బీఓబీ రూ.35,715 కోట్ల బాకీలు రద్దు! | Bank of Baroda Writes Off Rs 35715 Cr Bad Loans Why Refuse to Reveal Defaulters | Sakshi
Sakshi News home page

బీఓబీ రూ.35,715 కోట్ల బాకీలు రద్దు!

Aug 20 2026 2:22 PM | Updated on Aug 20 2026 2:29 PM

Bank of Baroda Writes Off Rs 35715 Cr Bad Loans Why Refuse to Reveal Defaulters

ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఆఫ్ బరోడా రైట్ ఆఫ్ (పుస్తకాల్లో మిగిలిపోయిన వసూలుకాని రుణాలను తొలగించడం) పేరిట భారీగా మొండిబాకీలను రద్దు చేసిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న బడా బకాయిదారులకు సంబంధించి గత ఆరు ఆర్థిక సంవత్సరాల్లో (FY21-FY26 వరకు) ఏకంగా రూ.35,715 కోట్ల రుణాలను బ్యాంక్ రైట్ ఆఫ్ చేసింది. అయితే, ఈ అప్పుల్లో వసూలైన మొత్తం కేవలం రూ.9,946 కోట్లు మాత్రమే. ఈ వసూళ్ల శాతం 28% కన్నా తక్కువే కావడం గమనార్హం.

పుణెకు చెందిన ప్రముఖ ఆర్‌టీఐ కార్యకర్త వివేక్ వేలంకర్ సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరేళ్ల కాలంలో రూ.100 కోట్లకు పైబడిన ఖాతాల రుణ పరిష్కారంలో(సెటిల్‌మెంట్‌) బ్యాంక్ ఆఫ్ బరోడా ఏకంగా రూ.7,817 కోట్ల మొత్తాన్ని ‘హేర్‌కట్’ (తగ్గింపు) కింద వదులుకుంది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లోనే అత్యధికంగా వరుసగా రూ.11,916 కోట్లు, రూ.11,261 కోట్ల రుణాలను టెక్నికల్ రైట్ ఆఫ్ చేశారు. బ్యాంకింగ్ పరిభాషలో టెక్నికల్ రైట్ ఆఫ్ అంటే బ్యాలెన్స్ షీట్‌ మెరుగ్గా చూపించడానికి అప్పులను తొలగించినా వసూళ్ల ప్రక్రియ కొనసాగుతుందని చెబుతారు. అయితే, వాస్తవ రికవరీ గణాంకాలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి.

అడిగిన వివరాలు ఇవ్వలేదు!

రూ.100 కోట్లు దాటిన రుణాలను ఎగ్గొట్టిన బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీల పేర్లను వెల్లడించాలని ఆర్‌టీఐ ద్వారా కోరగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిరాకరించింది. ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(j) ప్రకారం ఇవి మూడో వ్యక్తికి చెందిన వ్యక్తిగత సమాచారం అని, పేర్లు బయటపెడితే గోప్యతకు భంగం కలుగుతుందని చెప్పడం గమనార్హం.

సామాన్య ప్రజలు, రైతులు లేదా చిన్న వ్యాపారులు కొన్ని వేల రూపాయల ఈఎంఐ బకాయి పడితే వారి పేర్లు, ఫోటోలను పత్రికల్లో ప్రకటనలుగా వేస్తూ వేలం పాటలు నిర్వహించే బ్యాంకులు.. వేల కోట్ల ప్రజాధనాన్ని ముంచిన బడా డిఫాల్టర్ల వివరాలను మాత్రం గోప్యత ముసుగులో దాచడం బాధ్యతారాహిత్యానికి, పారదర్శకత లోపానికి నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనంతో నడిచే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటువంటి వ్యవస్థాగత లోపాలు, బడా డిఫాల్టర్ల పట్ల చూపే అపరిమిత ఉదారత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా బంగారం ధర..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement