ఒక్క 2025–26లోనే రూ. 92 కోట్లు
2014–15తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని కేంద్ర మంత్రుల బంగ్లాల నిర్వహణ ఖర్చు రికార్డు స్థాయికి చేరింది. లూటియన్స్ బంగ్లాజోన్‌లోని మంత్రుల అధికారిక నివాసాల పునరుద్ధరణ, ఫర్నిషింగ్, మరమ్మతుల ఖర్చు అమాంతం పెరిగిపోయింది. 2014–15లో రూ. 27.47 కోట్లున్న వార్షిక వ్యయం, 2025–26లో మూడు రెట్లు అధికంగా రికార్డు స్థాయిలో రూ. 92.35 కోట్లకు పెరిగింది.
ఈ మరమ్మతులు, పునరుద్ధరణ, నిర్వహణ చూసే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ) ద్వారా ప్రభుత్వం 2014–15 నుంచి 2025–26 మధ్య రూ. 547.68 కోట్లు ఖర్చు చేసింది. పాత నిర్మాణాలు కావడం, ద్రవ్యోల్బణం పెరుగుదలే నిర్వహణ ఖర్చులు పెరగడానికి కారణమని తెలిపింది. 2014 నుంచి 2019 వరకు, మంత్రుల నివాసాల మరమ్మతులు, ఆధునీకరణ కోసం ఏడాదికి సగటున రూ. 26.78 కోట్లు ఖర్చు చేశారు.
2019 నుంచి 2024 వరకు ఈ సగటు వార్షిక వ్యయం దాదాపు రెట్టింపు అయి రూ. 50 కోట్లకు చేరింది. ఇక, 2024–25లో ఈ వ్యయం రూ. 71.98 కోట్లకు చేరింది. ఇక, ఈ ఏడాది అది రూ. 92.35 కోట్లుగా నమోదైంది. కొన్నేళ్లుగా కేంద్ర మంత్రివర్గంలో సుమారు 70 నుంచి 72 మంది వరకు మంత్రులు, సహాయ మంత్రులు ఉంటున్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు రూ. 92.35 కోట్లు ఖర్చవగా, ఒక్కో మంత్రికి సగటున రూ. 1.2 కోట్ల వ్యయం అయినట్లు లెక్క తేలింది. అయితే, వాస్తవంగా ఒక్కో ఇంటి ఖర్చు ఒక్కో విధంగా ఉంటుంది. ఈ మరమ్మతులు, ఆధునీకరణలో తరచూ ఫ్యాన్లు, ఎల్‌ఈడీ లైట్ల వంటి విద్యుత్ పరికరాలు, ప్లంబింగ్ పనులకు, అలాగే ఫ్లోర్ టైల్స్ మార్చడానికి సంబంధించినవి ఉంటాయని కేంద్ర మంత్రి సిబ్బంది ఒకరు వెల్లడించారు. 
ఒక్క మంత్రుల నివాసాలకే..
లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలపై ఖర్చుకు సంబంధించిన వివరాలను సీపీడబ్ల్యూడీ వెల్లడించలేదు. 2004 నుంచి 2009 వరకు ఐదేళ్ల కాలంలో పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రుల బంగళాల నిర్వహణ, ఆధునీకరణకు మొత్తం మొత్తం రూ. 93.50 కోట్లు ఖర్చు చేసినట్లు సెపె్టంబర్ 2009లో ఆర్టీఐ తెలిపింది. పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రుల బంగళాల నిర్వహణకు ఐదేళ్లలో రూ.93.50 కోట్లు కాగా, 2025–26 ఒక్క ఏడాదిలోనే, ఒక్క మంత్రుల నివాసాల నిర్వహణకే రూ.92.35 కోట్లు ఖర్చు చేశారు.


