సీనియర్లకు టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపు | TET Exemption for Senior Teachers: Tamil Nadu Takes Key Step | Sakshi
Sakshi News home page

సీనియర్లకు టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపు

Aug 25 2026 11:02 AM | Updated on Aug 25 2026 11:32 AM

TET Exemption for Senior Teachers: Tamil Nadu Takes Key Step

సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌ షాకిచ్చిన వేళ.. పక్క రాష్ట్రం తమిళనాడు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ టీచర్లకు(2010 కంటే ముందు) టెట్‌ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని మంగళవారం విజయ్‌ సర్కార్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

సీనియర్‌ టీచర్లకు ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) నుంచి మినహాయింపునకు సంబంధించిన తీర్మానాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్‌ నుంచి పూర్తిగా, శాశ్వతంగా మినహాయించాలని అందులో కోరారాయన. ఈ ప్రతిపాదన ద్వారా సీనియర్‌ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజయ్‌ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.

3.28 లక్షల మందికి ప్రయోజనం
2010 ఆగస్టు 23కు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన సుమారు 3,28,701 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్‌ నిబంధన పరిధిలోకి వస్తున్నారని మంత్రి తెలిపారు. వీరిలో చాలామంది ఇప్పటికే 15 నుంచి 20 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పరీక్ష రాయాల్సి రావడం వారి ఉద్యోగ భద్రత, జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివరించారు.

కేంద్రాన్ని కోరిన తమిళనాడు
సీనియర్‌ టీచర్లకు ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ తీర్మానం ద్వారా కోరుతున్నట్లు రాజ్‌మోహన్‌ తెలిపారు. ఇందుకోసం 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23ను సవరించాలని, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE) మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రమోషన్‌లకు ఇబ్బంది లేకుండా..
టెట్‌ నిబంధన కారణంగా ఇప్పటికే సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ ప్రయోజనాలు, ముఖ్యంగా పదోన్నతులు నిలిచిపోకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను కొత్తగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి నుంచి తప్పించడం ద్వారా వారి సర్వీస్‌ ప్రయోజనాలను కాపాడాలని విజయ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

ఏపీలో ఇదే అంశంపై కొంతకాలంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. కనీసం మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఇన్‌ సర్వీస్‌ టీచర్ల టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలో 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయుల విషయంలో టెట్‌ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలన్న తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, NCTE స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: ఆరెస్సెస్‌ స్కెచ్‌.. జెన్‌జీ టార్గెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement