మళ్లీ జైలు బయటకు రామ్ రహీమ్.. | Convict Gurmeet Ram Rahim Walks Out of Jail Again: 17th Release Since 2020 | Sakshi
Sakshi News home page

మళ్లీ జైలు బయటకు రామ్ రహీమ్..

Aug 25 2026 9:58 AM | Updated on Aug 25 2026 9:58 AM

Convict Gurmeet Ram Rahim Walks Out of Jail Again: 17th Release Since 2020

రోహ్‌తక్‌: హర్యానాలోని రోహ్‌తక్‌లో గల హై-సెక్యూరిటీ సునారియా జైలు తలుపులు మరోసారి డేరా బాబా రామ్‌రహీమ్‌ కోసం తెరుచుకున్నాయి. అత్యాచారం, హత్య కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మరోమారు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ బయటకు వచ్చాడు. 2020 నుంచి ఇప్పటివరకు అతనికి లభించిన 17వ తాత్కాలిక విడుదల ఇది కావడం గమనార్హం.

ఉదయాన్నే జైలు నుంచి విడుదల
మంగళవారం (ఆగస్టు 25, 2026) తెల్లవారుజామున 6:05 గంటల ప్రాంతంలో గుర్మీత్ రామ్ రహీమ్ భారీ భద్రత నడుమ హర్యానాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చాడు. 21 రోజుల ఫర్లోపై విడుదలైన అతను నేరుగా సిర్సాలోని డేరా ప్రధాన కేంద్రానికి బయలుదేరాడు. 30 రోజుల పెరోల్ ముగించుకుని జూన్ 26న తిరిగి జైలుకు వెళ్లిన రామ్ రహీమ్, రెండు నెలలు గడవకముందే మళ్లీ పెరోల్‌ పొందడం చర్చనీయాంశమైంది.

తీవ్రమైన నేరాలు.. జైలు శిక్షలు
ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017 ఆగస్టులో రామ్ రహీమ్‌ను దోషిగా తేల్చి సునారియా జైలుకు తరలించారు. ఈ కేసులో అతనికి రెండు పదేళ్ల జైలు శిక్షలు వరుసగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం, బాబా నేర సామ్రాజ్యాన్ని బయటపెట్టిన సిర్సా పాత్రికేయుడు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో 2019లో అతనికి జీవిత ఖైదు పడింది.

రంజిత్ సింగ్ హత్య కేసులో ఊరట
డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో కూడా గుర్మీత్ రామ్ రహీమ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే, దర్యాప్తులో లోపాలు, బలహీనమైన సాక్ష్యాధారాల కారణంగా 2024లో పంజాబ్, హర్యానా హైకోర్టు రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని ఈ కేసు నుంచి నిర్దోషులుగా విడుదల చేసింది.

చట్టం పరిధిలోనే విడుదలా?
హర్యానా గుడ్ కండక్ట్ ప్రిజనర్స్ (టెంపరరీ రిలీజ్) యాక్ట్, 2022 ప్రకారం ఈ తాత్కాలిక విడుదలలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నిబంధనల ప్రకారం అర్హులైన ఖైదీలు సత్ప్రవర్తన కింద ఒక క్యాలెండర్ సంవత్సరంలో గరిష్టంగా 70 రోజుల పెరోల్, 21 రోజుల ఫర్లో పొందే వెసులుబాటు ఉంది.

2020 నుంచి పెరోల్‌లలో..
2020 అక్టోబర్‌లో మొదటిసారి ఒక రోజు పెరోల్ పొందిన రామ్ రహీమ్ ఆ తర్వాత క్రమం తప్పకుండా జైలు నుంచి బయటకు వస్తూనే ఉన్నాడు. 2021లో తల్లిని చూసేందుకు 12 గంటలు, 2022లో 21, 30, 40 రోజుల వ్యవధిలో మూడుసార్లు, 2023లో 40, 30, 21 రోజుల చొప్పున మూడుసార్లు బయటకు వచ్చాడు.

గత మూడేళ్లలో..
2024లో 50 రోజులు, 21 రోజులు, 20 రోజుల చొప్పున విడుదలై రికార్డు సృష్టించాడు. 2025లో జనవరిలో 30 రోజులు, ఏప్రిల్‌లో 21 రోజులు, ఆగస్టులో 40 రోజులు జైలు బయటే గడిపాడు. ప్రస్తుత 2026 సంవత్సరంలో జనవరిలో 40 రోజులు, మే నెలలో 30 రోజులు పెరోల్ పొందిన డేరా చీఫ్ ఇప్పుడు ఆగస్టులో 21 రోజుల పెరోల్‌తో 17వ సారి బయటకు వచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement