రాయెల్‌కు మద్దతు తగ్గే అవకాశం ఉందని నెతన్యాహు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నెతన్యాహు తన కూటమిని కొనసాగించేందుకు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. జూలైలో ఇజ్రాయెల్ పార్లమెంట్‌ (క్నెసెట్‌) రద్దు కావడంతో అక్టోబర్‌లో ఎన్నికలకు మార్గం సుగమమైంది. 2023 అక్టోబర్‌ 7న హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో జరగనున్న తొలి జాతీయ ఎన్నికలు ఇవే.

మేమే దాడి చేస్తాం.. 
ఇదే సమయంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. “మమ్మల్ని ఎవరూ ఆశ్చర్యపరచకముందే.. మేమే వారిని ఆశ్చర్యపరుస్తాం. మేమే దాడి చేసే పక్షం.. మేమే దాడిని ప్రారంభిస్తాం. చొరవ తీసుకుంటాం.. దాడి చేస్తాం” అంటూ ఇజ్రాయెల్‌ సైనిక వ్యూహాన్ని బహిరంగంగా ప్రకటించారు. మధ్యప్రాచ్య ముఖచిత్రాన్నే మార్చేస్తామని, అవసరమైతే ఎప్పుడైనా ఏ దేశంపైనైనా దాడి చేసే హక్కును ఇజ్రాయెల్‌ తన వద్ద ఉంచుకుంటుందన్న సంకేతాలను ఆయన వ్యాఖ్యలు ఇచ్చాయి.

మరోవైపు, గాజాలో కాల్పుల విరమణ కోసం అమెరికా-ఇజ్రాయెల్ ప్రయత్నాలకు కూడా అవరోధాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధి జారెడ్ కుష్నర్ సోమవారం నెతన్యాహుతో సుమారు మూడు గంటల పాటు సమావేశమైనప్పటికీ ఎలాంటి కీలక పురోగతి వెలువడలేదు. హమాస్ నిరాయుధీకరణకు అంగీకరించే వరకు గాజా నుంచి తమ బలగాలను ఉపసంహరించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుండటంతో కాల్పుల విరమణ చర్చలు మళ్లీ సంక్లిష్టంగా మారాయి. ఇదిలా ఉండగా.. గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతుండటం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement