వైరల్‌ అవ్వాలని.. 3,400 ముద్దులు!! | A Car Full of Kisses Viral With Millions of Views Then the Cops Twist | Sakshi
Sakshi News home page

వైరల్‌ అవ్వాలని.. మూడున్నర గంటలపాటు 3,400 ముద్దులు!!

Aug 25 2026 12:06 PM | Updated on Aug 25 2026 12:35 PM

A Car Full of Kisses Viral With Millions of Views Then the Cops Twist

సోషల్‌ మీడియాలో వైరల్‌ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్‌ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్‌ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..

గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్‌స్టిక్‌ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్‌ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.

విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియా ట్రెండ్‌ను అనుసరించి వీడియోను వైరల్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్‌ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్‌స్టిక్‌ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్‌స్టిక్‌ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసినట్లు చెప్పాడు.

యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్‌ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్‌ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్‌ బోఫాల్‌లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్‌ పేరు ఆదిత్య సికర్వార్‌.

స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ అభిషేక్‌ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్‌నగర్‌–సిటీ సెంటర్‌ ప్రాంతంలో లిప్‌స్టిక్‌ గుర్తులతో ఉన్న స్విఫ్ట్‌ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్‌లో పట్టుకున్నట్లు చెప్పారు.

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్‌ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్‌స్టిక్‌ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్‌ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్‌ మీడియాలో ఇలాంటి ట్రెండ్‌ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్‌ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్‌ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్‌ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్‌ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.

వైరల్‌ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్‌ తెచ్చిపెట్టినా, చివరకు  చలాన్‌తో పాటు పోలీస్‌ స్టేషన్‌లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది.
 

 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement