ఏకే 47 స్థానంలో దేశీ షేర్‌ | AK-203 Sher was successfully test-fired at Amethi Korwa Ordnance Factory | Sakshi
Sakshi News home page

ఏకే 47 స్థానంలో దేశీ షేర్‌

Aug 25 2026 4:39 AM | Updated on Aug 25 2026 4:39 AM

AK-203 Sher was successfully test-fired at Amethi Korwa Ordnance Factory

తొలి పరీక్షలు విజయవంతం  

 ఏకే47 కంటే మెరుగైన తుపాకీ

మిలటరీ ఓకే అంటే ఉత్పత్తి షురూ! 

2030 నాటికి ఆరు లక్షలు లక్ష్యం  

ఆగస్టు 23, 2026... అమెథీలోని కోర్వా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ.. ఠప్‌..ఠప్‌..ఠప్‌ మంటూ తుపాకీ శబ్దాలు వినిపించాయి! ఇవేవో మామూలు శబ్దాలు అనుకునేరు... ఆత్మనిర్భర భారత నిర్మాణంలో  మేలి ముందడుగు! పూర్తిగా దేశీయంగా నిర్మించిన, ఏకే–47 కంటే మేలైన... అసాల్ట్‌ రైఫిల్‌ పరీక్షల శబ్దాలవి!!! 

ఉత్తరప్రదేశ్‌లోని అమెథీలో ఈ ఆదివా రం ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండో రష్యన్‌ రైఫిల్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన మొట్టమొదటి దేశీ అసాల్ట్‌ రైఫిల్‌ ఏకే203–షేర్‌ను విజయవంతంగా పరీక్షించారు. ఇందులోని ప్రతి విడిభాగం కూడా పూర్తిగా మన దేశంలోనే తయారవడం విశేషం. రష్యా తయారీ ఏకే–47తో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఆయుధమని మిలిటరీ వర్గాలు చెబుతున్నాయి. 

ఏకే47 కంటే రెట్టింపు దూరం (సుమారు 800 మీటర్లు)లోని లక్ష్యాలను కూడా ‘షేర్‌’ ఛేదించగలదు. అలాగే సుమారు 600 గ్రాములు తక్కువ బరువు ఉంటుంది. ఏకే47 నిమిషానికి 600 బుల్లెట్లను పేల్చగలిగితే షేర్‌ ద్వారా ఇంకో వంద ఎక్కువ బుల్లెట్లు ఫైర్‌ చేయవచ్చు. అంతేకాదు.. అవసరాన్ని బట్టి షేర్‌ను మడుచుకోవడం, తుపాకీ వెనుకభాగానికి, ట్రిగ్గర్‌కు మధ్య ఉన్న దూరాన్ని పెంచుకోగలగడం షేర్‌తో వచ్చే లాభాలు. 

ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా తయారు చేసిన తుపాకీ.  భారత సైనికులు, ఇతర భద్రతా దళాలు 1990లలో ఇన్సాస్‌ అసాల్ట్‌ రైఫిల్‌ను ఉపయోగించే వారు. అయితే తరచూ జామ్‌ కావడం ఈ తుపాకీలోని ప్రధాన లోపం. ఫలితంగా మిలటరీలో దశలవారీగా ఇన్సాస్‌ స్థానంలో ఏకే47 వినియోగం పెరుగుతూ వచ్చింది. శిక్షణతోపాటు రాష్ట్ర పోలీసు బలగాలు, సీఏపీఎఫ్, రిజర్వ్‌ బెటాలియన్లు ఇప్పటికీ ఇన్సాస్‌పైనే ఆధారపడుతున్నాయి.  

ఏకే–47 అంతర్జాతీయంగా ఫేమస్‌. కానీ డిజైన్‌ లోపాలు చాలానే ఉన్నాయి. అవసరాలకు తగ్గట్టుగా మార్పులు చేసుకునే వెసులుబాటు లేకపోవడం ప్రధానమైంది. టెలిస్కోప్‌తోపాటు కొన్ని ఇతర సరంజామాను అమర్చుకునే వీలు లేదు. ఈ సమస్యను అధిగమించేందుకు షేర్‌లో పికాటెనీ ట్రెయిల్స్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏకే47లో వెనుకవైపు చెక్క మడిమ నుంచి ట్రిగ్గర్‌కు ఉన్న దూరం మారదు. 

పైగా ఆధునిక యుద్ధరీతుల్లో వచ్చిన మార్పులను అందుకోవడం పాతకాలపు ఏకే47తో సాధ్యం కాదని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ఎల్‌ఓసీ, ఎల్‌ఏసీల వంటి కీలకమైన సరిహద్దు ప్రాంతాల్లో రక్షణను మరింత పటిష్టం చేసేందుకు ఏకే203–షేర్‌ ఎంతో ఉపయోగమని అంచనా.ఈ నేపథ్యంలో ఏకే47 స్థానంలో షేర్‌లను వాడేందుకు రంగం సిద్ధమవుతోంది. దీంతోపాటే అసాల్ట్‌ రైఫిల్స్‌ కోసం ఇకపై రష్యాపై ఆధారపడాల్సిన అవసరం 
లేకుండా పోతుంది.  

ఉత్పత్తి త్వరలో... 
ఆగస్టు 23న కోర్వా ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో షేర్‌ను మొట్టమొదటిసారి పరీక్షించారు. ఆర్మీ సైనికులు వచ్చే నెలలోనే దీనిపై తమ పరీక్షలు మొదలుపెట్టనున్నారు. ఈ పరీక్షలకు ఎంతకాలం పడుతుందో స్పష్టంగా చెప్పలేము కానీ.. వీలైనంత తొందరగా ముగించే అవకాశమైతే ఉంది. ఆర్మీ ఆమోదం కూడా లభిస్తే 2030 నాటికల్లా కనీసం ఆరు లక్షల ఏకే203–షేర్‌లను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. ఈ తయారీ పూర్తిస్థాయిలో జరిగే సమయంలో ప్రతి వంద సెకన్లకు ఒక ‘షేర్‌’ఫ్యాక్టరీ నుంచి బయటకొస్తుందని అంచనా. దేశీ అవసరాలు పూర్తయిన తరువాత ఆసియా, ఆఫ్రికా దేశాలకు ఏకే203–షేర్‌లను ఎగుమతి చేసేందుకూ అవకాశాలు ఉన్నాయి.           

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement