ఈ నెల 17–19 మధ్య ఐపీవో
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రిటైల్ కంపెనీ లలితా జ్యువెలరీ పబ్లిక్ ఇష్యూకి రూ. 190–201 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 17న ప్రారంభమై 19న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు 14న ఈక్విటీ షేర్లు ఆఫర్ చేయనుంది.
వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధులను ప్రధానంగా కొత్త స్టోర్ల ఏర్పాటుకు వెచ్చించనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వినియోగించనుంది. 1985లో టీనగర్(చెన్నై)లో తొలి స్టోర్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ ఈ నెల 24న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌కానుంది. కంపెనీ విలువ రూ. 11,250 కోట్లుగా నమోదయ్యే వీలుంది. కంపెనీ ప్రధానంగా బంగారం, వెండి, వజ్రాలతోకూడిన ఆభరణాలను విక్రయిస్తోంది.


