4.11 కోట్ల షేర్ల విక్రయం!
త్వరలోనే దరఖాస్తు దాఖలు
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ వంటనూనెల తయారీ సంస్థ ఫ్రీడమ్ ఆయిల్స్ మాతృ కంపెనీ ‘జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ఎల్)’ పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సిద్ధమవుతోంది. పరిశ్రమ దిగ్గజం ప్రదీప్ కుమార్ చౌదరి సారథ్యంలో వేగంగా విస్తరిస్తున్న ఈ సంస్థ ఐపీవోలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా 4.115 కోట్ల షేర్లను విక్రయించనుంది.
విక్రయదారుల్లో బ్లాక్ రివర్ ఫుడ్ 2 (3.086 కోట్ల షేర్లు), ఇన్వెస్ట్‌మెంట్ అండ్ కమర్షియల్ ఎంటర్‌ప్రైజ్ (61.7 లక్షల షేర్లు), ప్రమోటర్ అల్కా చౌదరి, జీఏఐఈ (చెరో 20.6 లక్షల షేర్లు) ఉన్నారు.
ఆర్థిక వృద్ధి.. తయారీ సామర్థ్యం
వంటనూనెలు, స్పెషాలిటీ ఫ్యాట్స్ తయారీ, ట్రేడింగ్, మార్కెటింగ్‌లో పట్టు సాధించిన జీఈఎఫ్ఎల్ వినియోగ ఉత్పత్తుల సమగ్ర ప్లాట్‌ఫామ్‌గా ఎదిగేందుకు మసాలా దినుసులు, కన్వీనియెన్స్ ఫుడ్స్‌ను పోర్ట్‌ఫోలియోలోకి తెచ్చింది. డీఆర్‌హెచ్‌పీలోని సమాచారం ప్రకారం, 2020-2025 ఆర్థిక సంవత్సరాల మధ్య బ్రాండెడ్ ఆదాయం ఏటా 20.5% కాంపౌండ్ వృద్ధిని నమోదు చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.9,053.84 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి 16.83% వార్షిక వృద్ధితో రూ.12,650 కోట్లకు చేరుకుంది.
ఉత్పత్తి కేంద్రాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ (రెండు ప్లాంట్లు), కృష్ణపట్నం (ఒక ప్లాంట్)ల్లో ఉన్న మూడింటి ఉమ్మడి రిఫైనింగ్ సామర్థ్యం వార్షికంగా 12.22 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2026 నివేదిక ప్రకారం 6.66 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించింది.
తదుపరి వ్యూహం
దక్షిణాది ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రిటైల్ విపణిలో ఆదాయంపరంగా 22.2% వాటాతో జీఈఎఫ్ఎల్ అగ్రస్థానంలో ఉంది. 1,600 డిస్ట్రిబ్యూటర్లు, 3 లక్షలకు పైగా రిటైల్ ఔట్‌లెట్లు, 60కి పైగా వేర్‌హౌస్‌ల బలమైన నెట్‌వర్క్‌తో దాదాపు 31.8 కోట్ల మంది వినియోగదారులకు కంపెనీ చేరువైందని ప్రతినిధులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో మార్కెట్ లీడర్‌షిప్‌ను కాపాడుకుంటూనే తెలంగాణ, కర్ణాటకలతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లకు తమ నెట్‌వర్క్‌ను విస్తరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?


