‘మేం జెన్‌జీలం' అంటూ సైన్యంతో వాగ్వాదం.. చివరకు క్షమాపణలు చెప్పింది | We Are Gen Z Woman Apologizes To Indian Army | Sakshi
Sakshi News home page

‘మేం జెన్‌జీలం' అంటూ సైన్యంతో వాగ్వాదం.. చివరకు క్షమాపణలు చెప్పే వరకు వదల్లేదు

Aug 20 2026 7:18 PM | Updated on Aug 20 2026 7:27 PM

We Are Gen Z Woman Apologizes To Indian Army

సాక్షి,న్యూఢిల్లీ: ‘అసలేం జరుగుతుందో తెలియదు. కానీ, మేం జెన్‌జీలం.. మీ అరాచకాల్ని సహించం. అవసరమైతే నినదిస్తాం’ అంటూ ఓ యువతి భద్రతా సిబ్బందిని నిలదీసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అసలు విషయం తెలుసుకున్న సదరు యువతి చివరకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.  

లడఖ్‌లోని ద్రాస్ ప్రాంతంలో మినిమార్గ్ చెక్‌పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. జులై 26న ‘కార్గిల్ విజయ్ దివస్’ ఏర్పాట్లు, వీఐపీల రాకపోకల భద్రతా కారణాల దృష్ట్యా మినిమార్గ్ - జోజిలా - సోనమార్గ్ రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ రోడ్డు మూసివేత కారణంగా లడఖ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న పర్యాటకులు గంటల తరబడి అక్కడే నిరీక్షించాల్సి వచ్చింది. ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకుండా, కారణం చెప్పకుండా తమను గంటల తరబడి ఆపడంపై పర్యాటకుల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది.

అదే సమయంలో అక్కడే ఉన్న ఒక మంత్రిని వెళ్లనిచ్చి, మిగతా ప్రయాణికులను మాత్రం ఎందుకు ఆపారంటూ 25 ఏళ్ల సదరు యువతి భద్రతా సిబ్బందిని, పోలీసులను నిలదీశారు. అక్కడున్న ఇతర పర్యాటకులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి  వీడియో వైరల్ కావడంతో ఆమె మీడియాతో మాట్లాడారు.తన ప్రవర్తనకు చింతిస్తున్నట్లు తెలిపారు.

అసహనంతోనే అలా మాట్లాడాను 
ఆ రోజు ఉదయం మూడు, నాలుగు గంటల పాటు వేచి ఉన్నాము. వీఐపీల రాకపోకల వల్ల దారి మూసివేశారని మాకు తెలియదు. ఇంకా ఎంత సమయం పడుతుందని సైనికులను అడిగినా సరైన సమాచారం రాలేదు. ఆవేశం, అలసట, తీవ్ర అసహనంతోనే నేను ఆ మాటలని మాట్లాడాను. అవి ఎంతమాత్రం సరికావు’అని ఆమె పేర్కొన్నారు. భారత సైన్యాన్ని, భద్రతా బలగాలను నేను ఎంతో గౌరవిస్తాను. నా మాటల వల్ల వారికి బాధ కలుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. సైన్యాన్ని లేదా పోలీసులను అవమానించాలనే ఉద్దేశం గానీ, దీని ద్వారా ప్రఖ్యాతి పొందాలనే ఆలోచన గానీ నాకు ఎప్పుడూ లేదు’అని స్పష్టం చేశారు.  

తీవ్ర మానసిక ఒత్తిడి 
నేను కేవలం సాధారణ యువతిని. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇంతలా వైరల్ అవుతుందని, ఇంతటి విమర్శలు వస్తాయని ఊహించలేకపోయాను. దీన్ని ప్రతికూల కోణంలో చూపించడం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. దేశ ప్రజలకు, భారత సైన్యానికి, జమ్మూ-కశ్మీర్ పోలీసులకు, లడఖ్ పోలీసులకు, సీఎం ఒమర్ అబ్దుల్లాకు మరోసారి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను’అని ఆమె వెల్లడించారు. 

ఆ వీడియోలో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన అంశం ‘మేం జెన్‌జీలం’ అనే పదం. దీనిపై స్పందిస్తూ.. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న స్థానికులు, పర్యాటకులు రెచ్చగొట్టడం వల్ల అది అప్రయత్నంగానే నోటి నుంచి వచ్చిందని ఆమె వివరించారు. మా వెనుక ఉన్న కొందరు.. 'మీరు పర్యాటకులు కాబట్టి ఇది మీకు కొత్తగా ఉంది. మాకు ఇది రోజూ జరిగేదే' అంటూ మమ్మల్ని రెచ్చగొట్టారు. ఆ ఉద్రిక్త వాతావరణంలో ఆ పదం ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు. జెన్‌జీ గురించి ప్రస్తావించి ఎలాంటి ప్రత్యేక ప్రకటన చేయాలనే ఉద్దేశం నాకు లేదు’అని ఆమె తేల్చిచెప్పారు.

యువతి మాట్లాడిన వీడియో వైరల్‌ కావడంతో ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఎక్కడపడితే అక్కడ ‘మేం జెన్‌జీలం’ అని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం సరికాదని, ఇది కొత్త రకమైనా దురహంకార ధోరణికి దారితీసే అవకాశం ఉందని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement