సాక్షి, న్యూఢిల్లీ: జంతర్ మంతర్‌లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులను ప్రాధాన్యతగా పరిశీలించాలని సోమవారం హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఆదేశించింది. ఈ అంశంపై త్వరితగతిన మధ్యంతర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఈ వ్యవహారాన్ని ప్రస్తావించింది. జంతర్ మంతర్ విద్యార్థుల ఆందోళనల్లో పోలీసుల హింస, బలప్రయోగం ఆరోపణలపై ఇప్పటికే ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ.. మహిళా నిరసనకారులపై హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన ఆరోపణలను ప్రత్యేకంగా పరిశీలిస్తుందని సీజేఐ తెలిపారు.
స్వయంగా విచారణ చేపట్టాలని అభ్యర్థన
మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది శోభా గుప్తా ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్ మీడియాలో, ఇతర వేదికల్లో మహిళలు పోలీసుల చేత వేధింపులకు గురయ్యారనే ఆరోపణలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.
బాధిత మహిళలు నేరుగా కమిటీకి ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అవసరమైతే జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షణలో వాటిని స్వీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
నోడల్ అధికారుల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల్లో మహిళలపై జరిగినట్లు ఆరోపిస్తున్న వేధింపులు, దాడుల అంశాలను ప్రాధాన్యంగా పరిశీలించాలని కమిటీకి సూచించినట్లు తెలిపారు. కమిటీ చైర్‌పర్సన్‌కు నోడల్ అధికారులను నియమించే అధికారం ఇచ్చినట్లు చెప్పారు. నోడల్ అధికారుల నియామకం పూర్తయిన తర్వాత బాధితులు ఎలా ఫిర్యాదు చేయాలి, ఏ విధానంలో ఫిర్యాదులు స్వీకరించాలి అనే అంశాలను కమిటీ ప్రకటిస్తుందని వెల్లడించారు.
జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో కమిటీ
జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో పోలీసుల హింస, నిరసనకారుల చర్యలపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యారోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేయనుంది. పోలీసుల అధిక బలప్రయోగం, మహిళా నిరసనకారులపై లక్ష్యంగా జరిగినట్లు ఆరోపిస్తున్న హింస, వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించనుంది.
మహిళల ఆరోపణలపై అత్యవసర నివేదిక
మహిళా నిరసనకారులపై లైంగిక వేధింపుల ఆరోపణలను సాధారణ అంశంగా కాకుండా ప్రత్యేక ప్రాధాన్యంతో విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.
జంతర్ మంతర్ ఘటనలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం ఇప్పుడు కీలకంగా మారింది. బాధిత మహిళలకు ఫిర్యాదు చేసే స్పష్టమైన మార్గాన్ని ఏర్పాటు చేయడం, ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపడం కమిటీ ముందున్న ప్రధాన బాధ్యతగా మారింది.


