నేటి నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తుల స్వీకరణ
అక్టోబర్ 11 నుంచి 21 వరకు పరీక్షలు
అర్హత మార్కులు తగ్గించాలని కోరిన ఉపాధ్యాయ సంఘాలు
ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఇన్ సర్విస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష–ఆగస్టు–2026) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 11 నుంచి 21 వరకు రోజూ ఉదయం, మధ్యాహ్నం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉండేలా పాస్ మార్కులు తగ్గించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పు చేయలేదు.
150 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60శాతం (90 మార్కులు), బీసీలకు 50శాతం (75 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు 40శాతం (60 మార్కులు) పాస్ మార్కులుగా కొనసాగించనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టంచేశారు. పేపర్–1, పేపర్–2గా పరీక్ష ఉంటుంది. ఒక్కో పేపర్‌కు 150 ప్రశ్నలు, 150 మార్కులు, 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ లేదు. ఈ స్పెషల్ టెట్ ఉత్తీర్ణత ప్రస్తుత ఉద్యోగంలో కొనసాగేందుకు లేదా పదోన్నతికి అవసరమైన అర్హతగా మాత్రమే పరిగణిస్తారని, భవిష్యత్‌లో ప్రత్యక్ష నియామకాలకు మాత్రం ఇది చెల్లదని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.

అందరూ అర్హత సాధించాల్సిందే: కన్వీనర్
రాష్ట్రంలో 2011 సంవత్సరం కన్నా ముందు అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులై ప్రస్తుతం పని చేస్తున్న వారందరూ తప్పనిసరిగా టెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పెషల్ టెట్ కన్వీనర్ ఎం.వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులకు ఎటువంటి సందేహాలు ఉన్నా డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ 8121947387, 7995649286, 6281704160 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
ప్రత్యేక టెట్‌లో మినహాయింపులు ఇవ్వాలి: ఏపీటీఎఫ్
ఇన్ సర్విస్ ఉపాధ్యాయులకు నిర్వహించనున్న స్పెషల్ టెట్‌లో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. డిపార్ట్‌మెంటల్ పరీక్షల్లో ఉన్నట్లుగానే స్పెషల్ టెట్‌లో కూడా అన్ని సామాజికవర్గాలకు అర్హత మార్కులు 40 శాతానికి పరిమితం చేయాలని, ఏ సబ్జెక్టు టీచర్‌కు ఆ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ ప్రశ్నలు మాత్రమే ఇవ్వాలని, మాన్యువల్ (ఆఫ్‌లైన్) విధానంలో పరీక్షలు నిర్వహించాలని కోరారు.


