ముంబై:మహారాష్ట్ర పుణె సమీపంలోని చారిత్రక సింహగఢ్ కోట వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. కోటను సందర్శించడానికి వచ్చిన ఓ కుటుంబంలోని ఎనిమిదేళ్ల చిన్నారి షార్ట్స్ (పొట్టి దుస్తులు) వేసుకుందనే నెపంతో కొందరు దుండగులు ఆ చిన్నారి తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ నమ్మకమైన సైన్యాధిపతి తానాజీ మాలుసరే స్మారక చిహ్నం సమీపంలో ఈ ఘటన జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. బాధితుడు తన కుటుంబంతో కలిసి కోటను సందర్శిస్తూ ఫోటోలు దిగుతున్న సమయంలో నిందితులు వారిని సమీపించారు. చిన్నారి వేసుకున్న దుస్తులపై, వారు ఫొటోలు దిగడంపై నిందితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితులు వెంటనే కోటను విడిచి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ వాగ్వాదం కాస్తా తీవ్రరూపం దాల్చడంతో నిందితుల్లో ఒకరు ఫిర్యాదుదారుడిపై చేయి చేసుకుని, గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. అంతటితో ఆగకుండా, నిందితుల బృందంలోని ఒక మహిళ బాధితుడి భార్యను రోడ్డుపై ఈడ్చుకెళ్లి అరాచకం సృష్టించింది. అంతకుముందు అదే కోట వద్ద ఉన్న మరికొన్ని జంటలతో కూడా ఈ బృందం అసభ్యంగా ప్రవర్తించినట్లు హవేలీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ రామఘరే వెల్లడించారు.
బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో, ముగ్గురు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది నిందితులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.అదే ఆదివారం రోజున కోటను సందర్శించిన మరో మూడు గ్రూపుల నుండి కూడా ఈ బృందంపై ఇలాంటి ఫిర్యాదులే వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఎనిమిది మంది నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.


