సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి | 1984 Anti Sikh Riots Case Convict Sajjan Kumar Dies At 80 While Serving Life Sentence | Sakshi
Sakshi News home page

Sajjan Kumar: సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ మృతి

Aug 20 2026 3:45 PM | Updated on Aug 20 2026 4:29 PM

Ex Congress MP Sajjan Kumar Dies

ఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసు దోషి, కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ (80) మృతి చెందారు. జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తూ అనారోగ్యపాలైన ఆయనను తిహార్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. 

సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో (1984) ఐదుగురు వ్యక్తుల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న కుమార్‌ను తిహార్ జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయన మరణానికి కారణాన్ని ఆసుపత్రి ఇంకా వెల్లడించలేదు. 3 పర్యాయాలు లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సజ్జన్‌ కుమార్ ఔటర్ ఢిల్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన కాంగ్రెస్‌లో ప్రముఖ నాయకుడిగా ఉండేవారు. 2018లో దోషిగా తేలిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియంత్ సింగ్  1984 అక్టోబర్ 31న హత్య చేసిన తర్వాత అల్లర్లు చెలరేగాయి. సాయుధ గుంపులు ఢిల్లీ అంతటా సిక్కులను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లు, దుకాణాలపై దాడులు చేశాయి. దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా సిక్కులు హతమయ్యారు. వారిలో ఎక్కువ మంది దేశ రాజధానిలోనే మరణించారు.

దాదాపు మూడు దశాబ్దాలకు పైగా కుమార్ ఈ హింసకు సంబంధించిన పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారు. వివిధ న్యాయస్థానాల్లో కొన్ని కేసుల్లో ఆయన నిర్దోషిగా విడుదల కాగా, మరికొన్ని కేసుల్లో దోషిగా తేలారు. 2013లో ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్దోషిత్వ తీర్పును 2018 డిసెంబర్ 17న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అనంతరం కుమార్‌ను దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.

ఈ కేసు పాలం కాలనీలోని రాజ్ నగర్ పార్ట్-1లో ఐదుగురు సిక్కుల హత్యతో పాటు హింస సమయంలో ఒక గురుద్వారాను దహనం చేసిన ఘటనకు సంబంధించినది. క్రిమినల్ కుట్ర, నేరానికి ప్రేరేపించడం వంటి అభియోగాల్లో కుమార్‌ను హైకోర్టు దోషిగా తేల్చింది. ఆయన జీవితాంతం జైలులోనే ఉండాలని ఆదేశించింది. 1984 సిక్కు వ్యతిరేక హింసను కోర్టు తన తీర్పులో "మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలు"గా పేర్కొంది. కుమార్ తన శిక్షను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement