కాంగ్రెస్‌లో అంతే..! | Differences within Congress party are becoming more apparent every day | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో అంతే..!

Aug 20 2026 1:43 AM | Updated on Aug 20 2026 1:43 AM

Differences within Congress party are becoming more apparent every day

అధికార కాంగ్రెస్‌ పార్టీలో రోజుకోరీతిన బహిర్గతమవుతున్న విభేదాలు

ఏకంగా సీఎం రేవంత్‌ను టార్గెట్‌ చేసిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌ 

దీంతో మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ 

పరకాలలో రేవూరి ప్రకాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న మురళీ వర్గం....  వనపర్తిలో చిన్నారెడ్డి, మేఘారెడ్డి మధ్య తీవ్రమవుతున్న విభేదాలు 

తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్‌ స్థానిక నాయకత్వం 

పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న మునుగోడు, జడ్చర్ల ఎమ్మెల్యేలు 

గాంధీభవన్‌ మెట్లెక్కిన పాలకుర్తి, గజ్వేల్‌ పంచాయితీలు 

అసలు తమకు ప్రాధాన్యమే లేదంటున్న ఉమ్మడి 

ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు... ఉట్నూరులో ఇన్‌చార్జి మంత్రి ఎదుటే బాహాబాహీకి దిగిన రెండు వర్గాలు 

బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్‌ పంచాయితీలు 

దాదాపు అన్ని జిల్లాల్లో పార్టీ నాయకుల మధ్య లొల్లి

సాక్షి, హైదరాబాద్‌: అధికార కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు రోజుకో తీరుగా బహి ర్గతమవుతున్నాయి. మంత్రుల మధ్య సమన్వయ లేమి, తమ శాఖలో జరిగే అంశాలు తమకు తెలియకుండానే జరిగి పోతున్నాయనే అసంతృప్తి, ఒకరి శాఖపై మరో మంత్రి వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు వర్సెస్‌ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పార్టీ ఇన్‌చార్జీలతో సమన్వయ లేమి, పార్టీ కేడర్‌తో ఎమ్మెల్యేల గిల్లి కజ్జాలు, పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్‌ గొడవలు నిరంతరాయంగా వెలుగులోకి వస్తున్నాయి. వీటికి తోడు ఏకంగా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, అధిష్టానాన్ని వేలెత్తి చూపుతున్న ఘటనలు, నేరుగా వారికే సవాల్‌ విసిరే ప్రసంగాలు కూడా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తుంగతుర్తి, పాలకుర్తి, గజ్వేల్, మునుగోడు, జడ్చర్ల, వనపర్తి, ఎల్బీనగర్‌... ఇలా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటిని పరిష్కరించడం, పార్టీ నేతలను సమన్వయం చేయడంలో రాష్ట్ర పార్టీ పక్షాన ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.  

అన్ని చోట్లా ఇదే పరిస్థితి 
పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత అసమ్మతి స్వరాలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పుకునే గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీకి తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఏదో నియోజకవర్గంలో తలనొప్పులు బహిరంగంగానే బయటపడుతున్నాయి. ఇప్పటికే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్‌ పేరుతో సతమతమవుతున్న కాంగ్రెస్‌లో తాజా గొడవలు మరింత చిచ్చు రేపుతున్నాయి. వనపర్తి అసెంబ్లీ పరిధిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య విభేదాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయంలో ఏకంగా చిన్నారెడ్డికి క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు తుంగతుర్తిలో ఎమ్మెల్యే వర్సెస్‌ స్థానిక నాయకత్వం పంచాయతీ ఇంకా సమసిపోలేదు. ఇప్పటికే పాలకుర్తి, గజ్వేల్‌ నియోజకవర్గాల్లోని అంతర్గత గొడవలతో ఫిర్యాదుల మీద ఫిర్యాదులు గాం«దీభవన్‌కు చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోని నేతలతో పార్టీ క్రమశిక్షణా కమిటీ పలుమార్లు భేటీ అయి విచారణ జరిపింది. అయినా ఇక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.  

ఆదిలాబాద్‌లో బాహాబాహి 
ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో అయితే ఈశ్వరమ్మ యాదవ్, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి వర్గాలు ఏకంగా ఇళ్ల ముందు ఆందోళనల వరకు వెళ్లాయి. వీటితోపాటు ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో ఆదిలాబాద్‌ స్థానిక నేతలు బాహాబాహీకి దిగారు. దీంతో ఇరువర్గాలకు పీసీసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు అసలు తమకు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో ప్రాధాన్యతే లేదని ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలు వాపోతున్నారు. బీజేపీ నేతలు చెప్పిన మాట వింటున్నారే తప్ప తమను పట్టించుకోవడం లేదని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు బహిరంగ వేదికపైనా వ్యాఖ్యానించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికితోడు బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు వచ్చిన చోట్ల ఈ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బయటపడుతున్నాయి. 

ఇటీవల పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య విభేదాలు ఇలా ఉంటే పార్టీ అధిష్టానం నియమించిన డీసీసీ అధ్యక్షుల్లో కొంత మందికి స్థానిక పార్టీ నాయకత్వం అసలు సహకరించడమే లేదు. ఇటీవల కాలంలో ముగ్గురు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన డీసీసీ అధ్యక్షులను మార్చాలనే నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు తాజాగా  తాజాగా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ ధిక్కారం ఇటీవలి కాలంలో షరా మామూలే అయిపోయిందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  

సీఎంకు నేరుగా అసమ్మతి సెగ 
కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి సహజమే అయినా ఇటీవలి కాలంలో సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఈ సెగ నేరుగానే తగులుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన వైఖరిని ఖండిస్తూ, పాలనను వేలెత్తి చూపుతూ, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపడుతూ కొందరు పార్టీ నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండగా, మరికొందరు పార్టీలోనే అంతర్గతంగా చక్రం తిప్పుతూ రేవంత్‌కు చెక్‌ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సీఎం రేవంత్‌ టార్గెట్‌గానే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నవారు వేలకోట్లు సంపాదించుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5లక్షలు ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది బహిరంగ రహస్యమేనని పార్టీ వర్గాలంటున్నాయి. 

ఇక, తనకు తెలియకుండానే రైస్‌మిల్లులపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించడం గురించి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతర్గతంగా పావులు కదిపారని, అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగిందనే చర్చ పార్టీలో జరుగుతోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనే చర్చనీయాంశమవుతున్నాయి. ఇది కాంగ్రెస్‌ పార్టీ వల్ల వచ్చిన ప్రభుత్వమని, కీలక నిర్ణయాల్లో పార్టీ జోక్యం ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా రేవంత్‌కు చెక్‌ పెట్టే జాబితాలోకి ఆయన కూడా చేరారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా వరంగల్‌ జిల్లా మంత్రి కొండా సురేఖ కుమార్తె నేరుగా సీఎం పేరును ఉటంకిస్తూ ఆయనకే నేరుగా సవాల్‌ విసిరిన నేపథ్యంలో అసలు కాంగ్రెస్‌ పార్టీలో ఏం జరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలో ఎవరికీ సరైన పట్టు లేదన్న చర్చ సాగుతోంది.  

మంత్రికి నోటీసులు 
సుస్మితా పటేల్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె తల్లి, దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండాసురేఖకు పీసీసీ క్రమశిక్షణకమిటీ నోటీసులు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అదేవిధంగా మాజీ మంత్రి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి కూడా క్రమశిక్షణ నోటీసులు జారీ అయ్యాయి. ఇటీవల వనపర్తిలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై అనుచిత ప్రసంగాల గురించి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఈ నోటీసుల్లో పార్టీ ఆదేశించింది. ఎల్బీనగర్‌ నియోజకర్గంలో బీసీ మహిళా నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్‌నుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ నేత జక్కిడి ప్రభాకర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రకటించడం గమనార్హం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement