సీబీఐ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ.. మాజీ డైరెక్టర్‌ కొత్త పార్టీ పగ్గాలు! | Ex-CBI chief Nageshwar Rao enters politics At Kashi | Sakshi
Sakshi News home page

సీబీఐ నుంచి పొలిటికల్‌ ఎంట్రీ.. మాజీ డైరెక్టర్‌ కొత్త పార్టీ పగ్గాలు!

Oct 4 2026 7:28 AM | Updated on Oct 4 2026 7:40 AM

Ex-CBI chief Nageshwar Rao enters politics At Kashi

ఒకప్పుడు సీబీఐ పగ్గాలు.. ఇప్పుడు రాజకీయ పార్టీ పగ్గాలు.. దాదాపు నాలుగు దశాబ్దాల పరిపాలనా అనుభవం తర్వాత మాజీ సీబీఐ డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కాశీ వేదికగా సర్వజన సనాతన్‌ పార్టీ (SSP) జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ‘ఆధునిక భారత్‌.. సనాతన మూలాలతో’ అంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాగేశ్వరరావు.. భారత్‌ పునర్నిర్మాణం కేవలం పరిపాలనా సంస్కరణలతో సాధ్యం కాదని, ఆధునిక అభివృద్ధితో పాటు దేశ నాగరికత మూలాలతో అనుసంధానం కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నట్టు చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌పీ సిద్ధాంతంలో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, నాగరికతతో అనుసంధానం కీలక అంశాలుగా ఉన్నాయని నాగేశ్వరరావు తెలిపారు. సనాతనం అంటే కేవలం ఒక ఆరాధనా విధానం కాదని.. సత్యం, ధర్మం, బాధ్యత, కరుణ, న్యాయం, ఆత్మనియంత్రణ, ప్రకృతి, కుటుంబం, సమాజం, ప్రజా సంక్షేమం వంటి విలువలతో కూడిన జీవన విధానమని వివరించారు. విద్య విషయంలో భారతీయ నాగరికత, చరిత్ర, జ్ఞాన సంప్రదాయాలను ఆధునిక, ప్రపంచస్థాయి విద్యతో అనుసంధానించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య రంగంలో అందరికీ అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఆధునిక వైద్యం, భారతీయ ఆరోగ్య సంప్రదాయాలను కలిపి ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

‘ఆధునిక భారత్‌.. సనాతన మూలాలతో’
గతంలోకి వెళ్లడం తమ లక్ష్యం కాదని, భారత నాగరికత మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక భారత్‌ను నిర్మించడమే తమ ఉద్దేశమని నాగేశ్వరరావు చెప్పారు. సాంకేతిక, ఆర్థిక అభివృద్ధిని సాంస్కృతిక గుర్తింపుతో సమన్వయం చేయాలని పార్టీ భావిస్తోందన్నారు. తమ పార్టీ విధానం ఏ కులం లేదా సమాజానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాశీని తన రాజకీయ ప్రయాణానికి ప్రారంభ బిందువుగా ఎంచుకున్నానని చెబుతూ.. ఆధునికత, భారతీయ నాగరికత మూలాల మధ్య సమతుల్యత సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సీబీఐలో ఆయన డీల్‌ చేసిన కేసులు..
👉శారదా చిట్‌ఫండ్‌ కేసు: పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తులో నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అప్పటి కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌పై దర్యాప్తు సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వచ్చింది.

👉రోజ్‌ వ్యాలీ చిట్‌ఫండ్‌ కేసు: శారదాతో పాటు పశ్చిమ బెంగాల్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ప్రభావం చూపిన రోజ్‌ వ్యాలీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును కూడా ఆయన పర్యవేక్షించారు.

👉అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కేసు: 2018లో సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ కేసు దర్యాప్తు పురోగతిని స్వయంగా పర్యవేక్షించారు.
విజయ్‌ మాల్యా బ్యాంకు రుణాల కేసు, మాల్యాకు సంబంధించిన కేసు దర్యాప్తు పురోగతిని కూడా ఆయన పర్యవేక్షించారు.

👉ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోమ్‌ అత్యాచారం, హత్య కేసులు: ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి ఏకే శర్మ బదిలీ వ్యవహారంలో నాగేశ్వరరావు పాత్రపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బదిలీ చేయడంపై ఆయనను కోర్టు ధిక్కరణకు దోషిగా తేల్చి రూ.1 లక్ష జరిమానా విధించింది.

👉ఇక సీబీఐకి రాకముందు ఒడిశా పోలీస్‌ అధికారిగా పనిచేసిన సమయంలోనూ ఆయనకు కీలక దర్యాప్తులు, ఆపరేషన్ల అనుభవం ఉంది. 1996లో జగత్సింగ్‌పూర్‌లో అత్యాచారం కేసు దర్యాప్తులో DNA ఫింగర్‌ప్రింటింగ్‌ టెక్నాలజీని ఉపయోగించిన తొలి ఒడిశా పోలీస్‌ అధికారిగా ఉన్నారు. అలాగే లాల్‌గఢ్‌ నక్సల్స్‌ ఆపరేషన్‌, కంధమాల్‌ హింస సమయంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఇదీ చదవండి: సైన్యం దయాదాక్షిణ్యాలపై ఆధారాపడుతూ భారత్‌పై నిందాలా? పాక్‌కు కౌంటర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement