బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో డేటా చోరీ | Bank of Baroda faces alleged 1TB data leak on dark web | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో డేటా చోరీ

Jul 28 2026 5:34 AM | Updated on Jul 28 2026 5:38 AM

Bank of Baroda faces alleged 1TB data leak on dark web

హ్యాకింగ్‌ గ్రూప్‌ ట్రిపుల్‌ఎక్స్‌ చేతికి 1 టీబీ సమాచారం 

దాదాపు 3 లక్షల మంది కస్టమర్ల వివరాలు డార్క్‌వెబ్‌లో లీక్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ)లో భారీ హ్యాకింగ్‌ చోటు చేసుకుంది. ఏకంగా 1 టీబీ (1000 జీబీ) డేటా లీకయ్యింది. ఇందులో కస్టమర్ల సమాచారంతో పాటు బ్యాంకు అంతర్గత వివరాలు కూడా ఉన్నాయి. సైబర్‌ చోరీకి పాల్పడింది తామేనని ప్రకటించుకున్న ట్రిపుల్‌ఎక్స్‌ అనే హ్యాకింగ్‌ గ్రూప్‌.. ఈ డేటాను డార్క్‌ వెబ్‌లో ఉచితంగా పోస్ట్‌ చేసింది. 

డార్క్‌ వెబ్‌ ప్లాట్‌ఫాం ర్యాన్‌సమ్‌వేర్‌. లైవ్‌లో జూలై 24న పెట్టిన పోస్ట్‌ ప్రకారం ట్రిపుల్‌ఎక్స్‌ తస్కరించిన డేటాలో 1,00,000 నుంచి 3,00,000 వరకు కస్టమర్‌ అప్లికేషన్‌ ఫారంలు ఉన్నాయి. ఖాతా తెరిచేటప్పుడు కస్టమర్లు ఇచ్చిన ఫొటోలు, ఐడెంటిటీ డాక్యుమెంట్లు, సేవింగ్స్‌..కరెంటు ఖాతాల సమాచారం, రుణ దరఖాస్తు రికార్డులు, నెట్‌బ్యాంకింగ్‌ యూజర్‌ వివరాలు, ఎన్నారై, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌ సేవలకు సంబంధించిన సమాచారం ఉంది. 

ఆడిట్‌ రిపోర్టులు, రుణాల మదింపు పత్రాలు, విజిలెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ రికార్డులు, బీవోబీ వరల్డ్‌ ఆడిట్‌ రిపోర్టుల్లాంటి బ్యాంకు అంతర్గత వివరాలు కూడా ఇందులో ఉన్నట్లు నిపుణులు వెల్లడించారు. దీన్నొక ’సైబర్‌ విపత్తు’గా వారు అభివరి్ణంచారు. ఆర్థిక సంస్థల డేటాను ట్రిపుల్‌ఎక్స్‌ దొంగిలించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనే ఇండోనేసియాకి చెందిన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ నెగారా ఇండోనేసియా నుంచి 2 టీబీ డేటాను చోరీ చేసింది.  

ఫోరెన్సిక్‌ విచారణ చేపట్టిన బ్యాంకు.. 
ఒక ఉద్యోగి ఈమెయిల్‌ని ఉపయోగించుకుని హ్యాకర్లు అనధికారికంగా డేటాను దక్కించుకున్నట్లు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ఎక్స్‌లో బీవోబీ వెల్లడించింది. దీన్ని సత్వరం గుర్తించి, నష్టనివారణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. దీనిపై సమగ్ర ఫోరెన్సిక్‌ విచారణ చేపట్టినట్లు వివరించింది. అయితే, లీక్‌ ఎప్పుడు జరిగింది, ఏయే వివరాలు చోరీకి గురయ్యాయి, సదరు ఉద్యోగి హోదా మొదలైన విషయాలను వెల్లడించలేదు. తమ కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టం సురక్షితంగానే ఉందని, అందులోకి హ్యాకర్లు చొరబడలేదని బ్యాంకు స్పష్టం చేసింది. కీలక డేటాను సురక్షితంగా ఉంచేందుకు పటిష్టమైన భద్రత ప్రమాణాలు పాటిస్తున్నామని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement