సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని పుణే జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఇంట్లో ఉన్న 9 ఏళ్ల బాలికపై హత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. పైగా బాలిక కనిపించడం లేదన్న ఆందోళనతో తల్లిదండ్రులు వెతుకుతున్న సమయంలో నిందితుడు కూడా వారితో కలిసి వెతుకుతూ నాటకం ఆడాడు. చివరికి పోలీసులు అతని యవ్వారాన్ని బయటపెట్టారు. ఈ ఘటన జున్నార్ తాలూకా పింపాల్‌వండి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలను రాజేసింది. ఈ కేసును వేగంగా విచారించాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పూణే-నాసిక్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు.
అసలేం జరిగింది అంటే
పోలీసుల సమాచారం ప్రకారం బాధిత చిన్నారి 4వ తరగతి చదువుతోంది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కాగా, ఆమె అనారోగ్యం వల్ల ఆ రోజు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. ఇది గమనించిన పొరుగింటి 25 ఏళ్ల కీచకుడు సాహిల్ ఖైరే ఆమెపై కన్నేశాడు. ఆమెపై అత్యాచారం చేసి, ఆపై గొంతు నులిమి చంపాడని ప్రాథమిక విచారణలో తేలింది. ఇది తెలియని తల్లిదండ్రులు తమ బిడ్డ ఆచూకీ కోసం గాలించి, ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అప్పటివరకూ నిందితుడు సాహిల్ కూడా ఏమీ ఎరగనట్టుగా వీరితో పాటే ఉండటం గమనార్హం.
అయితే కేసు విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలించగా, సైకిల్‌పై వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తిని సాహిల్ ఖైరేగా గుర్తించి ప్రశ్నించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. అనంతరం అతడు చూపించిన ప్రదేశం (ఓ వాగు వద్ద ఉన్న చెట్టు కింద) నుంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఫొటో తెచ్చిన తంటా..షాకైన వధువు, పెళ్లి క్యాన్సిల్
ఆందోళనలు-ఉద్రిక్తత
ఈ దారుణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పుణే-నాశిక్ రహదారిని దిగ్బంధించారు. నిందితుడిని ఉరితీయాలని, ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి 15 రోజుల్లోగా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ స్పందన
ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, పుణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్‌తో మాట్లాడి సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య


